Monday, January 10, 2011

ఐస్‌ క్యూబ్‌ నీటిలో వేస్తే తేలుతుంది. ఎందుకు?,Ice cube floats on water-Why?



ప్రశ్న: ఐస్‌ క్యూబ్‌ నీటిలో వేస్తే తేలుతుంది. ఎందుకు?
జవాబు: నీరు ద్రవస్థితిలో ఉండడానికి కారణం నీటి అణువుల మధ్య హైడ్రోజన్‌ బంధాలు ఉండడమేనని చదువుకుని ఉంటారు. ఈ బంధాల సామర్థ్యం ఉష్ణోగ్రతనుబట్టి మారుతుంది. సుమారు 4 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత వద్ద ఈ సామర్థ్యం అత్యధికంగా ఉండి అణువులు బాగా దగ్గరగా ఉంటాయి. ఇంతకన్నా ఉష్ణోగ్రత పెరిగినా లేదా తగ్గినా కూడా నీటి సాంద్రత తగ్గుతుంది. ఇక సున్నా డిగ్రీల సెంటిగ్రేడ్‌ వద్ద నీరు గడ్డ కట్టి మంచుముక్కగా మారుతుంది. ఈ దశలో దీని సాంద్రత, సుమారు 25 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత ఉన్న నీటి కన్నా తక్కువగా ఉంటుంది.

ఏదైనా ద్రవపు సాంద్రత కన్నా అందులో వేసిన వస్తువు సాంద్రత తక్కువయితే ఆ వస్తువు తేలుతుందని, ఎక్కువయితే మునుగుతుందని, సమానంగా ఉంటే మధ్యలో వ్రేలాడు (suspended)తుందని మనం ప్లవన సూత్రాల్లో (laws of flotation) తెలుసుకున్నాం కదా! ఐసుగడ్డ సాంద్రత, ద్రవనీటి సాంద్రత కన్నా తక్కువ కాబట్టి ఐసుగడ్డ తేలుతుంది.

పెద్దపెద్ద సముద్రాలలో మంచుగడ్డల రూపంలో ఉన్న హిమ శిలలు (ice bergs) తేలి ఉన్నాయి కాబట్టే సముద్రతీరాల్లో పట్టణాలు సజావుగా ఉన్నాయి. ఒకవేళ అవి మునిగే పరిస్థితి ఉంటే, తీర ప్రాంత ఆవాసాలు జలసమాధి అయ్యేవి.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;రాష్ట్ర కమిటీ, జనవిజ్ఞానవేదిక


  • ==============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...