ప్రశ్న: మన అరచేతిపై, చేతివేళ్లపై టార్చిలైటు వేసినప్పుడు చేతి వేళ్లు ఎర్రగా కనిపిస్తాయెందుకు?
జవాబు: ప్రపంచంలో వేర్వేరు ప్రాంతాల మనుషుల చర్మం వివిధ వర్ణాల్లో ఉంటుంది. కొందరు కారు నలుపైతే, కొందరు చామనఛాయలోను, గోధుమరంగు, తెలుపు రంగుల్లో ఉంటారు. ఇందుకు కారణం వారి చర్మపు పొరల్లో కాంతి నుంచి, ఉష్ణం నుంచి శరీరాన్ని కాపాడే మెలనిన్ అనే వర్ణద్రవ్య(pigment)రేణువులు వివిధ మోతాదుల్లో ఉండడమే. అయితే చర్మం రంగు ఏదైనా అందరి అరచేతులు, అరికాళ్లు మాత్రం దాదాపు తెల్లగానే ఉంటాయి. దీనికి కారణం వాటి చర్మంలో మెలనిన్ రేణువులు లేకపోవడమే. అందువల్ల ఆ చర్మాలు దాదాపు పారదర్శకం (transparent)గా ఉంటాయి. ఇలా పారదర్శకంగా ఉండే అరచేతి చర్మం మీదకు టార్చిలైటు వేసినప్పుడు బలమైన కాంతి అరచేతి చర్మంగుండా ప్రసరించి చర్మం కిందున్న దట్టమైన రక్తకేశనాళికల దగ్గర పరావర్తనం చెందుతుంది. రక్తకేశనాళికలు దట్టంగా దారపు పోగుల్లాగా, ఎర్రగా ఉండడం వల్ల అక్కడ పరావర్తనం చెందిన కాంతి అరచేతి చర్మపు పైపొరకున్న గరుకుదనం (unevenness) వల్ల వివిధ దిశల్లోకి వెదజల్లబడుతుంది (scattered). అరచేతి చర్మం కిందున్న రక్తకేశనాళికలు చాలా మటుకు ఎరుపు రంగు కాంతినే ప్రతిబింబిస్తాయి కాబట్టి టార్చిలైటు వేసినప్పుడు అరచెయ్యి ఎర్రగా కనిపిస్తుంది.
- ప్రొ||ఎ. రామచంద్రయ్య,-నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక@Eenadu hai bujji.
- ===========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...