Thursday, April 22, 2010

దానికంత పెద్ద చెవులెందుకు? , Elephant Ears are big-Why?




ప్రశ్న:
ఏనుగుకు అంత పెద్ద చెవులు ఉండడం వల్ల ఉపయోగం ఏమిటి?

జవాబు:
సాధారణంగా నాలుగు కాళ్ల జంతువులకు తోక పొడవుగా ఉండడం వల్ల శరీరం మీద వాలే ఈగల్ని, దోమల్ని, ఇతర పదార్థాలను విదిలించుకుంటాయి. శరీరంలో వెనుక సగభాగానికీ తగిలేలా తోక పొడవు ఉంటుంది. మిగతా భాగాన్ని పొడవైన మెడ, మూతి సాయంతో శుభ్రపరుచుకుంటాయి. ఇక ఏనుగుది భారీ శరీరం. తోక చూస్తే చిన్నది. తొండం ఉన్నా మెడ పొట్టిగా కదపలేని విధంగా ఉండడం వల్ల శరీరమంతా తడుముకోలేదు. ఇక్కడే దాని చెవులు ఉపయోగపడతాయి. చేటల్లాగా ఉండి మృదువుగా కదిలే చెవుల సాయంతో అది కీటకాలను తోలుకోగలదు. ఇంత పెద్ద చెవుల వల్ల దానికి మరో ప్రయోజనం కూడా ఉంది. ఏనుగు వేడిని అంతగా తట్టుకోలేదు. అందుకనే స్నానం చేసిన వెంటనే అధమ ఉష్ణవాహకమైన బురదను, ఇసుకను ఒంటిపై జల్లుకుంటుంది. చెవుల్లో దానికి సూక్ష్మమైన రక్త నాళికలు విస్తరించి ఉంటాయి. వీటిని తరచు వూపడం వల్ల దాని శరీరానికి గాలి తగలడంతో పాటు, లోపలి రక్తం కూడా చల్లబడే అవకాశం ఉంటుంది. ధ్వని తరంగాలను ఒడిసి పట్టుకోవడంలో కూడా ఈ చెవుల ప్రాధాన్యత ఉంటుంది.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...