Saturday, October 30, 2010

బావి నీటి రుచికి కారణాలేంటి? , Causes for Well water Taste?

ప్రశ్న: ఒకోసారి సముద్ర తీరం పక్కనే బావి తవ్వినా మంచినీరు పడుతుంది. ఒకోసారి సముద్రాలకు దూర భూముల్లో బావి తవ్వినా ఉప్పు నీరు పడవచ్చు. బావి నీటి రుచికి కారణాలేంటి?

- మాచిరాజు సింధు, ప్రశాంతి, 10వ తరగతి, హైదరాబాద్‌

జవాబు: బావుల్లో ఊరే నీటి రుచికి సముద్రమే కారణం కానక్కర్లేదు. చాలా మటుకు భూమి పొరల్లో ఉండే భూగర్భజలం (ground water) బావుల్లోకి ఊటలాగా చేరుతుంది. సముద్ర తీర ప్రాంతాల్లోని భూగర్భాల్లో సముద్రపు నీరే చేరి ఉంటుందనుకోకూడదు. అది నిజమైతే సముద్రాల ఉపరితలంపై ఉండే విపరీతమైన ఒత్తిడి బావుల్లో నీరు పొంగిపొర్లాలి. అలా జరగడం లేదు కదా! కాబట్టి ఆ బావుల్లోకి చేరే నీరు చాలా సార్లు అక్కడి భూమి పొరల్లో ఇంకి ఉన్న లవణాల కారణంగా ఉప్పగా ఉండే అవకాశాలున్నా, కొన్ని సార్లు మంచి నీరు కూడా ఊరుతుంది. అలాగే సముద్రాలకు దూరంగా ఉండే పీఠభూముల్లో కూడా ఉప్పు నీరు పడే అవకాశాలు లేకపోలేదు. అది అక్కడి భూముల తత్వంపై ఆధారపడి ఉంటుంది. నేలల్లోని లవణాలుంటే వాటిని కరిగించుకున్న నీరు ఉప్పగా ఉంటుంది. సాధారణంగా భూగర్భజలాల్లో లవణ శాతం, సరస్సులు నదుల్లోని నీళ్ల లవణ శాతం కన్నా ఎక్కువ ఉంటుంది.

-ప్రొ||ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

 • ===========================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Tuesday, October 26, 2010

వాటికి నీటి అవసరం లేదా? , Donot they need water?

ప్రశ్న: సాలెపురుగు, బల్లి, నల్లి లాంటి కొన్ని జీవులు ఎప్పుడూ నీరు తాగవు కదా, మరి ఎలా బతకగలుగుతున్నాయి?

-జె. వంశీకిరణ్‌, 8వ తరగతి, మక్కువ (విజయనగరం)

జవాబు: ఏ జీవీ నీటి వినియోగం లేకుండా ఉండలేదు. ఎందుకంటే జీవులన్నీ జీవకణాలతోనే నిర్మితమయ్యాయి. ఆ జీవకణంలో 70 శాతం వరకూ నీరే ఉంటుంది. కొన్ని జీవులు నీరు తాగవనుకోవడం అపోహ మాత్రమే. ఏదో రూపంలో అవి నీటిని గ్రహిస్తాయి. చాలా జీవులకు నీటి అవసరం చాలా తక్కువగా ఉంటుంది. తాము తీసుకునే ఆహారం ద్వారానే వాటికి కావాల్సిన నీరు శరీరానికి అందుతుంది. ఉదాహరణకు నల్లి మనను కుట్టినప్పుడు మన రక్తంలో ఉండే కణాల్లో సీరం రూపంలో ఉండే నీరు దానికి అందుతుంది. అలాగే బల్లి ఏదైనా కీటకాన్ని భోంచేసినప్పుడు దానిలో ఉండే పోషక పదార్థాలతో పాటు నీరు కూడా బల్లి పొట్టలోకి వెళుతుంది. సాలెపురుగు విషయమూ అంతే. వాటి గూళ్ల మీద ఉదయాన్నే ఏర్పడే మంచు బిందువుల్ని కూడా అవి గ్రహిస్తాయి.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

 • ============================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Monday, October 25, 2010

ఆ పేలుడుకి ఉందా సాక్ష్యం? , Is there Evidence for that Bigband?ప్రశ్న: విశ్వం బిగ్‌బ్యాంగ్‌ వల్లనే ఏర్పడిందనడానికి సాక్ష్యం ఉందా?

