జవాబు: ఇది నిజమే. మనుషులు తదితర క్షీరదాలు, చాలా జంతువుల్లో లైంగిక క్రోమోజోములు ఉంటాయి. తద్వారా ఆడ జంతువు, మగ జంతువు కలిసినపుడు ఆడ జంతువు అండంలో, మగ జంతువు శుక్ర కణం లేదా తదనుగుణమైన కణం సంయోగం చెందుతుంది. ఆ క్రమంలో సంయుక్త బీజకణం (Zygote) ఏర్పడుతుంది. ఈ సంయుక్త బీజ కణంలోని జీవి ఆడనా, మగనా అక్కడే నిర్దేశితమవుతుంది. కాబట్టి గర్భధారణ తర్వాత ఆడ బిడ్డగానీ, మగ శిశువుగానీ జన్మిస్తాయి. అలాగే కోడి పుంజు, కోడిపెట్ట కలిశాక ఏర్పడ్డ గుడ్డును పొదగకముందే పుట్టబోయేది పెట్టనా లేదా పుంజా ముందే నిర్ణయమయి ఉంటుంది. కానీ మొసళ్లు, అలిగేటర్లు వంటి జంతువులలో ఆడ, మగ లైంగికత ఉన్నా వాటిలో లైంగికతను నిర్ణయించే క్రోమోజోములు లేవు. కాబట్టి అండ దశలోనే లైంగికత నిర్ధారణ అయి ఉండదు. గుడ్డు పొదిగే ఉష్ణోగ్రతను బట్టి పుట్టబోయే మొసలి ఆడా, మగనా నిర్ణయమవుతుంది. మొసలి గుడ్డు 30 నుంచి 32 డిగ్రీల సెంటిగ్రేడు కన్నా తక్కువ ఉంటే ఆడ మొసలి వస్తుంది. మొసళ్లు ఒకసారి అనేక గుడ్లు పెడతాయి కాబట్టి ఉష్ణోగ్రత 33 నుంచి 34 డిగ్రీల సెంటిగ్రేడు మధ్య ఉంటే గుడ్లలో కొన్ని ఆడవి, కొన్ని మగవిగా బయటికొస్తాయి. అదే 35 డిగ్రీల సెల్సియస్‌కన్నా ఎక్కువుంటే మగ మొసళ్లు బయటికొస్తాయి.
- ప్రొ.ఎ.రామచంద్రయ్య, నిట్, వరంగల్;-కన్వీనర్, శాస్త్రప్రచారవిభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
- ====================
- visit My website > Dr.Seshagirirao - MBBS.-