Sunday, July 13, 2014

లై డిటెక్టర్‌ ఎలా పనిచేస్తుంది?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...

ప్రశ్న: నిందితులను లై డిటెక్టర్‌తో పరీక్షిస్తుంటారు కదా! మరి అది ఎలా పనిచేస్తుంది?

జవాబు: వ్యక్తులు అబద్ధం చెప్పేటప్పుడు తమకు తెలియకుండానే ఉద్వేగానికి, భావావేశానికి లోనవుతారని అపుడు ఆ వ్యక్తి శరీరంలో కూడా కొన్ని సున్నితమైన మార్పులు చోటుచేసుకుంటాయనే సిద్ధాంతం ఆధారంగా లై డిటెక్టర్‌ను రూపొందించారు.

ఈ పరికరం మానవ శరీరంలోని రక్తపోటు, గుండెచప్పుడు శ్వాసక్రియ, చెమట పట్టడం లాంటి శారీరక ధర్మాలను రికార్డు చేస్తుంది. దీనిలో ఉండే న్యూమోగ్రాఫ్‌ట్యూబ్‌ అనే సన్నని రబ్బరు గొట్టాన్ని నిందితుని ఛాతీచుట్టూ గట్టిగా కడతారు. రక్తపుపోటు కొలవడానికి ఒక పట్టీని జబ్బకు కడతారు. చర్మంలోని ప్రకంపనలను కొలవడానికి శరీర భాగాలలో కొద్ది మోతాదులో విద్యుత్‌ను ప్రవహింపచేసి అందులోని మార్పులను గ్రహించే ఏర్పాట్లు కూడా ఇందులో ఉంటాయి. శరీరంలో కలిగే ప్రేరేపణలను, ఉద్వేగాలను సున్నితమైన ఎలక్ట్రోడుల ద్వారా గ్రహించి గ్రాఫుద్వారా నమోదు చేస్తారు. ఈ పరిశీలనల ద్వారా ఒక వ్యక్తి చెప్పే నిజానిజాలను కనుగొంటారు.

ఈ పరికరాన్ని 1921లో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని జాన్‌లాగూన్‌ అనే విద్యార్థి ఒక పోలీసు ఆఫీసరు సాయంతో కనిపెట్టాడు. లైడిటెక్టర్‌ను నేరవిచారణలో ఒక సాధనంగానే న్యాయవ్యవస్థ గుర్తిస్తుంది. కేవలం ఇదిచ్చే సమాచారం ఆధారంగానే నేర నిర్ధరణ చేయరు.

  • - ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌


  • ====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...