-కె. సురేఖ, హైదరాబాద్‌

జవాబు: బిగ్‌బ్యాంగ్‌ సిద్ధాంతం ప్రకారం విశ్వం ఒకప్పుడు అత్యధిక సాంద్రత, ఉష్ణోగ్రతలు కలిగిన ఒక చిన్న బిందువు. అది 1200 కోట్ల సంవత్సరాల క్రితం పెద్ద శబ్దంతో పేలిపోయి కాంతి వేగంకన్నా ఎక్కువ వేగంతో విస్తరించింది. దాన్నే మహావిస్ఫోటం (బిగ్‌బ్యాంగ్‌) అంటారు. ఆ బిందువు అలా పేలిపోవడానికి కారణాలేంటో ఇప్పటికీ తెలియవు. అయితే ఈ సిద్ధాంతాన్ని రుజువు చేసే కొన్ని దృష్టాంతరాలు నమోదయ్యాయి. బిగ్‌బ్యాంగ్‌ ఉత్పన్నం చేసిన వికిరణ శక్తి (Radiation) ఇప్పటికీ విశ్వంలో కాస్మిక్‌ సూక్ష్మ తరంగ నేపథ్య వికిరణాల (casmic micro wave background radiation) రూపంలో ఉంది. ఈ కిరణాలను తొలిసారి ఆర్నోపెంజియాస్‌, రాబర్ట్‌ విల్సన్‌ అనే శాస్త్రవేత్తలు 1964లో కనుగొన్నారు. వీరు అప్పటి ధ్వని తరంగాలను వినడమే కాకుండా, ఈ వికిరణాల ఉష్ణోగ్రత మూడు కెల్విన్‌లుగా నిర్ధరించారు. దీంతో మహావిస్ఫోటం సిద్ధాంతానికి బలమైన మద్దతు లభించింది. కాస్మిక్‌ సూక్ష్మతరంగ నేపథ్య వికిరణాలు భూమి వైపు అన్ని దిశల నుంచీ వస్తున్నాయి. ఈ ధ్వనిని బిగ్‌బ్యాంగ్‌ ప్రతిధ్వనిగా భావించవచ్చు.

ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌


======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Friday, October 22, 2010

ఆ నూనెలు గడ్డకట్టవేం?, Why dont those oils freez in winter

ప్రశ్న: చలికాలంలో కొబ్బరి నూనె గడ్డకడుతుంది. కానీ వంటనూనె, నువ్వుల నూనె వంటివి గడ్డ కట్టవు. ఎందుకని?


జవాబు: రసాయనికంగా చూస్తే దాదాపు నూనెలన్నీ ఫ్యాటీ ఆమ్లాలనే ఒకే తరగతికి చెందినవే. అయితే వాటి అంతర్గత అణునిర్మాణం (molecular structure) ఒకే తీరుగా ఉండదు. ఆయా నూనెల భౌతిక, రసాయనిక ధర్మాలు కూడా వేర్వేరుగా ఉంటాయి. వాటిలోని అణునిర్మాణాన్ని బట్టే ఆయా నూనెల ఘనీభవన ఉష్ణోగ్రత (freezing point) ఆధారపడి ఉంటుంది. కొబ్బరి నూనె, నెయ్యి, డాల్డాల వంటి నూనెల ఘనీభవన ఉష్ణోగ్రత ఎక్కువ కావడం వల్ల తొందరగానే గడ్డకడతాయి. నువ్వుల నూనె, ఆముదం, శెనగనూనె వంటి నూనెల ఘనీభవన ఉష్ణోగ్రత చాలా తక్కువ. కాబట్టి సాధారణ చలికాలంలో అవి గడ్డకట్టవు.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక


 • ==================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Wednesday, October 20, 2010

