ప్రశ్న: అగ్ని పర్వతం పేలుడు, అంతరిక్షం నుంచి ఉల్కల తాకిడి, ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రమాదకారి?
జవాబు: భూమిపై ప్రభావశీలమైన అగ్ని పర్వతాలు 600 వరకూ ఉన్నాయి. అవి విస్ఫోటనం చెందినపుడు వెదజల్లే అత్యధిక ఉష్ణోగ్రతగల లావా ప్రవాహం, భగభగమండే శిలలు ఆ పర్వత ప్రాంతాలనే కాకుండా వాటికి దూరంగా ఉండే ప్రదేశాలకు కూడా హాని కలిగిస్తాయి. అగ్ని పర్వత పేలుళ్లలో వాతావరణంలోకి టన్నుల కొలదీ గంధకం, బూడిద వెదజల్లినట్టవుతుంది. ఈ పదార్థాలు గాలుల ద్వారా భూగోళమంతా వ్యాపించి సూర్యకిరణాలు ప్రసరించకుండా అడ్డుపడడంతో అగ్ని పర్వతం పేలిన చాలా సంవత్సరాల వరకూ భూమిపై చల్లని వాతావరణం అలుముకొంటుంది.
ఇక రోదసీ నుంచి భూమిపైకి పడే ఉల్కల వల్ల ప్రమాదం ఆ ఉల్క (meteorite)పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. ఉల్కాపాతం, అగ్ని పర్వత పేలుడు ఈ రెండింటివల్ల భూవాతావరణంలో దుమ్ము, ధూళి, గాలి తుంపరలు అలుముకోవడంతో 'భౌగోళిక చల్లదనం' అనేక సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఎటొచ్చీ ఎక్కువ పరిమాణంగల ఉల్క భూమిని ఢీకొంటే కలిగే ప్రమాదం అగ్ని పర్వత పేలుడు కన్నా ఎక్కువ. అతి పెద్ద ఉల్కాపాతం భూమిని ఢీకొనడం వల్లే డైనోసార్ల సంతతి భూమిపై అంతమయ్యింది. కానీ ఉల్కాపాతం అరుదుగా జరుగుతుంది. అదే తరచూ జరిగే అగ్ని పర్వత పేలుళ్లు ఎప్పుడూ భూవాతావరణానికి ప్రమాదకరమే.
- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- ==========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...