Friday, April 23, 2010

ఆకాశం నీలమేల? , Sky is Blue-Why?





ప్రశ్న:
ఆకాశం నీలం రంగులో ఎందుకు ఉంటుంది?
జవాబు:
తెల్లని సూర్యకాంతిలో ఊదా, నీలి, ఆకుపచ్చ, పసుపు, నారింజ, ఎరుపు రంగులు కలిసి ఉంటాయని చదువుకునే ఉంటారు. వివిధ రంగుల కాంతి కిరణాలు వేర్వేరు తరంగదైర్ఘ్యాలు (wave lengths) కలిగి ఉంటాయి. ఊదారంగుకు అతి తక్కువ తరంగదైర్ఘ్యం ఉంటే, ఎరుపు రంగు తరంగదైర్ఘ్యం అన్నింటికన్నా ఎక్కువ. కాంతి కిరణాలు భూవాతావరణంలోని నైట్రోజన్‌, ఆక్సిజన్‌, ధూళి కణాలపై పడినప్పుడు నీలం రంగు ఎక్కువగా పరిక్షేపణం (scattering) చెందుతుంది. అంటే నీలం రంగు ఎక్కువగా చెదురుతుందన్నమాట. తరంగదైర్ఘ్యం తక్కువ కావడం వల్ల నీలవర్ణ తరంగాలు వాతావరణంలోని ఎక్కువ అణువులతో ఢీకొని, ఎరుపు రంగుకన్నా ఎక్కువగా చెదురుతాయి. ఇలా చెదిరిన నీలమే మనకు ఆకాశంగా కనిపిస్తుంది. నిజానికి నీలం కన్నా ఊదారంగు తరంగదైర్ఘ్యం ఇంకా తక్కువ. ఆ ప్రకారం చూస్తే ఆకాశం ఊదారంగు (violet) రంగులోనే కనిపించాలి. అలా ఎందుకు కనిపించడం లేదంటే తెల్లని సూర్యకాంతిలో ఊదా కంటే నీలం రంగు పాలు ఎక్కువగా ఉండడమే. అంతే కాకుండా మన కంటికి ఊదా రంగు కన్నా, నీలం రంగును గుర్తించే శక్తి ఎక్కువగా ఉంది. సూర్యుడు అస్తమించే సమయంలో ఆకాశం మరీ నీలంగా ఉంటుంది. దీనికి కారణం వాతావరణం పైపొరలోని ఓజోన్‌ అస్తమిస్తున్న సూర్యకాంతిలోని ఎరుపు రంగును పూర్తిగా పీల్చేసుకోవడమే.


  • ===============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Thursday, April 22, 2010

వేపచెట్టు పాలు కార్చిందేం? , Neem Tree shed Milk - why?




ప్రశ్న:
నేను వేప చెట్టు నుంచి పాలు కారడం చూశాను. ఇలా ఎందుకు జరుగుతుంది? ఈ పాల వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా?

జవాబు:
వేపచెట్టు లేత వయసులో ఉన్నప్పుడు బెరడు నుంచి కొంచెం పాలు వస్తాయి. పెద్ద వేపచెట్టు పచ్చి కాయల్ని నొక్కినా పాలు రావడం చూసే ఉంటారు. మర్రి, జిల్లేడు, రావి, మేడి లాంటి చెట్ల ఆకుల్ని, కాయల్ని, కొమ్మల్ని విరిచితే పాలు వస్తాయి. రబ్బరు చెట్టు బెరడు నుంచి వచ్చే పాల నుంచి రబ్బరు కూడా తయారు చేస్తారు. అయితే ఇవి మనం తాగే పాలు లాంటివి కావు. తెల్లనివన్నీ పాలు కాదంటే ఇదే. వేప చెట్టు నుంచి వచ్చేవి కూడా ఇంతే. ఏపుగా పెరిగే వేప చెట్లు కాండం మీద బెరడుకు పగుళ్లు వస్తాయి. ఆ నెరదల్లో ఎన్నో జీవులు నివాసం ఏర్పరుచుకుంటాయి. చెదపురుగులు, చీమలు, తెల్లపురుగులతో పాటు కొన్ని శిలీంద్రాలు (fungi) కూడా ఉంటాయి. అలాంటి లక్షలాది పురుగులు, గుడ్లు, లార్వాలు ఉన్న చోట బెరడు మీద వత్తిడి ఏర్పడినా, వర్షం వచ్చినా అవన్నీ చచ్చిపోతాయి. వాటి కణాలు చిట్లిపోతాయి. చాలా కీటకాల రక్తం, కణస్రావం తెల్లగా ఉంటుంది. ఇవే ఆ చెట్టు నుంచి తెల్లగా కారుతాయి. దీన్ని పాలనుకోవడం, ఆ చెట్టుకి మహత్మ్యం ఉందనుకోవడం అశాస్త్రీయం.

  • =============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

ఎడారులు ఏర్పడేదెలా? , Deserets are formed-How?







ప్రశ్న:
ఎడారులు ఎలా ఏర్పడుతాయి?