Why and How is Oxygen prepared?,ఆక్సిజన్‌ను ఎందుకు -ఎలా తయారు చేస్తారు?
ప్రశ్న: ఆక్సిజన్‌ను ఎలా తయారు చేస్తారు? ఎందుకు?
-కె. రమణారావు, 10వ తరగతి, కొవ్వూరు
జవాబు: మన వాతావరణంలోని గాలిలో 21 శాతం ఆక్సిజన్‌, 78 శాతం నైట్రోజన్‌, ఒక శాతం ఇతర వాయువులు ఉంటాయి. ఆక్సిజన్‌ ఉనికిని తొలిసారిగా లెవోషియర్‌, ప్రీస్ట్‌లీ అనే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. రంగు, రుచి, వాసన లేని ఈ వాయువు భూమి పొరల్లో లోహపు ఆక్సైడ్‌ రూపంలో 50 శాతం వరకూ ఉంటుంది. ఆక్సిజన్‌ వాయువు మైనస్‌ 185 డిగ్రీల సెంటిగ్రేడు వద్ద లేత నీలం రంగు ద్రవంగా మారుతుంది. మైనస్‌ 219 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వద్ద ఘనపదార్థంగా మారుతుంది.

ప్రయోగశాలలో పొటాషియం క్లోరేట్‌, మాంగనీస్‌ డై ఆక్సైడ్‌ మిశ్రమాన్ని వేడి చేయడం ద్వారా ఆక్సిజన్‌ వాయువును తయారు చేస్తారు. వాతావరణంలోని గాలి నుంచి ఆంశిక స్వేదన క్రియ (Fractional Destillation) ద్వారా వేరు చేయవచ్చు. గాలిని మామూలు వాతావరణ పీడనం కన్నా 200 రెట్లు ఒత్తిడికి గురి చేసి, అతి సన్నని రంధ్రం గుండా ఒక గదిలోకి పంపిస్తారు. పీడనం హఠాత్తుగా పడిపోవడంతో ఆ గాలి ద్రవంగా మారుతుంది. ఈ ద్రవం నుంచి నైట్రోజన్‌ వాయువును వేరు చేయడం ద్వారా ఆక్సిజన్‌ లభిస్తుంది. దీన్ని వాయురూపంలోకి మార్చి సిలెండర్లలో నింపుతారు.

ఆక్సిజన్‌ను ఎసిటెలిన్‌ వాయువుతో మండిస్తే అత్యధిక ఉష్ణోగ్రతతో కూడిన మంట వస్తుంది. ఆ మంటను లోహాలను వెల్డింగ్‌ చేయడానికి, కోయడానికి ఉపయోగిస్తారు. ఆసుపత్రుల్లో శ్వాస తీసుకోవడం కష్టమైన రోగులకు ఆక్సిజన్‌ను అందిస్తారు. పర్వతారోహకులు, సముద్రం లోతుల్లోకి వెళ్లే డైవర్లు, అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములకు ఆక్సిజన్‌ సిలెండర్లను ఇస్తారు. రాకెట్ల ఇంధనంగా కూడా ఆక్సిజన్‌ను వాడతారు.
 • =================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Tuesday, October 19, 2010

సిల్కు దారాల కథేంటి?
ప్రశ్న: సిల్కు దారాలను ఎలా తయారు చేస్తారు?

-కె. ఐశ్వర్య, 6వ తరగతి, మూలపేట (నెల్లూరు)

జవాబు: సిల్కు దారం పట్టుపురుగులనే చిన్న కీటకాల నుంచి లభిస్తుంది. వీటిలో ఆడపురుగు మల్బరీ చెట్టు ఆకులపై ఏటా రమారమి 500 గుడ్లు పెడుతుంది. పది రోజుల తర్వాత ఆ గుడ్ల నుంచి లార్వాలు బయటకు వస్తాయి. ఈ లార్వాలు మల్బరీ ఆకులను తింటూ పెరుగుతాయి. ఇవి పెద్దవగానే వాటి నోటి లోంచి జిగటగా ఉండే ఒక ద్రవం వెలువడుతుంది. ఆ ద్రవంతో పట్టుపురుగు తన చుట్టూ ఒక గూడు కట్టుకుంటుంది. దీన్ని కకూన్‌ (cocoon) అంటారు. పట్టుపురుగు పరిమాణం పెరిగే కొద్దీ ఈ గూడు పరిమాణం కూడా పెరుగుతుంది. ఈ కకూన్ల నుంచే పట్టుదారాన్ని వెలికి తీస్తారు. అందుకనే పట్టుపురుగులను ప్రత్యేకంగా మల్బరీ చెట్లపై పెంచుతారు. పెద్దవయిన కకూన్లను సేకరించి వేడి నీళ్లలో ఉడికిస్తారు. తర్వాత వాటి నుంచి పట్టు దారాన్ని తీస్తారు. ఒక కకూన్‌ నుంచి 500 నుంచి 1300 మీటర్ల పొడవుగల పట్టుదారం లభిస్తుంది. ఈ దారం సన్నగా ఉన్నా, అదే మందం గల స్టీలు తీగంత బలంగా ఉంటుంది. ఈ దారాల పోగులతోనే పట్టు వస్త్రాలను నేస్తారు.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌


