Sunday, May 03, 2015

who invented bacteria?-సూక్ష్మ జీవుల ఉనికిని ఎవరు కనిపెట్టారు?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...







ప్రశ్న: భూమ్మీద సూక్ష్మజీవులను మొదటి సారిగా పరిశీలించింది ఎవరు? వాటి ఉనికిని వూహించినదెవరు?

జవాబు: సూక్ష్మజీవులే ఈ భూమ్మీద ఏర్పడ్డ మొదటి జీవులు. భూమి సౌరమండలపు పళ్లెం (solar disc) నుంచి తేజోవంతమైన చిన్న పాటి నక్షత్రంగా సుమారు 600 కోట్ల సంవత్సరాల క్రితం వేరుపడింది. ఆ తర్వాత సుమారు 150 కోట్ల సంవత్సరాలకు పూర్తిగా కాంతిని కోల్పోయి గ్రహం(planet)గా రూపొందింది. అపుడున్న విపరీత రసాయనిక భౌతిక పరిస్థితుల ప్రభావంతో నిర్జీవమైన పదార్థాల నుంచి తనను తాను ప్రత్యుత్పత్తి చేసుకోగల DNA అణువు ఏర్పడింది. పరిణామక్రమంలో ఇలాంటి DNA లేదా RNAలున్న కణాలు అవతరించాయి. అంటే నేటికి సుమారు 350 కోట్ల ఏళ్ల క్రితం కాలక్రమేణా ఈ భూమ్మీద సూక్ష్మజీవులు ఏర్పడ్డాయి. ఇందులో దాదాపు 99.9 శాతం వరకు ఏకకణ (mono cellular) జీవులే. అవే క్రమేణా జీవ పరిణామం ద్వారా బహుకణ జీవులుగా, జంతువులుగా, వృక్షాలుగా వివిధ జాతుల్ని ఏర్పరిచాయి. నేటికీ వాటి సంఖ్య ఇతర జంతు, వృక్ష జాతులకన్నా ఎక్కువగానే ఉంది. ఉదాహరణకు మన పెద్ద ప్రేగులోనే ఉన్న బ్యాక్టీరియాల సంఖ్య మన సొంత జీవకణాల కన్నా హెచ్చుగా ఉంటుంది.

క్రీ||పూ 600 సంవత్సరాల కిందట వీటి ఉనికిని జైనమత వ్యవస్థాపకుడు మహావీరుడు తదితరులు వూహించారు. కంటికి కనిపించని జీవులు ఉంటాయని భావించారు. కానీ శాస్త్రీయమైన రుజువులు కేవలం క్రీ||శ 17వ శతాబ్దం వరకు లభించలేదు. 1674 సంవత్సరంలో లీకెన్‌ హాక్‌ అనే జీవశాస్త్రవేత్త తొలిసారిగా తానే రూపొందించిన సూక్ష్మ దర్శిని సహాయంతో సూక్ష్మ జీవుల్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆ తర్వాత రోబర్ట్‌ హుక్‌ దాదాపు అదే కాలంలో సూక్ష్మ దర్శిని ద్వారా వివిధ సూక్ష్మ జీవుల్ని పరిశీలించి వర్గీకరించాడు. లూయీ పాశ్చర్‌, స్పల్లంజాని, కోచ్‌ వంటి శాస్త్రవేత్తల ఎనలేని కృషివల్ల సూక్ష్మ జీవుల వల్ల కలిగే అనేక లాభనష్టాల గురించి వివరంగా తెలిసింది.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; జనవిజ్ఞానవేదిక, శాస్త్రప్రచార విభాగం (తెలంగాణ)

  • =========================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

No comments:

Post a Comment

your comment is important to improve this blog...