ప్రశ్న: చలికాలంలో కూడా బావిలో నీరు వెచ్చగా ఎలా ఉంటుంది?
- నీలిశెట్టి సుబ్బారావు,
7వ తరగతి, కనిగిరి (ప్రకాశం)
జవాబు: వేడిని గ్రహించడంలో రకరకాల పదార్థాలు వేర్వేరు లక్షణాలను చూపిస్తాయి. అలా చూసినప్పుడు నీరు భూమి కన్నా నిదానంగా వేడెక్కుతుంది. అలాగే నిదానంగా చల్లారుతుంది. ఏదైనా ఒక గ్రాము పదార్థం, ఒక డిగ్రీ సెంటిగ్రేడు ఉష్ణోగ్రత పెరగడానికి కావలసిన వేడిని విశిష్టోష్ణము అంటారు. ఇది నీటికి ఎక్కువ. చలికాలంలో మన చుట్టూ పరిసరాలలో ఉండే గాలి చల్లగా ఉంటుంది. ఇందువల్ల బావి ఉపరితలంలోని నీరు తనలోని ఉష్ణాన్ని పరిసరాలకు ఇవ్వడం ద్వారా చల్లబడుతుంది. అలా చల్లబడిన నీటి సాంద్రత పెరుగుతుంది. అందువల్ల చల్లబడిన నీరు బావి కింది వైపు చేరుతుంది. అదే సమయంలో బావిలోపలి పొరల్లో ఉండే వెచ్చని నీటి సాంద్రత తక్కువ కాబట్టి అది పైకి చేరుకుంటుంది. ఈ ప్రక్రియనే ఉష్ణ సంవహన (convection) క్రియ అంటారు. బావిలో నీరు ఎక్కువగా ఉండడం, ఈ ప్రక్రియ చాలా నిదానంగా జరగడం వల్ల బావిలోని నీరంతా పూర్తిగా చల్లబడిపోయే పరిస్థితి ఉండదు. అందువల్లనే బావి నీరు చలికాలంలో వెచ్చగాను, వేసవిలో చల్లగాను ఉంటుంది.
- ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- =========================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...