 • ===========================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Sunday, October 17, 2010

అక్కడి నీరు ఎక్కడిది? ,How do we get water in Fridge?ప్రశ్న: రిఫ్రిజిరేటర్‌లో డీప్‌ఫ్రీజర్‌ అర అడుగున, చుట్టుపక్కల మంచు పేరుకుపోతుంది కదా? అక్కడ గడ్డకట్టే నీరు ఎక్కడిది?

-బి. వెంకట సాయిరామ్‌ రెడ్డి, 8వ తరగతి, ఆదోని

జవాబు: మనం ఫ్రిజ్‌ను వాడేప్పుడు చాలా సార్లు దాని తలుపు తెరుస్తుంటాము కదా. బయటి గాలిలో నైట్రోజన్‌, ఆక్సిజన్‌లాంటి వాయువులతో పాటు నీటి ఆవిరి కూడా ఉంటుందని చదువుకుని ఉంటారు. మనం తలుపులు తీసినప్పుడల్లా గాలి లోపలికి చొరబడి డీప్‌ఫ్రీజర్‌కి తగులుతూ ఉంటుంది. ఆ గాలిలోని నీటి ఆవిరి అక్కడి అత్యల్ప ఉష్ణోగ్రతకి గురై క్రమేణా మంచు పొరల్లాగా మారుతుంటుంది. ఫ్రిజ్‌ లోపల చల్లని పరిస్థితుల్లో పీడనం కూడా తక్కువగా ఉంటుంది. అందువల్లనే తలుపులు తీసినప్పుడల్లా బయటి గాలి వేగంగా లోపలికి చొరబడుతుంది.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక


 • ============================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Dasara festival celebrate Why?, దసరా పండగ ఎందుకు చేస్తారు ?

సంబరాలకు చిరునామా... ఆచారాలను ఆదరించేది... సంప్రదాయాలు వెల్లివిరిసేది... పిల్లలకు వినోదాన్ని పంచేది... అదే సరదాల దసరా పండగ!

రావణున్ని రాముడు చంపిన రోజు,
మహిషాసురుణ్ని దుర్గమ్మ హతమార్చిన రోజు,
అశోకుడు బౌద్ధం స్వీకరించిన రోజు,
పాండవులు వనవాసం అజ్ఞాత వాసమము తో కలిపి పూర్తిచేసిన రోజు ,
చెడుపై మంచి గెలిచిన రోజు. అదే విజయదశమి అని మనకు తెలుసు. మరి ఒక్కోచోట ఈ పండగని ఒక్కోలా జరుపుతారని తెలుసా?

400 ఏళ్ల చరిత్ర: దశ హరా అనే పదం నుంచే దసరా వచ్చింది. ఈ పండగను ముఖ్యంగా కర్నాటకలో ఘనంగా నిర్వహిస్తారు. మైసూర్‌లోని చాముండేశ్వరి ఆలయంలో నవరాత్రి వేడుకలు 400 ఏళ్లుగా జరుగుతున్నాయి. అప్పట్లోఈ సంబరాలను ప్రారంభించిన వడియార్‌ రాజ వంశీకులు ఇప్పటికీ పూజల్లో పాల్గొనడం విశేషం. దసరా నాడు బంగారు అంబారీపై అమ్మవారిని ఊరేగించే కార్యక్రమం కన్నుల పండుగగా జరుగుతుంది. ఇక ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మైసూర్‌ మహారాజా ప్యాలెస్‌ను దసరా పండక్కి లక్ష విద్యుత్‌ దీపాలతో అలంకరిస్తారు. ఇది ప్రపంచ రికార్డు.

