ప్రశ్న: పిడుగు నుంచి వచ్చే వోల్టేజీని స్టోర్ చేయగలమా?
జవాబు: పిడుగు అనేది రెండు వేర్వేరు ధ్రువత్వం గల విద్యుదావేశాలతో నిండుకున్న మేఘాల మధ్య జరిగే విద్యుదుత్సర్గం. ఒక వేళ ఒక మేఘానికి దగ్గర్లో మరో మేఘం లేనట్లయితే మేఘంలో ఏ ధ్రువత్వం గల విద్యుదావేశం పోగు పడిందన్న విషయంలో సంబంధం లేకుండా ఆ స్థిర విద్యుత్తు భూమి వైపు ప్రసరిస్తుంది. ఆ సమయంలో మేఘానికి దగ్గరగా ఎవరున్నా (చెట్లు, భవనం, విద్యుత్సంభం, వ్యవసాయదారుడు లేదా దారిన పోయే దానయ్య, పశువు) వారు విద్యుత్ప్రవాహి అయినట్లయితే వారి గుండా ఈ అధిక విద్యుత్తు ప్రవహించి మరణానికి దారి తీస్తుంది.
ఈ విపత్పరిణామాన్నే మనం పిడుగు పాటు అంటాం. పిడుగు పడే సమయంలో విద్యుత్తు ఉన్న మేఘానికి, భూమికి మధ్య కొన్ని లక్షల వోల్టుల విద్యుత్తు పొటన్షియల్ ఉంటుంది. ఈ విద్యుదుత్సర్గం లిప్తపాటు మాత్రమే ఉంటుంది. అదే పనిగా గంటల తరబడి కొనసాగదు. అంత తక్కువ వ్యవధిలో అంత అధిక మోతాదులో ఉన్న విద్యుత్తును నిల్వ చేయగల పరికరాలు, సాధనాలు లేవు. ప్రవహించే విద్యుత్తును దాచుకొని ఆ తర్వాత వాడుకోగలిగిన వ్యవస్థలు భౌతికంగా కెపాసిటర్లు, రసాయనికంగా ఛార్జబుల్ బ్యాటరీలు మాత్రమే! కానీ పిడుగు పడే సమయంలో వాటిని పిడుగు మార్గంలో ఉంచితే అవి కాలిపోవడం మినహా విద్యుత్తు నిల్వ ఉండటం దాదాపు అసంభవం.
- ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్, వరంగల్; కన్వీనర్,-శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
- ====================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...