ప్రశ్న: కాంతి వేగం సెకనుకు సుమారు 3 లక్షల కిలోమీటర్లు అని విన్నాను. కాంతి అంత వేగంగా ప్రయాణించడానికి కారణం ఏమిటి?
జవాబు: శక్తి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పలు మార్గాల్లో వెళుతుంది. శక్తి వహనం(conduction), శక్తి సంవహనం (convection), శక్తి వికిరణం (radiation) అనే పద్ధతుల్లో సాధారణంగా శక్తి అధిక ప్రాంతం నుంచి అల్ప ప్రాంతానికి స్వతఃసిద్ధం (spontaneous)గా ప్రవహించడానికి ప్రయత్నిస్తుంది. ఇందులో మొదటి రెండు పద్ధతుల్లో ప్రయాణించడానికి దానికి ఏదైనా మాధ్యమం (medium) అవసరం. పదార్థాలలోని ఎలక్ట్రాన్లు మధ్యవర్తులుగా శక్తి వహన ప్రక్రియలో ప్రయాణిస్తుంది. సంవహనంలో అణువులు, పరమాణువుల చిందరవందర (random)కదలికల ద్వారా శక్తిని బదలాయించుకుంటూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి శక్తిని చేరవేస్తాయి. కానీ వికిరణ ప్రక్రియలో శక్తి ప్రసారానికి మాధ్యమం అవసరం లేదు. కేవలం తనలో ఉన్న విద్యుత్ క్షేత్రాన్ని, అయస్కాంత క్షేత్రాన్ని ఒక క్రమపద్ధతిలో కాలానుగనుణంగా మార్చుకుంటూ శూన్యంలో సైతం వెళ్లగలదు. శూన్యంలో కూడా తిర్యక్ తరంగాల (transverse waves) రూపంలో విద్యుదయస్కాంత క్షేత్రాల్ని కొన్ని కోట్ల సార్లు మార్చుకుంటూ వెళ్లే శక్తి రూపాన్నే మనం కాంతి అంటాము. కాంతి ప్రయాణానికి పదార్థం అవసరం లేకపోవడం వల్ల అడ్డూఅదుపూ లేకుండా ప్రయాణించే కాంతి శూన్యంలో సెకనుకు 3 లక్షల పైచిలుకు వేగాన్ని సంతరించుకుంటుంది. ఇంత వేగంగా ప్రయాణించేది ఈ విశ్వంలో ఇంకేదీ లేదు.
- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; -రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- =====================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...