ప్రశ్న: తెల్ల కాగితంపై నూనె పడితే, ఆ ప్రాంతం పారదర్శకమవుతుంది. ఎందువల్ల?
జవాబు: కాంతి కిరణాలు పదార్థాలపై పడినప్పుడు కొన్ని కిరణాలు వెనుతిరిగి వస్తాయి. ఈ ప్రక్రియను పరావర్తనం (reflection) అంటారు. కొన్ని పదార్థాల గుండా కాంతికిరణాలు చొచ్చుకుపోతూ వంపునకు గురవుతాయి. ఈ ప్రక్రియను వక్రీభవనం(refraction) అంటారు. తెల్లకాగితం విషయానికి వస్తే అది వెదురులాంటి పీచుపదార్థాలతో తయారవుతుంది. కాగితంలో ఈ పదార్థపు పోగులు వదులుగా ఉండి, ఆ పోగుల మధ్య గాలి బంధించబడి ఉంటుంది. తెల్లకాగితంపై కాంతి పడినప్పుడు ఆ కాంతి కిరణాలలోని ఎక్కువ శాతం ఎక్కువ పాళ్లలో ఉండే పీచుపదార్థపు పోగులపై పడి పరావర్తనం చెంది వెనుతిరిగితే, మిగిలిన తక్కువ శాతం కాంతి కిరణాలు మాత్రమే పోగుల మధ్య ఉండే ప్రాంతాలనుంచి లోపలికి ప్రవేశించగలవు. కాగితంపై పడే కాంతి చాలా వరకు పరావర్తనం చెందడం వల్ల తెల్లకాగితం ప్రకాశవంతంగా ఉంటుంది. కాగితం ఆవలి వైపునకు చొచ్చుకుపోయే కాంతి పరిమాణం తక్కువవడం వల్ల కాగితం కాంతి నిరోధకం (opaque)గా ఉంటుంది.
కాగితంపై నూనె పడినప్పుడు అది కాగితంలోని పోగుల మధ్య గాలి ఉండే ప్రాంతాలలోకి చేరుకుంటుంది. ఆ ప్రాంతంపై పడే కాంతి కిరణాలు పరావర్తనం చెందకుండా, ఎక్కువశాతం చొచ్చుకుపోగలుగుతాయి. అందువల్లనే నూనె పడిన ప్రదేశంలో కాగితం పారదర్శకం (transperent) అవుతుంది. కాంతి పరావర్తనం చెందకపోవడం వల్లనే నూనెలో తడిసిన కాగితం ప్రకాశాన్ని కోల్పోతుంది.
- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- ===========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...