జవాబు:
ఎడారుల్లో అనేక రకాలున్నాయి. పూర్తిగా ఇసుకతో నిండి ఉండేవాటితో పాటు, బల్లపరుపుగా ఉండే రాతి నేలలు, అత్యంత వేడిగా ఉండేవి, చాలా చల్లగా ఉండే ఎడారులు కూడా ఉన్నాయి. ఎడారుల్లో వర్షపాతం అత్యల్పంగా ఉంటుంది. ఇవి నివాసయోగ్యం కాని నిర్జన ప్రదేశాలు.

ఎడారులు ఏర్పడడానికి కారణం అనేకం. భూమిపై గాలి ఒకే దిశలో ఎక్కువ దూరం పయనిస్తే, ఉష్ణం వల్ల ఆ గాలిలోని తేమ ఆవిరై, రాన్రాను ఆ గాలి పొడిగా మారుతుంది. ఈ పొడిగాలులు వీచినంత మేర భూమిపై ఉండే తేమ కూడా ఆవిరైపోతుంది. అలా ఆ భూభాగం ఎండిపోవడం ఆరంభిస్తుంది. తడిలేక పోవడంతో ఆ ప్రదేశంలోని మొక్కలు, చెట్లు ఎండిపోయి నేల సారం కోల్పోతుంది. క్రమేణా ఆ ప్రాంతం ఎడారిగా మారుతుంది. ఎడారులు చాలా వరకూ భూమధ్య రేఖకు దగ్గరగా ఉంటాయి. దీనికి కారణం ఆ ప్రాంతంలో వేడి అధికంగా ఉండడంతో నేలలో ఏమాత్రం తడి ఉండకపోవడం. భూమధ్య రేఖకు దూరంగా ఉన్నా, సముద్రాలకూ భూభాగానికీ మధ్య అనేక పర్వత శ్రేణులుంటే, తేమగాలులు ఆ పర్వతాలను దాటి అవతలి వైపు వెళ్లకపోవడం వల్ల ఇటువైపే వర్షాలు కురిసి, ఆవలి వైపు ఎడారిగా మారే పరిస్థితులు ఏర్పడుతాయి. ఈ పరిస్థితులున్న ప్రదేశాల్లో శిలలు నిత్యం గాలుల తాకిడికి అరుగుదలకు లోనవుతూ, రాన్రానూ విచ్ఛిన్నమవుతూ వివిధ పదార్థాలుగా విడిపోతాయి. వాతావరణంలో అప్రయత్నంగా కురిసే యాసిడ్‌ వర్షాల వంటి రసాయనిక సంఘటనల వల్ల ఆ శిలాభాగాలు ఖనిజాలుగా, అల్యూమినియం ఐరన్‌ ఆక్సైడ్‌లుగా, సిలికాన్‌లా మారిపోతాయి. వీటిలో కొన్ని భాగాలు కలిసి బంకమన్నుగా మారితే, మరికొన్ని ఇసుకగా మిగిలిపోతాయి. ఎడారుల్లో ఇసుక ఏర్పడేది శిలలు విచ్ఛిన్నమవడం వల్లనే.



courtesy : Eenadu News paper
  • ====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

దానికంత పెద్ద చెవులెందుకు? , Elephant Ears are big-Why?




ప్రశ్న:
ఏనుగుకు అంత పెద్ద చెవులు ఉండడం వల్ల ఉపయోగం ఏమిటి?

జవాబు:
సాధారణంగా నాలుగు కాళ్ల జంతువులకు తోక పొడవుగా ఉండడం వల్ల శరీరం మీద వాలే ఈగల్ని, దోమల్ని, ఇతర పదార్థాలను విదిలించుకుంటాయి. శరీరంలో వెనుక సగభాగానికీ తగిలేలా తోక పొడవు ఉంటుంది. మిగతా భాగాన్ని పొడవైన మెడ, మూతి సాయంతో శుభ్రపరుచుకుంటాయి. ఇక ఏనుగుది భారీ శరీరం. తోక చూస్తే చిన్నది. తొండం ఉన్నా మెడ పొట్టిగా కదపలేని విధంగా ఉండడం వల్ల శరీరమంతా తడుముకోలేదు. ఇక్కడే దాని చెవులు ఉపయోగపడతాయి. చేటల్లాగా ఉండి మృదువుగా కదిలే చెవుల సాయంతో అది కీటకాలను తోలుకోగలదు. ఇంత పెద్ద చెవుల వల్ల దానికి మరో ప్రయోజనం కూడా ఉంది. ఏనుగు వేడిని అంతగా తట్టుకోలేదు. అందుకనే స్నానం చేసిన వెంటనే అధమ ఉష్ణవాహకమైన బురదను, ఇసుకను ఒంటిపై జల్లుకుంటుంది. చెవుల్లో దానికి సూక్ష్మమైన రక్త నాళికలు విస్తరించి ఉంటాయి. వీటిని తరచు వూపడం వల్ల దాని శరీరానికి గాలి తగలడంతో పాటు, లోపలి రక్తం కూడా చల్లబడే అవకాశం ఉంటుంది. ధ్వని తరంగాలను ఒడిసి పట్టుకోవడంలో కూడా ఈ చెవుల ప్రాధాన్యత ఉంటుంది.

