ప్రశ్న: నిమ్మకాయలను విద్యుత్ బ్యాటరీలుగా మార్చవచ్చంటారు. అది ఎలా సాధ్యం?
జవాబు: మామూలు బ్యాటరీ ఎలా తయారవుతుందో పాఠాల్లో చదువుకుని ఉంటారు. జింకు, రాగి లాంటి వేర్వేరు సన్నని లోహపు పలకలను (ఎలక్ట్రోడ్లు) సజల సల్ఫ్యూరిక్ ఆమ్లము (ఎలక్ట్రోలైట్) ఉండే పాత్రలో దూరదూరంగా ఉంచి, వాటి మధ్య చిన్న విద్యుత్ బల్బును రాగితీగతో అనుసంధానిస్తారు. దాన్నే విద్యుత్ ఘటము (electric cell) అంటారు. కొన్ని విద్యుత్ ఘటాల అనుసంధానమే బ్యాటరీ. ఇక్కడి సూత్రం రెండు వేర్వేరు లోహాల మధ్య విద్యుత్ శక్తి ప్రవహించడమే.
ఒక నిమ్మకాయలో ఒక ఇనుము లేదా జింకు మేకును, కొంత దూరంలో ఒక రాగి నాణాన్ని గుచ్చి వాటి మధ్య రాగి తీగ ద్వారా ఒక చిన్న బల్బును పెట్టి నిమ్మకాయను గట్టిగా పిండితే బల్బు వెలుగుతుంది. ఇక్కడ నిమ్మరసం ఎలక్ట్రోలైట్‌గా పనిచేస్తుంది. కానీ నిమ్మకాయ తగినంత విద్యుత్ ప్రవాహాన్ని కలుగజేయదు. కాబట్టి బల్బు వెలిగినా ప్రకాశవంతంగా ఉండదు. అదే ఐదో, ఆరో నిమ్మకాయలను రాగి తీగ ద్వారా కలిపితే బల్బు ప్రకాశవంతంగా వెలుగుతుంది. ఆ ఏర్పాటు ఎలక్ట్రిక్ బ్యాటరీలాగా పనిచేస్తుంది.
- -ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- ===================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...