జవాబు : సౌర మండలంలో ఉన్న గ్రహాలన్నింటిలో కన్నా భూమికే ఎక్కువ ఆకర్షణ శక్తి ఉందనుకోవడం సరికాదు. భూమి కన్నా అధిక ఆకర్షణ శక్తి ఉన్న గ్రహాలు ఉన్నాయి. ఫ్లూటోను గ్రహంగా పరిగణించడానికి వీల్లేదని తెలిసిన తర్వాత మన సౌర మండలంలో నవగ్రహాల బదులు అష్టగ్రహాలే ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. ఇందులో భూమి కన్నా తక్కువ ఆకర్షణ శక్తి ఉన్న గ్రహాలు, భూమి కన్నా ఎక్కువ ఆకర్షణ శక్తి ఉన్న గ్రహాలూ ఉన్నాయి. సాధారణంగా ఆకర్షణ శక్తిని గురుత్వ త్వరణంతో చూపుతాం. భూమికి ఈ విలువ సుమారు 9.8 మీ/ సె2 ఉంటుంది. కానీ బృహస్పతి గ్రహానికి ఈ విలువ సుమారు 24.8మీ/ సె2 ఉంటుంది. అంటే భూమ్మీద 100 కిలోల బరువు తూగే బియ్యం బస్తా బృహస్పతి మీద సుమారు 250 కిలోల బరువు తూగుతుంది. ఇదే గురుత్వ త్వరణం శనిగ్రహం మీద 10.5మీ/ సె2 కాగా నెప్ట్యూన్ మీద 11.2మీ/ సె2 ఉంది. అంటే 100 కిలోల బస్తా శనిగ్రహం మీద సుమారు 110 కిలోల బరువు తూగగా నెప్ట్యూన్ మీద సుమారు 120 కిలోలు తూగుతుంది. భూమికి దాదాపు చేరువగా బరువు తూగే గ్రహాలు శుక్రగ్రహం, యూరేనస్‌లు. అక్కడ గురుత్వ త్వరణం విలువ సుమారు 8.9 మీ/సె2 ఉంటుంది. మిగిలిన అన్ని గ్రహాల విలువ భూమి కన్నా చాలా తక్కువే ఉంటుంది. ఒక గ్రహం మీద గురుత్వ త్వరణం ఆయా గ్రహపు ద్రవ్యరాశి, ఆ గ్రహానికి, సూర్యుడికి మధ్య దూరం, ఆ గ్రహానికీ సూర్యుడికీ మధ్య ఉన్న ఇతర గ్రహాల ఉనికిని బట్టి నిర్ణయమవుతుంది.
- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; జనవిజ్ఞానవేదిక, శాస్త్రప్రచార విభాగం (తెలంగాణ)
- =========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...