Wednesday, April 21, 2010

నోట్లోంచి ఆ పొగలేంటి?, Smoke from mouth-what?




ప్రశ్న:
ఉదయం వేళల్లో అప్పుడప్పుడు మాట్లాడుతుంటే నోటి లోంచి పొగలు వస్తాయెందుకు?
జవాబు:
అవి పొగలు కావు. పైగా ప్రతి ఉదయం అలా జరగదు. కేవలం శీతాకాలంలో బాగా చలిగా ఉన్నప్పుడే ఇలా జరుగుతుంది. మనం మాట్లాడుతున్నప్పుడు శ్వాసప్రక్రియలో నిశ్వాసాన్ని (exhalation) వదులుతాము. అంటే మాటలతో పాటు ఊపిరితిత్తుల నుంచి గాలి కూడా బయటపడుతుందన్నమాట. ఏ కాలమైనా మన శరీర ఉష్ణోగ్రత మాత్రం 98.4 డిగ్రీల ఫారెన్‌హీట్‌ (సుమారు 37 డిగ్రీల సెంటిగ్రేడు) దగ్గర స్థిరంగా ఉంటుంది. శీతకాలంలో మన నోటి లోంచి బయటకి వచ్చే గాలిలో నీటి ఆవిరి ఉంటుంది. బయటి ఉష్ణోగ్రత బాగా తక్కువగా ఉండడం వల్ల ఆ నీటి ఆవిరిలో చాలా భాగం వాయు స్థితి నుంచి ద్రవస్థితికి మారుతుంది. ఆ క్రమంలో నీటి ఆవిరిలోని అణువులు సూక్ష్మబిందువులుగా తుంపరగా మారతాయి. వాటి మీద సూర్యకాంతి పడి, అది అన్ని వైపులకు విక్షేపణ (scattering) చెందుతుంది. అందువల్లనే అది పొగలాగా కనిపిస్తుంది. ఐసుగడ్డ మీద పొగలున్నట్టు కనిపించడం, జెట్‌ విమానం వెనుక పొగ కనిపించడానికి కూడా కారణం ఇదే.
  • =================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Tuesday, April 20, 2010

ఎత్తైన క్రీస్తు విగ్రహం చరిత్ర ఏమిటి?,Highest Statue of Jesus Christ history?




కొత్త వింతల్లో ఒకటి... ప్రపంచంలోనే ఎత్తయినది... అదే క్రీస్తు విగ్రహం! దాన్నిప్పుడు తీర్చిదిద్దుతున్నారు!

ఓ పెద్ద కొండ. దాని అంచున ఎత్తయిన దిమ్మ. దానిపై నిలబడి చేతులు రెండు వైపులా చాచిన ఓ పెద్ద క్రీస్తు విగ్రహం. ఆర్ట్‌డికో పద్ధతిలో పోతపోసిన విగ్రహాల్లో ఇది ప్రపంచంలోనే ఎత్తయినది. ఆ మధ్య కొత్తగా ప్రకటించిన ఏడు ప్రపంచ కొత్త వింతల్లో ఇది కూడా ఒకటి. ఇదెక్కడుందో తెలుసా? బ్రెజిల్‌లోని రియోడిజనీరోలో ఓ కొండ మీద. ఆ కొండే 2296 అడుగుల ఎత్తుగా ఉంటుంది. దాని మీద సుమారు 30 అడుగుల ఎత్తయిన దిమ్మ. ఆ దిమ్మపై సుమారు 100 అడుగుల విగ్రహం. దీని వెడల్పు 98 అడుగులు. అందుకే ఈ భారీ విగ్రహం ఆ చుట్టుపక్కల వందల కిలోమీటర్ల దూరం నుంచి కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇంతకీ ఈ విగ్రహం పేరేంటో తెలుసా? 'క్రీస్ట్‌ ద రెడీమర్‌'.

బ్రెజిల్‌ పేరు చెబితే చాలు గుర్తొచ్చేంతలా ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఈ విగ్రహాన్ని ఇప్పుడు మరింత పటిష్టంగా తీర్చిదిద్దుతున్నారు. అక్కడి వాతావరణానికి సరిపోయే పదార్థాలతో దానికి కోటింగ్‌ వేస్తున్నారు. ఆ మధ్య ఓ పెద్ద తుపాను బ్రెజిల్‌ని వూపేసింది. ఎన్నో చెట్లు, భవనాలు నేలకూలాయి. అంతటి తుపాను ధాటికి కూడా ఈ విగ్రహం చెక్కచెదరలేదు. ఎందుకంటే దాని పైపూతలకు వాడిన సోప్‌స్టోన్‌ పదార్థం మెరుపులు, పిడుగుల నుంచి రక్షణ కల్పించిందట. అయితే ఆ భారీ వర్షాల వల్ల అక్కడక్కడ కొద్దిగా పెచ్చులూడింది. అందుకే ఇప్పుడీ ముస్తాబు.

