Saturday, August 01, 2015

మరణించిన తర్వాత మృతదేహం ఎందుకు చెడు వాసననిస్తుంది?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...







ప్రశ్న: మరణించిన తర్వాత మృతదేహం ఎందుకు చెడు వాసననిస్తుంది?

జవాబు: మనతోపాటు జీవులన్నింటిలో జీవానికి కారణమైన ఎన్నో రసాయనాలున్నాయి. అందులో ప్రోటీన్లు, డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ, ఎంజైములలో నత్రజని బాగా ఉంటుంది. కొన్ని ఎంజైములలో గంధకం కూడా ఉంటుంది. మనిషి తదితర జీవులతో పాటు ప్రపంచవ్యాప్తంగా గాలిలోను, నీటిలోను, మట్టిలోను వివిధ రకాలయిన జీవులున్నాయి. అందులో బాక్టీరియాలు కూడా ఉన్నాయి. చాలా మటుకు బాక్టీరియాలు పరాన్నజీవులు. వాటికి సొంతంగా ఆహారం సముపార్జించుకొనే శక్తి లేదు. కేవలం ఇతర జీవ కణాల్లో ఉన్న పోషక పదార్థాల్ని రసాయనికంగా మార్పిడి చేసి తమకనుకూలమైన రూపంలోకి తెచ్చుకొంటాయి. ఆ క్రమంలో కొన్ని వృథారసాయనాలు కూడా ఉత్పత్తి అవుతాయి. ఉదాహరణకు మనం కలప దుంగల నుంచి డైనింగ్‌ టేబుల్‌, కుర్చీ వంటి పరికరాల్ని తయారుచేసుకునే క్రమంలో దుంగలో ఉన్న కర్ర మొత్తాన్ని వాడము కదా! కొంత వృథాగా చెక్క ముక్కల ద్వారా వెళ్లిపోతుంది కదా. అలాగే పరాన్న జీవులయిన బాక్టీరియాలు మృత దేహాల మీద దాడి చేసినపడు ఆ శరీరంలో ఉన్న వివిధ రసాయనాల్ని అవి తమకనుకూల రీతిలో మార్చుకొనే క్రమంలో దుర్గంధాన్ని ఇచ్చే గంధక పదార్థాలు, ఫాస్ఫరస్‌ పదార్థాలు, నత్రజనీ పదార్థాలు విడుదలవుతాయి. ఇవే మనకు దుర్గంధాన్ని కల్గిస్తాయి. మన ప్రాణమున్నంత వరకు ఈ బాక్టీరియాల దాడిని అరికట్టేలా మనలో రక్షణ వ్యవస్థ ఉంటుంది. మరణం తర్వాత రక్షణ వ్యవస్థ ఉండదు. కాబట్టి బాక్టీరియాల ఆటలకు హద్దూ పద్దూ ఉండదు.


- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌,-వరంగల్‌; కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం,-జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)

  • =============================

 visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...