ప్రశ్న: సుడి గుండాలు, వాయు గుండాలు ఎలా ఏర్పడతాయి?
జవాబు: శాస్త్రీయంగా చూస్తే సుడి గుండాలు, వాయు గుండాలు ఒకే దృగ్విషయానికి చెందిన అంశాలు. సాధారణ పరిభాషలో సుడిగుండాలంటే చెరువులు, సముద్రాలు, ఆనకట్టల నీళ్లలో ఏర్పడే సుడులు. గాలిలో ఏర్పడే ఇలాంటి సుడుల్నే వాయు గుండాలు లేదా సుడి గాలులు అంటుంటారు. వాయువులయినా, నీరయినా ఇతర ద్రవాలయినా అవి ఒక చోట స్థిరంగా ఉండకుండా విస్తరిస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని ప్రవాహకాలు అంటాం. అవి ప్రవహించేటప్పుడు వాటిలోని అన్ని పదార్థ భాగాలు ఒకే వేగంలో కదలవు. ఆ ప్రవాహకాల్లో ఉన్న అణువులు, కణాలు, తేలికపాటి శకలాలు పరస్పరం అడ్డుపడుతుంటాయి. తద్వారా ప్రవాహకంలో అన్ని ప్రాంతాలు ఒకే వేగంతో కాకుండా కొన్ని పొరలు వేగంగా మరికొన్ని పొరలు మెల్లగా కదులుతాయి. ఇలా సంభవించే అంతర్గత ఘర్షణ వల్ల కలిగే వేగాల తేడాను స్నిగ్ధత అంటాం. నీటిలో గానీ, వాయువుల్లో గానీ, మరే ఇతర ప్రవాహకాలలో గానీ ఉష్ణోగ్రతా తేడాలు ఉన్నట్లయితే అవి సాంద్రతల్లో తేడాలకు దారి తీస్తాయి. పదార్థాలు అధిక సాంద్రత నుంచి అల్ప సాంద్రత వైపునకు ప్రవహించడం సహజం. ఆ క్రమంలో వేర్వేరు దిశల్లో స్నిగ్ధతలు వేరు వేరుగా ఉన్నట్లయితే సుడి గుండాలు, వాయు గుండాలు ఏర్పడే అవకాశం ఉంది. మామూలు రోడ్ల మీద సుడిగాలుల నుంచి టోర్నడోల వరకు వీటి శక్తి మారుతూ ఉంటుంది.
- ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- ====================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...