బ్రెజిల్‌లో ఒక భారీ క్రీస్తు విగ్రహాన్ని నిర్మించాలనే ఆలోచన 1850 నాటిది. కానీ అప్పటి యువరాణి ఇసాబెల్‌ పెద్దగా ఆసక్తి చూపలేదు. తిరిగి 1921లో ప్రయత్నాలు మొదలయ్యాయి. ఎన్నో నమూనాలు పరిశీలించి, చివరికి చేతులు చాపినట్టు ఉన్న నమూనానే ఎంచుకున్నారు. ఎందుకంటే దేవుడికి అందరి పట్లా అంత ప్రేమ ఉంటుందని చెప్పడానికి. ఆపై ప్రజల నుంచి విరాళాలు సేకరించి నిర్మాణం ప్రారంభించారు. తొమ్మిదేళ్ల పాటు శ్రమించి 1931లో పూర్తిచేశారు. ఈ విగ్రహం బరువెంతో తెలుసా? 700 టన్నులు. అప్పట్లో దీని నిర్మాణానికి 11 కోట్ల రూపాయలపైనే అయ్యింది. ఇది 2007 జులై 7న ప్రకటించిన ఏడు కొత్త వింతల్లో చోటు దక్కించుకుంది.
  • ================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

చంద్రుడు గుడి కడతాడా? , Circles arround moon Cause?




ప్రశ్న:
రాత్రివేళల్లో అప్పుడప్పుడు చంద్రుడి చుట్టూ వలయాలు కనిపిస్తాయి. అవి చూసిన పెద్దవాళ్లు చంద్రుడు గుడి కట్టాడంటారు. దీనికి కారణం ఏమిటి?

జవాబు:
చంద్రుడి చుట్టూ అలా ఏర్పడే వలయాన్ని ఇంగ్లిషులో 'హాలో' అంటారు. కొన్ని ప్రాంతాల్లో దీన్నే వరదగుడి అంటారు. వాతావరణంలో మంచు స్ఫటికాలతో కూడిన మేఘాలు ఉన్నప్పుడు, వాటి ద్వారా చంద్రుని కాంతి ప్రసరించినప్పుడు ఈ వలయం ఏర్పడుతుంది. అలాంటి మేఘాల్లో సాధారణంగా ఆరుముఖాలున్న సూక్ష్మమైన మంచు స్ఫటికాలు ఉంటాయి. వీటి గుండా వెళ్లే చంద్రుని కాంతి కిరణాలు వక్రీభవనం (refraction) చెందితే, వీటి ఉపరితలంపై పడిన కాంతి పరావర్తనం (reflection) చెందుతుంది. వక్రీభవనం వల్ల చంద్రకాంతి విశ్లేషణ చెంది రంగురంగులాగా కనిపిస్తుంది. పరావర్తనం చెందిన కాంతి తెల్లని రంగులోనే వలయంలాగా ఏర్పడుతుంది. సాధారణంగా చంద్రకాంతి ఆ మంచు స్ఫటికాలపై 22 డిగ్రీల కోణంలో పడుతుంది కాబట్టి, అంతే వ్యాసం ఉండే వలయం చంద్రుని చుట్టూ ఏర్పడుతుంది. వలయం లోపలివైపు ఎరుపురంగు, బయటివైపు నీలం రంగు ఉంటాయి. ఈ వలయం ఏర్పడినప్పుడు వర్షం కరిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేఘాల్లోని మంచుస్ఫటికాలు ద్రవీభవించి చినుకుల్లా కురిసే అవకాశం ఉంది కదా!
  • =========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

భూమి నుంచి జారిపోరేం?, Why don't we fall from Earth surface





ప్రశ్న:
భూమి గుండ్రంగా ఉంటుంది కదా? మరి భూమికి కింది వైపు ఉన్నవారు కింద పడిపోరెందుకని?

జవాబు:
భూమి మీద ఏదైనా వస్తువు ఉండడానికి కారణం భూమి ఆ వస్తువును తన కేంద్రం వైపు ఆకర్షించడమే. ఈ ధర్మాన్ని గురుత్వం (గ్రావిటీ)అనీ, దాని వల్ల కలిగే శక్తిని గురుత్వాకర్షణ శక్తి అని అంటారు. భూమి మీద ఉండే వస్తువులతో పోలిసే భూమి పరిమాణం చాలా చాలా ఎక్కువ. అందువల్లనే భూమి ఎక్కడికక్కడ సమతలంగా, బల్లపరుపుగా ఉన్నట్లు కనిపిస్తుంది.

