ప్రశ్న: నక్షత్రాలను ఒకోసారి వైట్‌డ్వార్ఫ్, రెడ్ జెయింట్ అనే పేర్లతో ప్రస్తావిస్తారు. అవేంటి?
జవాబు: మనుషులకు బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం లాంటి దశలు ఉన్నట్టే నక్షత్రాలకు కూడా కొన్ని దశలుంటాయి. వాటినే వైట్ డ్వార్ఫ్, రెడ్ జెయింట్, సూపర్‌నోవా, బ్లాక్‌హోల్ పేర్లతో సూచిస్తూ ఉంటారు.
దాదాపు 15 బిలియన్ సంవత్సరాల కిత్రం సంభవించిన 'బిగ్‌బ్యాంగ్' అనే విస్ఫోటం మూలంగా ఈ విశ్వం ఏర్పడిందని చదువుకుని ఉంటారు కదా. అప్పుడు రోదసి అంతా దట్టమైన వాయువులు, ధూళితో కూడిన మేఘాలు వ్యాపించాయి. ఈ మేఘాల్లో 90 శాతం హైడ్రోజన్, కొద్దిపాటి ఇతర వాయువులు, సూక్ష్మ హిమకణాలు, కాస్మిక్ ధూళి ఉండేవి. ఇవన్నీ గురుత్వాకర్షణ శక్తి వల్ల కుంచించుకుపోతూ ఉంటాయి. ఫలితంగా ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇలా వాయు, ధూళి మేఘాల మధ్య భాగంలో ఉష్ణోగ్రత పదిమిలియన్ డిగ్రీల సెంటిగ్రేడ్‌కు చేరుకుంటుంది. సరిగ్గా ఈ స్థితిలోనే అక్కడి హైడ్రోజన్ అణువులు సంయోగం చెంది హీలియం ఏర్పడుతుంది. ఫలితంగా అత్యధిక శక్తి కాంతి రూపంలో వెలువడుతుంది. అదే నక్షత్రం.
రెడ్‌జెయింట్ (అరుణ బృహత్తార): నక్షత్రంలో హైడ్రోజన్ ఇంధనం లభించినంత వరకూ తాపకేంద్రక చర్యలు (thermo nuclear reactions) జరుగుతూనే ఉంటాయి. హైడ్రోజన్ ఖాళీ అయిపోగానే గురుత్వ ప్రభావం వల్ల నక్షత్ర కేంద్రకం కుచించుకు పోవడం మొదలవుతుంది. దాంతో కేంద్రకం అంచుల వద్ద ఉండే కర్పరం (shell)పై వత్తిడి పెరిగి ఉష్ణం ఉద్భవిస్తుంది. అప్పుడు కర్పరంలో మిగిలిన హైడ్రోజన్ పరమాణువుల మధ్య కేంద్రక సంలీనం (nuclear fusion) జరుగుతుంది. దాని ఫలితంగా నక్షత్ర పొరలు వ్యాకోచం చెంది దాని వ్యాసం అనేకరెట్లు ఎక్కువవుతుంది. ఈ దశలో అరుణకాంతిని వెదజల్లే నక్షత్రాన్నే 'రెడ్ జెయింట్' అంటారు.
వైట్‌డ్వార్ఫ్ (శ్వేత వామన తార): అనేక మిలియన్ సంవత్సరాల తర్వాత నక్షత్రంలో లభించే హైడ్రోజన్ పూర్తిగా ఖర్చయిపోతుంది. అప్పుడు రెడ్‌జెయింట్ తన లోని పదార్థకణాలను వెదజల్లుతూ పేలిపోతుంది. నక్షత్రం కాంతిని కోల్పోయి మసకబారుతుంది. నక్షత్రంలో మిగిలిన ద్రవ్యకణాలు ఎక్కువ ఒత్తిడికి లోనవడంతో అది అంతకు ముందున్న ఘనపరిమాణంలో 1/10 వంతుకు తగ్గి మరుగుజ్జులా మారి తెల్లని కాంతిని వెదజల్లుతుంది. ఇదే వైట్‌డ్వార్ఫ్.
====================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.
No comments:
Post a Comment
your comment is important to improve this blog...