ప్రశ్న: పక్షులు, కొన్ని జంతువులు తమ శరీర ఉష్ణోగ్రతను ఎలా నియంత్రించుకుంటాయి?
జవాబు: పక్షుల శరీర ఉష్ణోగ్రతలు ఏ కాలంలోనైనా స్థిరంగా ఉంటాయి. అవి తమ శరీర ఉష్ణోగ్రతలను జీవక్రియల ద్వారా ఒక పద్ధతిలో నియంత్రించుకుంటాయి. వేసవి కాలంలో పరిసరాల ఉష్ణోగ్రత ఎక్కువైనపుడు వాటికుండే ఈకలను శరీరానికి అతి దగ్గరగా సమతలంలో ఉండేటట్లు తెచ్చుకుంటాయి. దాంతో ఈకలకు, శరీరానికి మధ్య గాలి ఉండకపోవడంతో ఉష్ణ వికిరణం ద్వారా శరీరంలో ఎక్కువైన ఉష్ణం వెలుపలకు పోవడమేకాకుండా వెలుపలి ఉష్ణం శరీరంలోకి చొరబడదు. చర్మంలోని స్వేద గ్రంథులు ఉత్పత్తి చేసే చెమట, శరీర ఉష్ణం వల్ల ఆవిరవడంతో, శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. చలికాలంలో పరిసరాల ఉష్ణోగ్రత బాగా తగ్గినపుడు పక్షులు తమ శరీరంపై ఉన్న ఈకలను బాగా పైకి లేపి వెలుపలి గాలిని శరీరం మధ్య నింపేసుకోవడం ద్వారా శరీరం నుంచి ఉష్ణం వెలుపలికి పోకుండా తమ శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుకుంటాయి.
కుక్కల లాంటి జీవులు వేసవిలో వాటి నాలుకలు వెలుపలకు చాపి వగరుస్తూ ఉండటం ద్వారా నాలుకలపై ఉండే లాలాజలం, వూపిరితిత్తులలోని తేమ ఆవిరి అయ్యేలా చూసుకుంటాయి. తద్వారా ఏర్పడిన చల్లదనం వాటి శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుతుంది. చలికాలంలో ఈ జంతువుల శరీరంలోని ఉష్ణం వాటి శరీరానికి దగ్గరగా ఉండే గాలిని వేడి చేయడంతో, అలా ఏర్పడిన వేడి గాలి పొర, వాటి శరీర ఉష్ణోగ్రత తగ్గిపోకుండా ఒక నిరోధకం లాగా పనిచేస్తుంది. ఆ విధంగా చలికాలంలో కూడా వాటి శరీర ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉంటాయి.
- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్
- ===============================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...