ఉదాహరణకు ఒక ఫుట్‌బాల్‌పై ఒక చీమ తిరుగుతోందనుకోండి. మనకి ఆ బంతి గుండ్రంగానే కనిపిస్తున్నా, చీమకు మాత్రం బంతిపై ప్రతి భాగం ఎక్కడికక్కడ బల్లపరుపుగానే అనిపిస్తుంది. అలాగే మన భూమిపై ఏ ప్రదేశం మీద ఉన్నా, మనం కిందకి ఆనుకునే దిశ మన పాదాల నుంచి భూకేంద్రం వైపు ఉన్న దిశే అవుతుంది. ఆ దిశలోనే భూమ్యాకర్షణ శక్తి పనిచేయడం వల్ల భూమిపై ఉండే ప్రతి వస్తువూ భూమిని అంటిపెట్టుకుని ఉంటుందే తప్ప భూమి నుంచి పడిపోదు. అందువల్ల భూమికి కింది వైపు అనే ప్రశ్నే తలెత్తదు.
  • =================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

ఆ పీడనాల పదాలేమిటి? , Atmosphearic Pressures meanig ?




ప్రశ్న:

వాతావరణానికి సంబంధించి అల్పపీడన ద్రోణి, వాయుగుండం వల్ల భారీ వర్షాలు అని చెబుతుంటారు. అంటే ఏమిటి?

జవాబు:
గాలులు ఎక్కువగా గుమిగూడి ఉంటే ఆ ప్రాంతంలో అధిక పీడనమనీ, పల్చగా ఉండే ప్రాంతంలో అల్పపీడనమనీ అనుకోవచ్చు. గాలులు నిరంతరం కదులుతూ ఉండడం వల్ల ఈ రెండు పీడనాలూ ఏర్పడుతూనే ఉంటాయి. గాలులు కిందకీ, పైకీ పయనిస్తుంటాయి. ఒక ప్రాంతంలో గాలులు చాలా నెమ్మదిగా దిగుతుంటే అక్కడ అధిక పీడనం ఉందనుకోవచ్చు. అలా దిగిన గాలులు వేడెక్కి తిరిగి పైకి వెళతాయి. భూమిని ఆనుకుని ఉన్న గాలి వేడెక్కినప్పుడు అది వ్యాకోచించి తేలికవుతుంది. అలా తేలికైన గాలులు పైకి ప్రయాణిస్తాయి. అవి పైకి వెళ్లడంతో ఆ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. అందువల్ల వేరే ప్రాంతాల్లో ఉండే గాలులు ఆ ప్రాంతం వైపు వేగంగా కదులుతాయి. వేడెక్కి పైకి బయల్దేరిన గాలులు భూమి వాతావరణం పైపొరల్లోకి వెళ్లేకొద్దీ చల్లబడుతుంది. దాని వల్ల ఆ గాలిలోని నీటి ఆవిరి ఘనీభవించి సూక్ష్మబిందువులు, మంచు స్ఫటికాలుగా మారతాయి. ఈ గాలుల కదలికల వల్ల ఒకోసారి ఆ ప్రాంతంలో సుడులు ఏర్పడుతాయి. సుడుల వల్ల గాలి కదలికలు మరింత తీవ్రమై ఎక్కువ గాలి పోగుపడడం, పైకి వెళ్లే గాలులు చల్లబడి పెద్ద పెద్ద మేఘాలుగా ఏర్పడడం జరుగుతుంది. అందువల్లనే అల్పపీడనం ఏర్పడిన ప్రాంతాల్లో వర్షాలు బాగా కురుస్తాయి. అల్ప పీడనం మరీ తీవ్రంగా మారిపోతే దాన్ని వాయుగుండం అనీ, అది ఇంకా బలపడితే తుపాను అనీ అంటారు. అల్ప పీడనాలు అన్ని ప్రాంతాల్లో ఏర్పడినా, సముద్రాల మీద వాటికి ఎలాంటి అడ్డంకులు ఉండని నేపథ్యంలో గాలుల అలజడి తీవ్రమై, సుడుల్లాగా మారే అవకాశాలు ఎక్కువ. అందువల్లనే తుపానులు కేవలం సముద్రాల్లోనే ఏర్పడుతూ ఉంటాయి. సముద్రాలు వెడెక్కిన కొద్దీ నీటి ఆవిరి ఏర్పడుతుంది. ఇదంతా గాలుల సుడుల వల్ల పైకి పోయి బాగా చల్లబడి మేఘాలుగా మారతాయి. ఈ సుడులు తీరాన్ని తాకగానే చెదరిపోవడంతో మేఘాలు చెల్లాచెదరై ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. మనకు వినిపించే రకరకాల పేర్లనీ ఆ గాలుల కదలికల తీవ్రతను తెలియజెప్పేవే.



-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
  • ============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Saturday, April 17, 2010

ఆలయం అంటే అర్ధం ఏమిటి?, Alayam Telugu meaning ?

ఆలయం అంటే ... పవిత్ర నివాస స్థలము . A moral place of Living.
ఆలయాలు చాలా ఉన్నా కొన్ని ముఖ్యమైనవి .
  1. దేవాలయము (Temple). దేవుడు నివాసముండే ప్రదేశం
  2. గ్రంధాలయం (Library)-చదువుకునేందుకు పుస్తకాలు ఉండే ప్ప్రదేశం ,
  3. వైద్యాలయము (Hospital) - రోగులకు చికిత్స చేసే ప్రదేశం ,
  4. విధ్యాలయము (School) - చదువు చెప్పే ప్రదేశం ,
  5. న్యాయాలయము (Court).- న్యాయమైన తీర్పు నిచ్చే ప్రదేశం ,
  • ================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Monday, April 05, 2010

చేతుల్లో గీతలేంటి?,Palm(Hand)Creases-how do they form?