చేపలు... కేకులు: షోడశోపచార పేరుతో ఒడిషాలో 16 రోజులపాటు వేడుకల్ని జరుపుతారు. చివరి రోజు అమ్మవారికి పెరుగన్నం, కేకులతో పాటు చేపల వేపుడును నివేదిస్తారు.

చర్చిల్లోనూ: పుస్తకాలకు పూజ చేయడమనే అలవాటును కేరళలోని కొందరు క్రైస్తవులు కూడా పాటించడం విశేషం. కొన్ని చర్చిల్లో పిల్లలకు దసరా రోజు అక్షరాభ్యాసం చేయిస్తున్నారు.

* గుజరాత్‌లో వూరూరా గార్బా, దాండియా రాస్‌ నృత్యాలతో సంబరాలు మిన్నంటుతాయి.

* మహారాష్ట్రలో సీమోల్లంఘనం పేరుతో తమ వూరి పొలిమేరలు దాటి వస్తారు. అలా చేస్తే మంచి జరుగుతుందని నమ్మకం.

* మనం దసరాకి ముందు నవరాత్రులు జరిపితే హిమాచల్‌ ప్రదేశ్‌లోని కులూలో దసరా తర్వాత ఏడు రోజులపాటు వేడుకలు చేసుకుంటారు. విజయదశమినాడు రామలక్ష్మణసీతా విగ్రహాలతో రథయాత్ర జరుపుతారు. విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చి రథాన్ని లాగుతారు.

* మన దేశంలోనే కాకుండా నేపాల్‌, బంగ్లాదేశ్‌, అమెరికా, బ్రిటన్‌, జర్మనీ, మారిషస్‌, ఆస్ట్రేలియా దేశాల్లో కూడా దసరా వేడుకలు జరుగుతాయి.
===========================================

visit My website > Dr.Seshagirirao - MBBS.http://dr.seshagirirao.tripod.com/

Wednesday, October 13, 2010

ఒకే తీగలో అన్ని ఛానెల్సెలా ప్రసారం అవుతాయి?, How all the chanels passing through one wire?


 • [T.V.jpg]

ప్రశ్న: టీవీలో వచ్చే వివిధ ఛానెల్స్‌ అన్నీ ఒకే ఒక కేబుల్‌ తీగ ద్వారా ఎలా ప్రసారం అవుతాయి?

-తాలాడ అప్పారావు, కొరసవాడ (శ్రీకాకుళం)

జవాబు: మీ టీవీ వెనుక తగిలించే కేబుల్‌ తీగను మీ ప్రాంతంలో ఉండే కేబుల్‌ ఆపరేటర్‌ ఏర్పాటు చేస్తాడు. మీ టీవీలో ప్రసారమయ్యే రకరకాల ఛానెల్స్‌ నిర్వాహకులకు అతడు కొంత సొమ్ము చెల్లించి వాటిని ప్రసారం చేసే హక్కుల్ని పొందుతాడు. ఆయా ఛానెల్స్‌ వాళ్లు తమ కార్యక్రమాల సంకేతాలను ఉపగ్రహాలకు ప్రసారం చేస్తే వాటిని ప్రత్యేక ఏంటెన్నాల ద్వారా కేబుల్‌ ఆపరేటర్లు సేకరిస్తారు. అలా సేకరించే ఛానెల్స్‌ సంకేతాలన్నీ వేర్వేరు ఫ్రీక్వెన్సీలలో ఉంటాయి. వాటిని ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్‌ పరికరం గ్రహించి కేబుల్‌ తీగ ద్వారా ప్రసారం చేయగలిగే ఫ్రీక్వెన్సీలోకి మారుస్తుంది. ఇవన్నీ కలగలిసి కేబుల్‌ ద్వారా ఇంటికి చేరుకుంటాయి. టీవీ వెనుక ఉండే రేడియో ఫ్రీక్వెన్సీ (RF) సాకెట్‌కు తగిలించినప్పుడు ఆ సంకేతాలన్నీ వేర్వేరు ఛానెళ్ల ఫ్రీక్వెన్సీలోకి మారతాయి. ఈ పద్ధతినే డీమాడ్యులేషన్‌ లేదా విశ్లేషణం అంటారు. ఎంపిక చేసుకున్న ఛానెల్‌కు సంబంధించిన ఫ్రీక్వెన్సీని టీవీ సర్క్యూట్‌ ఉత్పత్తి చేయగా, అదే ఫ్రీక్వెన్సీకి చెందిన అంశాల అనునాదం (resonance) జరుగుతుంది. ఫలితంగా ఆ ఛానెల్‌కి సంబంధించిన కార్యక్రమాలే తెరపై కనిపిస్తాయి. ఈ ప్రక్రియంతా కాంతి వేగంతో జరుగుతుంది.

-ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్ర కమిటీ, జనవిజ్ఞానవేదిక


 • ==========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Tuesday, October 12, 2010

ఆగురి ఒక కన్ను తోనే ఎందుకు చూస్తారు ? , Aiming with one eye at shootin Why?ప్ర: బాణము ఎక్కుపెట్టినప్పుడు ఒక కన్ను మూసి ఒక కన్ను తోనే చూస్తారు ఎండుకు ? ...

జ: ఒక దృశ్యము ఎంతదూరము లో ఉంది , ఎంత ఎత్తు , లావు ఉంది తెలియాలంటే తప్పకుండా రెండు కళ్ళుతో దూడాల్సిందే . కాని గురి ఎక్కు పెట్టినప్పుడు మాత్రము లక్ష్యము ఎంతదూరము లో ఉన్నది తెలిస్తే చాలు . కాబట్టి ఒక కన్ను సరిపోతుంది . రెండు కళ్ళు తో చూస్తే రెండో కన్ను చూసే దృస్టికోణము అడ్డంకి అవుతుంది . అందుకే గురి ఒక కన్నుతోనే సూస్తారు .

 • =====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Thursday, October 07, 2010

టిస్యూ కాగితం ప్రత్యేకత ఏమిటి? , What is the speciality of Tissue paper
ప్రశ్న: హోటల్స్‌లో చేతులు తుడుచుకోడానికి మెత్తని కాగితాన్ని ఇస్తారు. దాని ప్రత్యేకత ఏంటి? అది నీటిని తొందరగా ఎలా పీల్చుకుంటుంది?జవాబు: ఇలాంటి కాగితాన్ని టిష్యూ పేపర్‌ (tisssue paper) అని, కాగిత రుమాలు (paper napkin) అనీ అంటారు. కాగితాలను సెల్యులోజ్‌ పదార్థంతో చేస్తారని తెలుసుగా? మామూలు కాగితంలో ఈ పదార్థపు పోగులు దట్టంగా అల్లుకుని ఉంటాయి. పైగా అధిక ఉష్ణోగ్రత వద్ద రోలర్ల సాయంతో నొక్కుతూ తయారు చేయడం వల్ల సెల్యులోజ్‌ పోగుల్ని పిండిపదార్థం జిగురులాగా అతుక్కుని ఉంచుతుంది. అందువల్ల సాధారణ కాగితం గట్టిగా, నీరు తొందరగా ఇంకని విధంగా తయారవుతుంది. అయితే టిష్యూ పేపర్‌లో సెల్యులోజ్‌ పోగుల్ని చాలా వదులుగా ఉండేలా తయారు చేస్తారు. వీటిని కలిపి ఉంచడానికి పిండిపదార్థపు జిగురును వాడరు. అందువల్ల పొరకు, పొరకు మధ్య చాలా ఖాళీలు ఎక్కువగా సూక్ష్మస్థాయిలో ఉంటాయి. ఈ కారణంగా ఇవి తడిని ఎక్కువగా పీల్చుకోగలుగుతాయి.


 • -ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌,వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
=================================

Tuesday, October 05, 2010

ఆ శబ్దం గిన్నెదా? గరిటదా? , sound comes from vessel when strike with spoon why?ప్రశ్న: గరిటతో గిన్నెను కొడితే శబ్దం దేని నుంచి వస్తుంది?


