Monday, September 22, 2014

కొన్ని చెట్ల కింద ఎక్కువ చల్లగా ఉంటుంది.చెట్ల నీడల్లో ఆ తేడాలెందుకు?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: కొన్ని చెట్ల కింద ఎక్కువ చల్లగా ఉంటుంది ఎందుకు?

జవాబు: దాదాపు అన్ని చెట్ల కింద నీడ ఉన్నట్లయితే వేసవి కాలంలో మనకు చల్లని అనుభూతి కలుగుతుంది. చెట్ల ఆకుల పరిమాణాన్ని బట్టి, శాఖల గుబురును బట్టి, దట్టమైన నీడ లేదా పలుచని నీడలు ఏర్పడతాయి. వేర్వేరు చెట్ల కింద వేర్వేరు స్థాయుల్లో చల్లదనాన్ని పొందడాన్ని నీడ తీవ్రతే కాకుండా ఆ చెట్ల ఆకులు మన తల మీద ఎంత ఎత్తులో ఉన్నాయన్న అంశం, ఆ చెట్లకు అందిన నీటి పరిమాణం కూడా ప్రభావితం చేస్తాయి. ఆకుల మధ్యలో, శాఖల మధ్యలో సందులు బాగా ఉన్నట్లయితే నీడ తీవ్రత తగ్గి చల్లదనం తక్కువగా ఉన్నట్లు భావిస్తాం. తలపై చెట్ల ఆకులు చాలా ఎత్తులో ఉన్నట్లయితే, నీడ బాగానే ఉన్నా చుట్టు పక్కల ఉన్న వేడిగాలి మనల్ని పదేపదే తాకుతూ ఉండటం వల్ల మనకు చల్లదనం భావన తక్కువగా కలుగుతుంది. ఒకవేళ చెట్ల ఎత్తు తక్కువగా ఉంటే చల్లదనం భావన బాగా ఉంటుంది. ఇక చివరగా ఆ చెట్లకు అందే నీటి పరిమాణం ఏవిధంగా చల్లదనాన్ని నిర్ణయిస్తుందో గమనిద్దాం.

వేసవిలో ప్రతి చెట్టు నీటిని ఆదా చేసుకోవడానికి ప్రయత్నించడం వల్ల వాటి ఆకుల్లో సాధారణంగా జరిగే బాష్పోత్సేక ప్రక్రియ (transpiration)తగ్గిపోతుంది. తద్వారా వాటి కింద ఉన్న గాలిలో తేమ శాతం తక్కువ ఉంటుంది. కానీ నీటి అవకాశం బాగా ఉన్నట్లయితే ఆ విధమైన ఆకుల్లో బాష్పోత్సేకం బాగా జరగడం వల్ల వాటి ఆకుల, శాఖల ఉష్ణోగ్రత తక్కువ అవుతుంది. వాటి మీదుగా వీస్తున్న గాలి కూడా చల్లగా ఉండి మనకు హాయిగా అనిపిస్తుంది.

- ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌,--శాస్త్ర ప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)

  • ==============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...