ప్రశ్న: సిమెంటును ఎలా తయారు చేస్తారు? నీటితో కలిస్తే అది ఎలా గట్టి పడుతుంది?
జవాబు: సిమెంటు ఒక సంయోగ పదార్థం (compound) కాదు. ఎన్నో ఘన లవణాల సమ్మేళనం. ఇందులో ఉన్న పదార్థాల్ని సంయుక్త సమ్మేళన పదార్థాలు (composits) అంటారు. ఇవి నీటిలో కరగవు. నీటినే తమలో ఇముడ్చుకుంటాయి. సున్నపు రాయి (lime), అల్యూమినియం ఆక్సైడు, ఫెర్రిక్ ఆక్సైడు, ఇసుక (sand) వంటి పదార్థాల్ని బాగా చూర్ణం చేసి గుండ్రంగా తిరిగే గొట్టంలాంటి బట్టీలోకి పంపుతారు. ఇందులో ఈ పొడిని వివిధ స్థాయిల్లో అత్యధిక ఉష్ణోగ్రతకు లోను చేస్తారు. క్రమేపీ పెరిగే ఉష్ణోగ్రతల వద్ద ఈ ఘన చూర్ణాల్లో వివిధ రకాలైన నిరింద్రియ రసాయనిక ప్రక్రియలు (inorganic reactions) జరుగుతాయి. మిశ్రమ ఆక్సైడులు ఏర్పడుతాయి. చివరకి ఇవన్నీ ద్రవస్థితిలోకి వేళ్లేంతగా వేడి చేస్తారు. ఆ స్థితిలో ఏర్పడే రసాయనిక మార్పులు, వాటికి నీటిని ఆహ్వానించే లక్షణాలను చేరుస్తాయి. ఆ ద్రవ మిశ్రమాన్ని చల్లబర్చి బాగా చూర్ణం చేస్తారు. ఈ పొడి ఎంత సూక్ష్మంగా ఉంటే అంత నాణ్యతగల సిమెంటుగా భావిస్తారు. ఈ మిశ్రమానికి నీటిని కలిపినప్పుడు ప్రతి సిమెంటు రేణువుకు మధ్య నీటి అణువులు మొదట సంధాన కర్తలుగా ఏర్పడి అన్నింటినీ దగ్గర చేరుస్తాయి. ఈ దశనే సెట్టింగ్ అంటారు. ఘన, ద్రవ పదార్థాలతో ఏర్పడిన ఈ స్థితిని జెల్ అని కూడా అంటారు. క్రమేపీ నీటి అణువులతో సంధానమైన పదార్థాలు దృఢమైన బంధాలతో రాయిలాగా గట్టి పడతాయి. దీన్నే హార్డెనింగ్ అంటారు. ఇలా సిమెంటు నీటితో కలిసినప్పుడు గట్టిపడిపోతుంది.
- ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్ర కమిటీ, జనవిజ్ఞాన వేదిక @Enadu hai bujji
- ====================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...