Sunday, October 17, 2010

Dasara festival celebrate Why?, దసరా పండగ ఎందుకు చేస్తారు ?

సంబరాలకు చిరునామా... ఆచారాలను ఆదరించేది... సంప్రదాయాలు వెల్లివిరిసేది... పిల్లలకు వినోదాన్ని పంచేది... అదే సరదాల దసరా పండగ!

రావణున్ని రాముడు చంపిన రోజు,
మహిషాసురుణ్ని దుర్గమ్మ హతమార్చిన రోజు,
అశోకుడు బౌద్ధం స్వీకరించిన రోజు,
పాండవులు వనవాసం అజ్ఞాత వాసమము తో కలిపి పూర్తిచేసిన రోజు ,
చెడుపై మంచి గెలిచిన రోజు. అదే విజయదశమి అని మనకు తెలుసు. మరి ఒక్కోచోట ఈ పండగని ఒక్కోలా జరుపుతారని తెలుసా?

400 ఏళ్ల చరిత్ర: దశ హరా అనే పదం నుంచే దసరా వచ్చింది. ఈ పండగను ముఖ్యంగా కర్నాటకలో ఘనంగా నిర్వహిస్తారు. మైసూర్‌లోని చాముండేశ్వరి ఆలయంలో నవరాత్రి వేడుకలు 400 ఏళ్లుగా జరుగుతున్నాయి. అప్పట్లోఈ సంబరాలను ప్రారంభించిన వడియార్‌ రాజ వంశీకులు ఇప్పటికీ పూజల్లో పాల్గొనడం విశేషం. దసరా నాడు బంగారు అంబారీపై అమ్మవారిని ఊరేగించే కార్యక్రమం కన్నుల పండుగగా జరుగుతుంది. ఇక ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మైసూర్‌ మహారాజా ప్యాలెస్‌ను దసరా పండక్కి లక్ష విద్యుత్‌ దీపాలతో అలంకరిస్తారు. ఇది ప్రపంచ రికార్డు.

చేపలు... కేకులు: షోడశోపచార పేరుతో ఒడిషాలో 16 రోజులపాటు వేడుకల్ని జరుపుతారు. చివరి రోజు అమ్మవారికి పెరుగన్నం, కేకులతో పాటు చేపల వేపుడును నివేదిస్తారు.

చర్చిల్లోనూ: పుస్తకాలకు పూజ చేయడమనే అలవాటును కేరళలోని కొందరు క్రైస్తవులు కూడా పాటించడం విశేషం. కొన్ని చర్చిల్లో పిల్లలకు దసరా రోజు అక్షరాభ్యాసం చేయిస్తున్నారు.

* గుజరాత్‌లో వూరూరా గార్బా, దాండియా రాస్‌ నృత్యాలతో సంబరాలు మిన్నంటుతాయి.

* మహారాష్ట్రలో సీమోల్లంఘనం పేరుతో తమ వూరి పొలిమేరలు దాటి వస్తారు. అలా చేస్తే మంచి జరుగుతుందని నమ్మకం.

* మనం దసరాకి ముందు నవరాత్రులు జరిపితే హిమాచల్‌ ప్రదేశ్‌లోని కులూలో దసరా తర్వాత ఏడు రోజులపాటు వేడుకలు చేసుకుంటారు. విజయదశమినాడు రామలక్ష్మణసీతా విగ్రహాలతో రథయాత్ర జరుపుతారు. విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చి రథాన్ని లాగుతారు.

* మన దేశంలోనే కాకుండా నేపాల్‌, బంగ్లాదేశ్‌, అమెరికా, బ్రిటన్‌, జర్మనీ, మారిషస్‌, ఆస్ట్రేలియా దేశాల్లో కూడా దసరా వేడుకలు జరుగుతాయి.




===========================================

visit My website > Dr.Seshagirirao - MBBS.http://dr.seshagirirao.tripod.com/

No comments:

Post a Comment

your comment is important to improve this blog...