ప్రశ్న: టెలిస్కోపు విశ్వంలోని సుదూరాలను ఎలా చూపగలుగుతుంది?
జవాబు: గెలీలియో మొట్టమొదట టెలిస్కోపు (దూరదర్శిని)ని నిర్మించిన సంగతి తెలిసిందే. అదే కాలంలో జీవించిన ఐజాక్ న్యూటన్ కూడా మరో విధమైన టెలిస్కోపును రూపొందించారు. ఇప్పుడు మనం వాడే కెమెరాలలోనూ, నక్షత్రశాలలో, బైనాక్యులార్స్‌లలో టెలిస్కోపు సూత్రాలు ఉంటాయి. సాధారణ గెలీలియో టెలిస్కోపు, లేదా సాధారణ న్యూటన్ టెలిస్కోపులలో విధిగా రెండు దృక్సాధనాలు ఉంటాయి. అయితే గెలీలియో టెలిస్కోపులలో ఉన్నవి రెండూ కుంభాకార కటకాలు కానీ న్యూటన్ టెలిస్కోపులో ఒకటి కుంభాకార కటకం కాగా రెండోది పుటాకార దర్పణం.
గెలీలియో టెలిస్కోపులో వస్తువు వైపు ఉన్న కటకానికి ఎక్కువ నాభ్యంతరం (focal length), కంటివైపు ఉన్న కటకానికి తక్కువ నాభ్యంతరం ఉంటుంది. సుదూరంలో ఉన్న వస్తువు నుంచి వెలువడిన కాంతి వస్తు కటకం (object lense) ద్వారా వక్రీభవనం చెంది కంటి కటకపు నాభ్యంతరం లోపల కేంద్రీకరణ అవుతుంది. కంటి కటకం భూతద్దంలాగా పనిచేయడం వల్ల ఆ వస్తువును మనం స్పష్టంగా చూడగలం. సాధారణ కెమెరాలు, సెల్‌ఫోన్ కెమెరాల్లో ఉన్న సూత్రం ప్రధానంగా ఇదే. న్యూటన్ దూరదర్శినిలో దూరపు వస్తువు కాంతి వెళ్లి టెలిస్కోపులో ఓ చివర ఉన్న పుటాకార దర్పణం మీద పరావర్తనం చెంది ఏటవాలుగా ఉన్న మరో సమతల దర్పణం మీద మళ్లీ పరావర్తనం చెంది కంటి కటకపు నాభ్యంతరం లోపల కేంద్రీకృతమవుతుంది. నేటి ఆధునిక టెలిస్కోపులలో కటకాల బదులు రేడియో తరంగాలని, ఎక్స్ కిరణాలని కూడా చూడగల యాంటీనాలు కాంతి సాధనాల వ్యవస్థలు ఉన్నాయి. కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్ర రాశుల్ని కూడా మనం చూడగలుగుతున్నాం.
- - ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; కన్వీనర్, శాస్త్ర ప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
- ==========================
- visit My website > Dr.Seshagirirao - MBBS.-
No comments:
Post a Comment
your comment is important to improve this blog...