Monday, August 03, 2015

పాములకు చెవులుండవంటారు. మరి అవి ఎలా వినగలుగుతున్నాయి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...







ప్రశ్న: పాములకు చెవులుండవంటారు. మరి అవి ఎలా వినగలుగుతున్నాయి?

జవాబు: మనిషిలాంటి వెన్నెముక గల జీవుల శ్రవణేంద్రియంలో బాహ్య చెవి (తలకు చెరో పక్క డొప్పలా ఉండేవి), మధ్య చెవి, లోపలి చెవి అని మూడు భాగాలుంటాయి. ఇందులో కర్ణభేరి అనే పలుచని పొరపై పడిన ధ్వని తరంగాలను మధ్య చెవిలో ఉండే మాలియస్‌, అంకస్‌, స్టెవీన్‌ అనే చిన్న ఎముకలు లోపలి చెవికి చేరవేస్తాయి. కొన్ని జీవులలో 'కర్ణస్తంభిక' అనే ఎముక కర్ణభేరిని లోపలి చెవితో కలుపుతుంది.

పాముల విషయానికి వస్తే, వాటికి బాహ్యచెవులు, కర్ణభేరి ఉండవు. కాని లోపల చెవి ఉంటుంది. కర్ణస్తంభిక ఒక వైపు పాము లోపలి చెవికి అనుసంధానమై ఉంటే, మరో వైపు చర్మానికి కలిపి ఉంటుంది. పాము చర్మం నేలకు తాకి ఉండటం వల్ల నేలలో పయనించే ధ్వని తరంగాలను మాత్రమే కర్ణస్తంభిక గ్రహించి లోపలి చెవికి అందజేయగలుగుతుంది.

గాలిలో పయనించే ధ్వని తరంగాలు పాముకు ఏ మాత్రం వినబడవు. ఆ రకంగా అది 'పుట్టు చెవిటిదనే' చెప్పుకోవచ్చు. మరి నాగ స్వరం వూదుతుంటే పాము ఎందుకు తలాడిస్తుందంటే?నాగ స్వరం వూదే ముందు పాములవాడు చేతితో నేలను చరుస్తాడు. ఆ శబ్ద తరంగాలు పాము చర్మం ద్వారా లోపలి చెవికి చేరి పాము పడగ విప్పుతుంది. ఆ తర్వాత నాగ స్వరాన్ని వూదుతున్న బూరాని చూస్తూ దాన్ని ఎటుకేసి తిప్పితే అటు పడగ ఆడిస్తుంది. బూరాను కాటు వేయాలనే ఉద్దేశంతోనే తప్ప, సంగీతానికి మైమరచి మాత్రం కాదు. బూరా బదులు ఒక గుడ్డను చేతితో ఆడించినా పాము ఆలానే తలాడిస్తుంది.


  • =====================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

No comments:

Post a Comment

your comment is important to improve this blog...