ప్రశ్న: ఆరు బయట మల, మూత్ర విసర్జన చేయడం వల్ల ఎన్నో ప్రమాదాలు ఉంటాయంటారు. మరి ఇంట్లో లెట్రిన్లలో చేసినా అది ఎలాగోలా బయటికే పోతుంది కదా? మరి ఇబ్బంది లేదా?
జవాబు: ఆరు బయట మల విసర్జన చేస్తే విసర్జన చేసిన వ్యక్తికి అప్పటికే ఏమైనా జబ్బులున్నట్లయితే ఆయా జబ్బులకు కారణమైన క్రిములు లేదా వాటి గుడ్లు ఆ మలంలో ఉంటాయి. ఒక వేళ ఆ వ్యక్తికి జబ్బులు ఏమీ లేకున్నా మలాన్ని ఆశించి గాల్లో ఉన్న ఎన్నో సూక్ష్మ జీవులు ఆ మలంపై నిమిషాల్లోనే తమ స్థావరాల్ని ఏర్పర్చుకొని అవాంఛనీయమైన రసాయనాల్ని, తమ గుడ్లను విడుదల చేస్తాయి. అలాంటి వ్యర్థ పదార్థాల మీద పోగైన క్రిములు, గుడ్లు గాలి ద్వారా గానీ, వివిధ వస్తువుల ద్వారా ఆహారంలో కలవడం ద్వారా గానీ మన శరీరాల్ని చేరతాయి. చేరాక పొట్టలోనో, పేగుల్లోనో ఆ గుడ్లు పగిలి అనారోగ్యకారకమైన రసాయనాల్ని, జీవుల్ని విడుదల చేస్తాయి.
నులిపురుగులు, ఏలిక పాములు పడటం, టైఫాయిడ్, కలరా, హెపటైటిస్, ఇతర పచ్చకామెర్లు, విరేచనాలు వంటి జబ్బులకు కారణం మల సంబంధ పదార్థాలు లేదా సూక్ష్మజీవులు ఆహారం ద్వారాగానీ, తాగునీరు ద్వారా గానీ శరీరంలో చేరడమే.
మూత్రవిసర్జన వల్ల జబ్బులు పెద్దగా రాకున్నా అందులో ఉన్న యూరియా, యూరికామ్లాలు కొన్ని సూక్ష్మ జీవులకు విడిదిని ఇచ్చి ప్రోత్సహించడమే కాకుండా దుర్గంధాన్ని కలిగిస్తాయి. కానీ ఇళ్లలోని పాయిఖానాల్లో విసర్జించిన మలమూత్రాదులు మొదట ఇళ్లలో ఉన్న సెప్టిక్ ట్యాంకులోకి వెళతాయి. అక్కడ గాలి సరిగా ఉండకపోవడం వల్ల నిర్వాత ప్రక్రియ (anaerobic process) ద్వారా మల పదార్థాలు ఛేదించబడతాయి. ఆ పదార్థాలు మనం తీసుకొనే ఆహారంలోకి, తాగునీరులోకి కలవడానికి అవకాశాలు తక్కువ. ఒక వేళ నిండిపోయినా అది ప్రత్యేక సెప్టిక్ పైపుల ద్వారా డ్రెయినేజీ కాలవల గుండా నివాస ప్రాంతాల బయటికి నెట్టి వేయబడుతుంది. కాబట్టి ఆరుబయట మల మూత్రాదులకున్నంత విపత్కర పరిస్థితులు ఉండవు.
- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- =============================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...