Monday, September 22, 2014

ఇసుకపై నడక అంత సులభంగా సాగదు. ఎందువల్ల?

  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: ఇసుకపై నడక అంత సులభంగా సాగదు. ఎందువల్ల?

జవాబు: నిల్చున్న వ్యక్తి ముందుకు కదలాలంటే అతని ఒక కాలును వంచి గట్టిగా నేలను కొంత బలంతో తన్నాలి. అలా కాలితో నేలపై బలాన్ని ప్రయోగించడాన్ని చర్య అంటారు. న్యూటన్‌ మూడో గమన సూత్రం ప్రకారం ప్రతీ చర్యకు సమానమైన ప్రతి చర్య ఉంటుంది. ఆ సూత్ర ప్రకారం వ్యక్తి తన కాలితో నేలపై ఎంత బలం ప్రయోగిస్తాడో, అంతే బలాన్ని నేల అతని కాలిపై ప్రయోగిస్తుంది. ఈ ప్రతి చర్య వల్ల ఆ వ్యక్తి ముందుకు కదులుతాడు.

ఇసుక నేలలో ఇసుక పొరలుపొరలుగా ఉంటుంది. దీనిపై నడుస్తున్న వ్యక్తి తన పాదంతో కలిగించే బలం ముందుగా ఇసుకలో పైనున్న పొరపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ పొర ఆ బలాన్ని తన కింద పొరపై చూపిస్తుంది. ఆ విధంగా వ్యక్తి ప్రయోగించే బలం ఇసుకలో ఉన్న అట్టడుగున ఉన్న పొరకు చేరడానికి కొంత సమయం పడుతుంది. ఆ బలంతో కొంత బలాన్ని ఇసుక పొరలు శోషించుకుంటాయి. అందువల్ల ఇసుకపై వ్యక్తి పాదం కలిగించే బలం కన్నా ప్రతి చర్యగా ఇసుక పొరలు అతడి పాదంపై కలిగించే బలం తక్కువగా ఉంటుంది. పైగా ఆలస్యం కూడా జరుగుతుంది. అదే గట్టిగా ఉండే నేలపై కాలితో చర్య కలిగించిన తక్షణమే దానికి సమానమైన ప్రతిచర్య కాలిపై కలుగుతుంది. ఆ విధంగా ఇసుకపై నడక అంత సులభంగా సాగదు.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌
  • =====================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...