ప్రశ్న: నీళ్లలోని వస్తువుల బరువు తగ్గినట్టు అనిపిస్తుంది.ఎందువల్ల?
జవాబు : తాను నీళ్లలో మునిగినపుడు తన బరువు తగ్గినట్లనిపించడాన్ని బట్టి క్రీస్తు పూర్వం మూడో శతాబ్దపు గ్రీకు శాస్త్రవేత్త ఆర్కిమెడిస్ ఓ సూత్రాన్ని కనిపెట్టాడనే విషయం తెలిసిందే. ఏదైనా ఓ వస్తువు ఓ ద్రవంలో మునిగిందంటే అర్థం ఆ వస్తువుకున్న ఘనపరిమాణం మేరకు ఆ ద్రవ భాగాన్ని పైకి నెట్టి ఆ ద్రవంలో అది ఆక్రమించి నట్టేకదా! ఆ వస్తువు ఆ ద్రవంలో కరగకుండా కేవలం మునిగే ఉందంటే అర్థం ఏమిటంటే ఆ ద్రవానికి ఆ వస్తువును తనలో ఉంచుకోవడం అభిమతం కాదని, తనలోకి భూమ్యాకర్షణ ద్వారా చొచ్చుకుని వస్తున్న వస్తువును తన శక్తిమేరకు భూమ్యాకర్షణ దిశకు వ్యతిరేక దిశలో ఆ వస్తువును నెట్టివేసి తాను కోల్పోయిన తన ద్రవ భాగాన్ని తనలో నింపుకొవడానికి ప్రయత్నం చేస్తుంది.
ఈ బలాన్నే బయాన్సీ అంటాం. దీని పరిమాణం వస్తువు ఘన పరిమాణానికి సరిపడినంత ఘన పరిమాణం గల ఆ ద్రవపు బరువు ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. వస్తువు మీద భూమ్యాకర్షణ వల్ల కలిగే బలాన్నే బరువు అంటాం. ఇది భూమి వైపు ఉంటుంది. బయాన్సీ భూమికి వ్యతిరేక దిశలో ఉంటుంది. అంటే వస్తువు బరువు బయాన్సీ మేరకు తగ్గిపోతుంది. మరో మాటలో చెప్పాలంటే ఓ వస్తువు ద్రవంలో మునిగినపుడు ఆ వస్తువు ఘనపరిమాణం ఎంత ఉందో అంతే ఘనపరిమాణం గల ద్రవపు బరువు మేరకు బయాన్సీ ద్వారా తన బరువును కోల్పోతుంది. దీనినే 'ఆర్కిమెడిస్' సూత్రం అంటారు. ఆర్కిమెడిస్ సూత్రం నిత్య జీవితంలో మనకు చాలాసార్లు అవగతానికి వస్తుంది.
- ప్రొ|| ఎ. రామచంద్రయ్య,--నిట్, వరంగల్; కన్వీనర్, శాస్త్ర ప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక(తెలంగాణ)
- ================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...