ప్రశ్న: మన రెండు అరచేతుల్లో గీతలు ఎప్పుడు, ఎందుకు, ఎలా ఏర్పడతాయి?

జవాబు: మనిషి అరచేతుల్లో గీతలు ఎవరో గీచినవి కావు. గర్భంలో శిశువు ఎదిగే క్రమంలో ఏర్పడినవే. అరచేతిలో ముడుచుకునే కీళ్లు ఎక్కువ. ఇక్కడి చర్మాన్ని, కండరాలకు దిగువ ఉండే అస్థిపంజరపు ఎముకలకు అనుసంధానం చేసే ఏర్పాటిది. ఆయా ప్రాంతాల్లో ఉండే నార కణాలు (fibrous tissue) చర్మాన్ని లోపలికి గుంజి పడతాయి. కీళ్లు మడిచే ప్రాంతాల్లో ఎక్కువగాను, మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తరు బలంతోను ఇవి అరచేతి చర్మాన్ని పట్టి ఉంచుతాయి. ఇవి ఉండే చోటల్లా చర్మం లోపలికి ముడుచుకోవడం వల్ల గీతల్లా కనిపిస్తాయి. మన ఇంట్లో మంచాలపై వాడే దూది పరుపులను ఓసారి గమనించండి. దూది చెదిరిపోకుండా దారంతో కుట్టి ఉంచిన చోట గాడులు ఏర్పడి ఉంటాయి కదా. అలాగే ఈ నారకణాల వల్ల చర్మం ఎముకలకు కుట్టినట్టుగా అమరి ఉంటుందన్నమాట.



  • ============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

బంగాళా దుంప చరిత్ర ఏమిటి ?, Potato History-What?




ఈ దుంప పుట్టింది దక్షిణమెరికాలో. ప్రపంచంలో మొత్తం 4000 రకాల బంగాళాదుంపలు ఉన్నాయని తెలుసా? పైగా ఎన్ని సైజులో. బఠానీ గింజ పరిమాణం నుంచి యాపిల్‌ కాయంత వరకు ఉంటాయి. మీరు సాధారణంగా పసుపుగా ఉండే దుంపల్నే చూసుంటారు, కానీ ఇవి ఎరుపు, నీలం, నలుపు ఇలా బోలెడు రంగుల్లో ఉంటాయి .

క్రీస్తుపూర్వం 3000 కాలంలో దక్షిణమెరికాలోని పెరూ ప్రాంతంలో 'ఇంకా ఇండియన్లు' అనే జాతి ప్రజలే మొదటిసారి వీటిని పండించారని చెబుతారు. ఇప్పుడు ప్రపంచంలో మొక్కజొన్న, గోధుమ, బియ్యం తరవాత ఎక్కువ మంది బంగాళాదుంపనే తింటున్నారు. ఇది 1537లో యూరోప్‌ దేశాలకు చేరింది. మొదట ఆ దేశాల్లో దీనిని విషంలా చూసేవారు. జర్మనీ రాజు ఫ్రెడెరిక్‌ విలియం ఈ దుంపలోని సుగుణాల్ని తెలుసుకుని వీటిని పండించాల్సిందిగా ఆదేశించాడు. ఆపై వీటివాడకం పెరిగింది. బంగాళా దుంపలు 1621లో ఉత్తర అమెరికాకు, 1719లో ఇంగ్లాండుకు పరిచయం అయ్యాయి.


* బంగాళాదుంపలో 80 శాతం నీరే ఉంటుంది.
* అమెరికాలో ప్రతి ఏడాది బంగాళాదుంపతో చేసిన ఫ్రెంచ్‌ఫ్రైస్‌ 40 లక్షల టన్నులు అమ్ముడవుతున్నాయి.
* ఒక అమెరికన్‌ ఏడాదికి 70 కిలోల దుంపల్ని తింటే, జర్మన్‌ 100 కిలోలు తింటాడని అంచనా.
* 1995లో కొలంబియా నౌకలో వీటిని అంతరిక్షంలోకి తీసుకెళ్లారు.
* ప్రపంచంలో బంగాళాదుంపల్ని ఎక్కువ పండిస్తున్నది చైనా. ఆ తరువాతి రెండు స్థానాల్లో రష్యా, ఇండియాలు ఉన్నాయి.

  • =============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Thursday, April 01, 2010

కుక్కర్‌లో రహస్యమేంటి?, Pressure cooker Secret-what ?





ప్రశ్న: ప్రెషర్‌ కుక్కర్‌లో అన్నం అంత త్వరగా ఎలా ఉడుకుతుంది?

