ప్రశ్న: రోదసిలో మొక్కలు నాటితే అవి భూమ్మీదకంటే ఎక్కువ ఎత్తుగా, తొందరగా పెరుగుతాయని విన్నాను. నిజమేనా?
జవాబు: కోట్లాది సంవత్సరాల పరిణామక్రమంలో ప్రకృతి కలిగించే గడ్డు పరిస్థితుల్ని అధిగమించి సజావుగా జీవించేందుకు వీలుగా వివిధ రకాల మొక్కల, జంతువుల జన్యుస్మృతి జీవుల కణాల్లో ఏర్పడింది. ఈ జన్యు స్మృతి శిలాశాసనం లాగా ఒక జీవికి సర్వకాల సర్వావస్థల యందు స్థిరంగా లేకున్నా కొన్ని వందల, వేల సంవత్సరాల కాలవ్యవధిలో దాదాపు మారనట్లే ఉంటుంది. జీవుల స్వరూపం, రంగు, ఎత్తు, అవయవ నిర్మాణం ఇలాంటి లక్షణాల్ని ఆయా జీవుల జన్యు స్మృతి నిర్ధారిస్తుంది. చెట్లు నేల మీదున్నా, ఆకాశంలో ఉన్నా వాటి జన్యుస్మృతి కణాల్లోను, విత్తనాల్లోను, నిక్షిప్తమై ఉండటం వల్ల కొన్ని ధర్మాల్లో మార్పుండదు. సరైన మోతాదులో నీరు, కార్బన్‌డయాక్సైడ్, ఇతర లవణాలు భూమ్మీద దొరికినట్టే అంతరిక్షంలో కూడా దొరికినట్లయితే చెట్లు అంతరిక్షంలో కూడా సూర్యరశ్మి సమక్షంలో కిరణజన్యసంయోగ క్రియ జరపగలవు. శ్వాసక్రియ చేయగలవు. సాధారణంగా మనకున్న అభిప్రాయం ఏంటంటే చెట్లు భూమ్యాకర్షణకు వ్యతిరేక దిశలో పెరగడం వల్ల తమ ఇష్టానుసారం పెరగలేవనీ, వాటి ఎత్తును భూమ్యాకర్షణ బలం నిలువరిస్తుందనీ తద్వారా కొంత ఎత్తుకు మించి పెరగవనీ అనుకుంటాం. ఇలాంటి భూమ్యాకర్షణ అంతరిక్షంలో ఉండదు కాబట్టి చెట్లు ఇక అడ్డూ అదుపూ లేకుండా అమాంతం పెరుగుతూనే ఉంటాయని సూత్రీకరిస్తాం. భూమ్యాకర్షణ ఒక్కటే నిర్దేశిత ధర్మం అయితే భూమ్మీద అన్ని చెట్లకూ ఒకే ఆకర్షణ కాబట్టి అన్ని చెట్లూ ఒకే ఎత్తుకు ఎదగాలి. అంటే గడ్డి మొక్కలు, కొబ్బరి చెట్లు ఇలా అన్నీ ఒకే ఎత్తు ఎదగాలి. అలా జరగట్లేదు కదా! జన్యుస్మృతి కూడా నిర్దేశించుతుంది. వ్యోమ శకటంలో పెంచిన చెట్లు మామూలు ఎత్తు వరకు పెరుగుతాయని పరిశోధనలు రుజువు చేశాయి.
- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- =========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...