ప్రశ్న: జింకు, రాగి వంటి లోహాలు తుప్పు పడతాయి. కానీ బంగారం, ప్లాటినం వంటి లోహాలు పట్టవు. ఎందుకు?
జవాబు: సూర్యుడి లాంటి నక్షత్రాల్లో కేవలం వాయువులే ఉన్నా భూమిలాంటి గ్రహాల్లో వాయువులతోపాటు ద్రవాలు, ఘనపదార్థాలు ఉన్నాయి. వీటి అంతర నిర్మాణాన్ని బట్టి మూలకాలు, లేదా సంయోగ పదార్థాలు అనే రెండు కోవలకు చెందుతాయి. మూలకాల్లో ఒకే రకమైన పరమాణువులు ఉంటాయి. ఉదాహరణకు అల్యూమినియం లోహంలో ఉన్నవన్నీ అల్యూమినియం పదార్థంతో కూడిన పరమాణువులే. కానీ సంయోగ పదార్థాలు, కొన్ని మూలకాలు కలవడం వల్ల ఏర్పడతాయి. వీటిలో వేర్వేరు రకాలైన పరమాణువులు బృందాలుగా ఉంటాయి. ఈ బృందాలను అణువులు అంటాం.
సాధారణంగా మూలకాల కన్నా సంయోగ పదార్థాలు స్థిరంగా ఉంటాయి. స్థిరంగా ఉండడమంటే రసాయనికంగా మార్పును నిరోధించడమే. ఉష్ణగతిక శాస్త్రం ప్రకారం పదార్థాలు మారడానికి కారణం వాటిలో ఉన్న అంతరంగిక శక్తి తగ్గడమే. ఇనుము, జింకు, రాగి, అల్యూమినియం, మెగ్నీషియం వంటి లోహాల మూలకాలకన్నా వాటి సంయోగ పదార్థాలైన లోహ ఆక్సైడ్‌లు తక్కువ శక్తితో ఉంటాయి. కాబట్టి ఆ లోహాలు తుప్పుపట్టడాన్ని ఆమోదిస్తాయి. కానీ బంగారం, ప్లాటినం, స్టెయిన్‌లెస్ స్టీలు వంటి లోహాల మూలకాలకన్నా వాటి సంయోగ పదార్థాలైన లోహ ఆక్సైడ్‌లు ఎక్కువ శక్తితో ఉంటాయి. కాబట్టి అవి తుప్పు పట్టవు.
- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- =======================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...