జవాబు: ఆహారం ఉడకడం అంటే ఆ పదార్థాల్లో పెద్ద పెద్ద అణువులు తమ బంధాలు తెంచుకుని నీటితో చర్య జరపడం ద్వారా చిన్న చిన్న అణువులుగా మారడమే. ఇలా జరగడానికి ఎక్కువ శక్తి కావాలి. అది వంటకి వాడే వేడి ద్వారా సమకూరుతుంది. వేడి ఎంత ఎక్కువ ఉంటే అంత తొందరగా వంట అవుతుంది. అయితే మామూలు పరిస్థితుల్లో సాధారణ వాతావరణ పీడనం దగ్గర మనం 100 డిగ్రీల సెంటిగ్రేడుకి మించి ఉష్ణోగ్రతను అందించలేం. ఎందుకంటే ఆ ఉష్ణోగ్రత దగ్గరకు వచ్చేసరికి నీరు ఆవిరైపోతుంది. అయితే అధిక పీడనంలో ఉంచితే నీరు 100 డిగ్రీల సెంటిగ్రేడు వద్ద ఆవిరి కాదు. దాని భాష్పీభవన ఉష్ణోగ్రత పెరుగుతుంది. అంటే నీరు ఆవిరై పోకుండానే 110 లేదా 120 డిగ్రీల సెంటిగ్రేడు వరకూ కూడా ఉష్ణోగ్రతను అందించగలుగుతాం. ప్రెషర్‌ కుక్కర్‌లో జరిగేదిదే. ఎక్కువ వేడి అందుతుంది కాబట్టి త్వరగా అన్నం ఉడుకుతుంది.

  • =========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

కొబ్బరికాయ రెండు ముక్కలే అవుతుందేం?,




ప్రశ్న: కొబ్బరి కాయను పగలగొట్టినప్పుడు అది రెండు ముక్కలే ఎందుకు అవుతుంది?

జవాబు: ఏదైనా ఘనపదార్థాన్ని పగలగొట్టాలంటే శక్తి కావాలి. ఎంత కావాలనేది ఆ వస్తువు గట్టిదనాన్ని బట్టి ఉంటుంది. అలా కొట్టేటప్పుడు వేగం, కాలం కూడా పరిగణనలోకి వస్తాయి. ఎంత శక్తిని ఎంత కాలంలో ఎంత వేగంతో ఉపయోగించామో తెలిపేదే తాడనం (impact) అవుతుంది. గట్టిగా ఉండే కొబ్బరి కాయ పెంకు పగలాలంటే తాడన తీవ్రత అధికంగా ఉండాలి. అది పెంకులో పగుళ్లను తీసుకువస్తుంది. దీని మీదనే పగులు విస్తారం (spread of crack) ఆధారపడి ఉంటుంది. కొబ్బరి కాయ ఎక్కువ ముక్కలవ్వాలంటే ఎక్కువ విస్తారపు పగుళ్లు కావాలి. కానీ మనం సాధారణంగా ప్రయోగించే తాడన తీవ్రత కొబ్బరి కాయను కేవలం రెండు ముక్కల్నే చేయగలదు. అలా కాకుండా చాలా తీవ్ర శక్తితో నేలకేసి ఠపీమని కొడితే అది అనేకముక్కలవడాన్ని గమనించవచ్చు.

  • =======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

పానీయాలు ఉత్సాహాన్నిస్తాయా?. Drinks give Energy and activeness - How?






ప్రశ్న: కొన్ని పానీయాలు ఉత్సాహాన్ని ఇస్తాయంటారు నిజమేనా?
-
జవాబు: పానీయాల్లో చాలావరకూ స్వల్ప మోతాదులో ఉత్తేజాన్ని కలిగించే క్షారాలు (alkaloids) ఉంటాయి. ఉదాహరణకు కాఫీలోని కెఫైన్‌, టీ లోని థియోఫిలైన్‌, కోక్‌లోని కొకైన్‌. ఆరోగ్యం సరిగా లేని వ్యక్తికి మందులు ఎలా పనిచేస్తాయో, ఈ క్షారాలు కూడా దేహంపై అలాగే పనిచేస్తాయి. ఈ రకం పానీయాలు కండరాలను, ముఖ్యంగా శ్వాసనాళాలకు సంబంధించిన కండరాలను సడలించి సేదతీర్చడమే కాకుండా, కేంద్ర నాడీ వ్యవస్థను, గుండె కండరాలను ఉత్తేజపరుస్తాయి. మూత్రపిండాలను ఎక్కువ పని చేయించడమే కాక, మానసిక చైతన్యాన్ని ప్రేరేపిస్తాయి. కంటి చూపు, వినికిడి శక్తి పెరిగినట్లు అనిపిస్తుంది. సహనశక్తి ఎక్కువవుతుంది. అలసట తగ్గుతుంది. ఏదో కొత్త ధైర్యం, సామర్థ్యం వచ్చిన భావన కలుగుతుంది. కొందరిలో ఉల్లాసం కలుగుతుంది. అయితే ఈ నూతనోత్సాహం తాత్కాలికమే. ఎక్కువ సేపు నిలవదు. ఉత్సాహాన్ని ఇస్తున్నాయని ఎక్కువ సార్లు తాగితే భ్రమలకు లోనై స్థబ్దత కలుగుతుంది కూడా.
-


  • =============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

మోచేతికి షాకేల? , Shock at fore-arm -why?




