ప్రశ్న: నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాల మధ్య తేడా ఏమిటి?
జవాబు: నక్షత్రాలు వాటంతటవే వాటి వాయు అంతర్భాగాల్లో అత్యంత ఉష్ణోగ్రత గల శక్తిని ఉత్పన్నం చేస్తాయి. అందువల్ల అవి స్వయంగా వెలుగును వెదజల్లుతాయి. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. కానీ, భూమికి దగ్గరగా ఉండటం వల్ల అతి పెద్దగా, ప్రకాశవంతంగా కనిపిస్తాడు.
కొన్ని సంవత్సరాల క్రితం వరకు మన సూర్యుడికి తప్ప మరే ఇతర నక్షత్రాల చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్లు నిర్ధరణ కాలేదు. ఇటీవలే సూర్యుని చుట్టే కాకుండా మనకు దగ్గరగా ఉండే సుమారు 100 నక్షత్రాల చుట్టూ గ్రహాలు పరిభ్రమిస్తున్నట్టు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.
గ్రహాలు స్వయంగా కాంతిని ప్రసరింపచేయలేవు. అవి తాము పరిభ్రమిస్తున్న నక్షత్రాల వెలుగును మాత్రమే పరావర్తనం చెందించగలవు. మనం సూర్య కుటుంబంలోని గ్రహాలను మాత్రమే చూడగలగడానికి కారణం అవి సూర్యుని నుంచి వెలువడే కాంతిని మాత్రమే పరావర్తనం చెందించడం. అందువల్ల ఆకాశంలోని ఒక గ్రహం ప్రకాశం దాని పరిమాణాన్ని బట్టి కాకుండా అది సూర్యునికి ఏ దిశలో ఉందో, ఎంత దూరంలో ఉందో, అది సూర్యకాంతిని ఎంత ప్రతిభావంతంగా పరావర్తనం చెందిస్తుందో అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది.
చివరగా ఉపగ్రహాలు (చందమామలు) నక్షత్రాల చుట్టూ కాకుండా, గ్రహాల చుట్టూ తిరిగే ఖగోళ వస్తువులు. మన భూమి చుట్టూ ఒక చందమామ తిరుగుతుంటే, మిగతా గ్రహాల చుట్టూ తిరిగే ఉపగ్రహాల సంఖ్య అంతకన్నా ఎక్కువే. మన సూర్యకుటుంబంలోని దాదాపు 140 ఉపగ్రహాలలో కొన్ని గ్రహాల కన్నా పెద్దవి. ఉదాహరణకు గురుగ్రహం చుట్టూ తిరిగే అతి పెద్ద ఉపగ్రహం 'గానిమేడ్' వ్యాసం 5262 కిలోమీటర్లు. అంటే, ఆ ఉపగ్రహం పరిమాణం 4880 కిలోమీటర్ల వ్యాసం ఉండే బుధగ్రహం కన్నా ఎక్కువన్నమాట.
- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్
- =========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...