ప్రశ్న: హిమనీ నదులు అంటే ఏమిటి? అవి ఎలా ఏర్పడతాయి?
జవాబు: ఎత్తుగా ఉన్న పర్వతాల దగ్గర వాతావరణ ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. శీతాకాలంలో ఈ ఉష్ణోగ్రత బాగా పడిపోవడం వల్ల గాల్లో ఉన్న తేమ మంచు బిందువులు కింద పడతాయి. అవన్నీ పేరుకుపోయి కొండల మధ్య ఉన్న లోయల్ని బావుల్లో నీళ్లు నింపినట్టుగా మంచు బిందువులతో నింపుతాయి. అక్కడ ఉష్ణోగ్రత సున్నా డిగ్రీల సెంటిగ్రేడుకన్నా తక్కువ ఉండడం వల్ల, పీడనం కూడా తక్కువగా ఉండి మంచు బిందువులు ఘనీభవిస్తాయి. ఇలా నెలల తరబడి కొండల మధ్య పేరుకుపోయిన మంచు బిందువులు ఒక దిమ్మలాగా బల్లపరుపుగా కొండల మధ్య ఉన్న లోతట్టు ప్రాంతాలను ఆక్రమిస్తాయి. ఇటువంటి మంచు దిమ్మలు విశాలమైన గాజు పలకలాగా కనిపిస్తాయి. దీనిపైన ఆసక్తి ఉన్నవాళ్లు ఐస్ స్కేటింగ్ వంటి శీతాకాలపు క్రీడలను ఆడుతుంటారు. ఇలాంటి మంచుతో కూడుకున్న విశాలమైన ఘనీభవించిన మంచు మైదాన ప్రాంతాలనే గ్లేషియర్‌హిమనీ నది అంటారు. వేసవి రాగానే ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఈ మంచు కరిగి స్వచ్ఛమైన నీరులాగా పర్వతాల కిందివైపునకు ప్రవహిస్తుంది. ఇలా అనేక పాయలు కలిసి నదులుగా ఏర్పడతాయి. అలా హిమాలయ పర్వతాల నుంచి గంగా, యమునతో పాటు ఎన్నో నదులు ఏర్పడ్డాయి.
- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; కన్వీనర్,--శాస్త్ర ప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
- =========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...