ప్రశ్న: మోచేతి మీద అనుకోకుండా ఏదైనా వస్తువు తగిలితే ఒక్కసారిగా కరెంటు షాక్‌ కొట్టినట్టుగా ఉంటుందెందుకు?

జవాబు: మన శరీరంలో వివిధ భాగాల నుంచి మెదడుకు సమాచారం అందాలన్నా, మెదడు నుంచి అవయవాలకు ఆదేశాలు చేరాలన్నా నాడీ వ్యవస్థ (nervous system) కీలక పాత్ర వహిస్తుంది. పంచేంద్రియాలు గ్రహించిన సమాచారం విద్యుత్‌ రసాయనిక పొటన్షియల్‌ (electrochemical action potential)గా మారి నాడుల ద్వారా ప్రయాణిస్తుంది. ఈ నాడులన్నీ శరీరంలో అస్థిపంజరానికి దగ్గరగా ఉంటాయి. అంటే ఎముకలనే పందిరికి అల్లుకున్న తీగల్లాగా అన్నమాట. కండరాలకు దిగువగా ఉండడం వల్ల నాడుల్ని మనం చేత్తో సరాసరి స్పృశించలేము. కానీ మోచేయి, మణికట్టు, వేళ్ల కణుపుల దగ్గర కండరాలు తక్కువగా ఉండడం వల్ల అక్కడ నాడీతంత్రులు చర్మపు పొరకు దగ్గరగానే ఉంటాయి. మోచేతికి దెబ్బ తగిలినప్పుడు ఆ ప్రకంపనాలు అక్కడే ఉన్న నాడులకు వెంటనే తగులుతుంది. అవాంఛితమైన, అలవాటు లేని సంకేతాలు హఠాత్తుగా పుట్టడం వల్ల ఒక్కసారిగా షాక్‌ కొట్టినట్లు మనకి అనిపిస్తుంది.



  • ======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

ఏమిటా కార్బన్ సైకిల్‌?,What is Carbon Cycle?




ప్రశ్న: కార్బన్‌ సైకిల్‌ అంటే ఏమిటి?

జవాబు: కార్బన్‌ సైకిల్‌ (కర్బన ఆవృతం) అంటే వాతావరణంలోని కార్బన్‌ డయాక్సైడులోని కార్బన్‌ ప్రాణులలోకి ప్రవేశించి, తిరిగి వాతావరణంలోకి విడుదల కావడం.

మొక్కలు సూర్యరశ్మి సాయంతో గాలిలోని కార్బన్‌ డయాక్సైడు నుండి కార్బన్‌ను కిరణ జన్య సంయోగ క్రియ ద్వారా గ్రహిస్తాయని చదువుకుని ఉంటారు కదా. ఈ కార్బన్‌, కార్బోహైడ్రేట్స్‌లాంటి పదార్థాలుగా మార్పు చెంది మొక్కలకు కావలసిన శక్తిని ఇస్తుంది. రాత్రి వేళల్లో మొక్కలు శ్వాసక్రియలో భాగంగా కార్బన్‌ డయాక్సైడును వదిలి ఆక్సిజన్‌ను పీల్చుకుంటాయి. మొక్కలను ఆహారంగా తీసుకున్నప్పుడు వాటిలోని కార్బన్‌, జీవుల శరీరంలోకి చేరుకుంటుంది. జీవులు శ్వాసించే ప్రక్రియలో ఆక్సిజన్‌ను పీల్చుకుని కార్బన్‌ డయాక్సైడును వ్యర్థ పదార్థ రూపంలో వాతావరణంలోకి వదులుతాయి. జీవుల విసర్జనల్లోని కార్బన్‌ కూడా వాతావరణంలో కలుస్తుంది. అలాగే సముద్రంలోని నీటిలో కార్బన్‌ డయాక్సైడు కొంతమేర కరిగిపోగా కొంత ఆవిరై గాలిలోకి చేరుతుంది. మరికొంత సముద్ర ప్రాణులు స్వీకరిస్తాయి. జలచరాలు చనిపోయినప్పుడు వాటి అవశేషాల్లో కార్బన్‌ నిక్షిప్తమై ఉంటుంది. మొక్కలు, జంతువులు చనిపోయినప్పుడు కార్బన్‌ డయాక్సైడు విడుదల అవుతుంది. మొక్కల్లో ఉండే కార్బన్‌ బొగ్గు, సహజవాయువు, పెట్రోలు లాంటి ఇంధనాల్లో ఉండడం వల్ల వాటిని మండించినప్పుడు కూడా కార్బన్‌ డయాక్సైడులోని కార్బన్‌ వాతావరణంలోకి చేరుకుంటుంది. ఈ మొత్తం వలయాన్నే కర్బన ఆవృతం అంటారు.


  • =========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.