Saturday, September 13, 2014

పునాదులతో సహా ఇళ్లు లేపి కూలిపోకుండా మరో చోట పెడుతున్నారు.ఇదెలా సాధ్యం?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: ఈ మధ్య అక్కడక్కడ పునాదులతో సహా ఇళ్లు లేపి కూలిపోకుండా మరో చోట పెడుతున్నారు. ఇదెలా సాధ్యం?

జవాబు: ఎన్నో సాంకేతిక శాస్త్రాల మేళవింపునకు సంబంధించిన ఆధునిక ప్రక్రియ ఇది. ప్రతి ఇంటికి భూమిలో కొంత లోతు వరకు పునాదులు ఉంటాయి. ఆ పునాదిపైనే భవనం స్థిరంగా ఉండగలదు. సాధారణంగా కాంక్రీటు స్తంభాలు, కాంక్రీటువాసాలు, పునాది వాసాలతో నిర్మించబడ్డ దృఢమైన పంజరజాలయే భవనానికి స్థిరత్వాన్ని ఇస్తుంది. భవనంలో మిగిలిన భాగాలన్నీ కేవలం హంగులే.

మన ఇంట్లో ఒక బల్ల ఉందనుకుందాం. అది సాధారణంగా నాలుగు కాళ్ల మీద ఉంటుంది. దాన్ని ఒక గది నుంచి మరో గదికి తీసుకెళ్లాలంటే రెండు పద్ధతులున్నాయి. ఒకరో ఇద్దరో కలిసి దాన్ని లాగడమో లేదా తోయడమే ఒక పద్ధతి. ఈ పద్ధతిలో బల్లమీద బలాలు సమంగా పనిచేయవు. రెండు కాళ్ల మీద పనిచేసే బలం ఓవిధంగా ఉండగా మిగిలిన రెండు కాళ్ల మీద బలం మరోలా ఉంటుంది. కానీ అదే బల్లను అటు ఇటు సమంగా ఎత్తిపట్టుకొని పక్క గదిలో పెట్టడం రెండో పద్ధతి. ఇక్కడ అన్ని ప్రాంతాల్లో బల్ల మీద ఒకే విధమైన బల ప్రయోగం ఉంటుంది.

మొదటి పద్ధతిలో వ్యత్యాస బలాలుండటం వల్ల బల్లలోని సంధి ప్రాంతాలు వీగిపోయే ప్రమాదముంది. రెండో పద్ధతిలో అటువంటి ప్రమాదం లేదు. ఇదే విధంగా పెద్ద పెద్ద క్రేనుల సాయంతో భూమిలో భవనపు పునాదులున్న కుదుళ్ల వరకు అతి జాగ్రత్తగా, బ్యాలెన్సు చెడిపోకుండా పట్టకారు లాంటి క్లాంపులను బిగించి ఒకే విధమైన ఎత్తుకు నేల నుంచి పైకి లేపుతారు. ఏ విధమైన ఎగుడు దిగుడులేని విశాలమైన రోడ్డు మీద ఎక్కువ చక్రాలు, ఎక్కువ స్థిరత్వం, ఎక్కువ దృఢత్వం ఉన్న వాహనం మీద ఈ నిర్మాణాన్ని అదే విధంగా నిలకడగా ఉంచి మరోచోటికి తరలిస్తారు. మునుపు భూమిలో ఉన్నట్టు గానే రెండో చోట భూమిలో పాదులు, పునాదులు తీసి భవనాన్ని నిలుపుతారు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.

  • - ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;--కన్వీనర్‌, శాస్త్ర ప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
  • ==========================

No comments:

Post a Comment

your comment is important to improve this blog...