జవాబు: శబ్దం గిన్నె నుంచే వస్తుంది. ఎందుకో చూద్దాం. ధ్వని వచ్చేది కంపించే వస్తువు నుంచే. ఉదాహరణకు సాగదీసి ఉన్న వీణ తీగెను మీటినా, గంటను సుత్తితో కొట్టినా, మద్దెలపై బిగుతుగా అమర్చిన చర్మాన్ని తట్టినా శబ్దం కొంత సేపు స్థిరంగా వినబడుతుంది. అంటే ధ్వని కంపనాలు స్థితిస్థాపకత (elasticity) కలిగి, తన్యత (tension) ఉన్న వస్తువుల నుంచే వస్తాయి. వీటిని స్వేచ్ఛా కంపనాలు అంటారు. గిన్నెను గరిటతో కొట్టినప్పుడు గిన్నె నుంచే స్వేచ్ఛా కంపనాలు జనిస్తాయి. అలాగే గిన్నెలో ఉన్న గాలిలో బలాత్కృత కంపనాలు (forced vibrations) జనించడంతో శబ్దం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. గరిటలో కూడా కొద్దిపాటి కంపనాలు కలిగినా, అది మన చేతిలో ఉండడంతో వాటి వల్ల కలిగే శబ్దం చేతిలో లీనమై పోతుంది. అదే గరిటను కొంచెం ఎత్తు నుంచి నేలపైకి వదిలేస్తే వచ్చే శబ్దం దాని కంపనాల వల్లనే వస్తుంది.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌


 • =======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

Friday, October 01, 2010

కిరణాల మార్గం సరళమేనా? , Light Rays are Straight why?ప్రశ్న: కాంతి కిరణాలు ఎప్పుడూ సరళ మార్గంలోనే ప్రయాణిస్తాయా?

-పి. కిశోర్‌, 9వ తరగతి, తిరుపతి

జవాబు: విద్యుత్‌ బల్బు, కొవ్వొత్తి లాంటి కాంతి జనకాల నుంచి వెలువడే కాంతి కిరణాలు ఎప్పుడూ సరళమార్గంలోనే ప్రయాణిస్తాయి. అంతరిక్షంలో నక్షత్రాల నుంచి వెలువడే కాంతికిరణాలు కూడా సరళమార్గంలోనే పయనించినా, అవి గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉండే మరో నక్షత్రానికో, గెలాక్సీకో దగ్గరగా వచ్చినప్పుడు వక్రమార్గంలో వెళతాయి. ఈ ఫలితాన్ని 'గ్రావిటేషనల్‌ లెన్సింగ్‌' అంటారు. ఇలా కాంతి కిరణాలు వంగడం వల్ల ఆ కాంతిలో శాస్త్రవేత్తలు గెలాక్సీ వెనుక దాగి ఉండే ప్రకాశవంతమైన క్వాజర్లు (quasars) అనే ఖగోళ వస్తువులను చూడగలుగుతారు.

రోదసిలోని ఖగోళ వస్తువుల అమరికను బట్టి దూరం నుంచి సరళమార్గంలో వచ్చే కిరణాలు విల్లులాగా వంగడమో, వలయాకారాలను పొందడమో జరుగుతుంది. ఇందువల్ల వాటి కాంతి తగ్గుతుంది. కాంతి కిరణాలు వంగడానికి కారణమైన నక్షత్రం చుట్టూ ఏదైనా గ్రహం పరిభ్రమిస్తుంటే, ఆ నక్షత్రం దగ్గరకు వచ్చిన కాంతి కిరణాలు వంగడమే కాకుండా వాటి ప్రకాశం కూడా ఎక్కువవుతుంది. ఈ లక్షణం ఆధారంగా ఖగోళ శాస్త్రవేత్తలు సుదూర నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాలను గుర్తించగలుగుతారు.

ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ తన సామాన్య సాపేక్ష సిద్ధాంతంలో సూర్యుని గురుత్వ క్షేత్రంలోకి వచ్చిన కాంతి కిరణాలు ఎంతమేరకు వంగుతాయో లెక్కకట్టాడు. ఖగోళ శాస్త్రవేత్తలు సంపూర్ణ సూర్యగ్రహణ సమయంలో తీసిన ఫొటోల వల్ల ఆయన సిద్ధాంతం నిజమేనని నిరూపణ అయింది.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌


 • ===============================
visit My website > Dr.Seshagirirao - MBBS.