Wednesday, May 27, 2015

Good smell to flowers during nights?, రాత్రివేళ పూల నుంచి సువాసనలేల?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...







ప్రశ్న: రాత్రి వేళల్లో వికసించే మల్లెపూలకు, నైట్‌క్వీన్‌కు అంత సువాసన ఎందుకు?

జవాబు: కొన్ని పూలకు ఆకర్షణీయమైన రంగులు ఉంటే మల్లె, నైట్‌క్వీన్‌(రాత్‌కీ రాణి) లాంటి పూలకు మధురమైన సువాసన ఉంటుంది. కొన్ని పూలకు రంగు, సువాసనా రెండూ ఉంటాయి. వీటి వెనుక ప్రత్యేకమైన ప్రయోజనం ఉంది. క్రిమికీటకాలు, తేనెటీగలు, తుమ్మెదలు, సీతాకోక చిలుకలు పూలలోని మకరందాన్ని పీల్చుకుని జీవిస్తాయి. ఇవి పూలపై వాలినపుడు వాటి కాళ్లకు, రెక్కలకు పూలలోని పుప్పొడి అంటుకుంటుంది.

ఈ కీటకాలు మరో పువ్వుపై వాలినపుడు పుప్పొడి రేణువులు ఆ పూవు అండాశయాన్ని చేరి ఫలదీకరణం జరుగుతుంది. అపుడే పువ్వు కాయగా మారుతుంది. అవే పండ్లుగా మారి వాటి గింజలు భూమిపై పడి మొలకెత్తి మొక్కలు పెరుగుతాయి. ఈ విధంగా మొక్కలు ఉత్పత్తి కావడానికి ఉపయోగపడే కీటకాలను ఆకర్షించేందుకే పూలకు అందమైన రంగులు, రకరకాల సువాసనలు ఏర్పడతాయి.

కీటకాల్లో కొన్ని పగలు సంచరిస్తే మరికొన్ని రాత్రివేళల్లో తిరుగుతుంటాయి. పగటి వేళ వీటిని ఆకర్షించడానికి వాటి రంగులు దోహదపడతాయి. రాత్రివేళ రంగులు కనబడవు కాబట్టి రాత్రి పూచేపూలు మరింత ఎక్కువగా సువాసనను వెదజల్లుతాయి.

సాయం వేళల్లో, రాత్రులలోని వాతావరణ పరిస్థితులకు మాత్రమే ప్రేరణ పొంది వికసించే జాజి, మల్లె, నైట్‌క్వీన్‌ లాంటి పూలకు మనోహరమైన సువాసన ఉండటానికి కారణం అదే. రాత్రిపూట రంగులతో పని ఉండదు కాబట్టి సాధారణంగా అలాంటి పూలు చీకటిలో కనిపించేందుకు వీలుగా తెల్లని రంగులో ఉంటాయి.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌

  • =======================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

No comments:

Post a Comment

your comment is important to improve this blog...