ప్రశ్న : మనుషులకన్నా మొక్కలు వేగంగా ఎక్కువ ఎత్తుకు పెరుగుతాయి. ఎందుకు?
జవాబు : అమీబాకన్నా ఏనుగు ఎందుకు ఎత్తుగా ఉంది అన్న ప్రశ్న కూడా మీరు అడిగిన ప్రశ్న లాంటిదే. భూమిపై దాదాపు 3కోట్ల రకాల జంతు జాతులు ఉన్నట్లు అంచనా. అందులో 90 శాతం అకశేరుకాలే. ఇందులో మళ్లీ దాదాపు 80 శాతం కీటకాలే. ఇక వృక్షజాతులు దాదాపు 2 కోట్ల వరకు ఉన్నట్లు అంచనా. అంటే మొత్తం జీవ జాతులు భూమ్మీద సుమారుగా 5 కోట్ల వరకు ఉండవచ్చును. ప్రతీ జాతికి తమదైన ప్రత్యేక శరీర నిర్మాణ వ్యవస్థ ఉంటుంది. దాదాపు అన్నీ జంతుజాతులూ పరాన్నజీవులే. అవి తమ మనుగడకు విధిగా వృక్షజాతులమీద ఆధార పడతాయి. నిలకడగా ఉండడానికి శత్రువుల నుంచి రక్షించుకోవడానికి తేరిపారా చూడ్డానికి కీలకమైన శరీర భాగాల్ని నేల తాకిడి నుంచి రక్షించుకోవడానికి వివిధ జీవన ప్రత్యుత్పత్తులున్న జంతు జాతులకు వివిధ రకాలైన శరీర పరిమాణాలు ఉన్నాయి. మనిషి రెండు కాళ్లమీద నిల్చుని ఎదురుగా ఉన్న దృశ్యాలను చూసే సామర్థ్యం ఉన్నవాడు. కాబట్టి నేల నుంచి సగటున అయిదున్నర అడుగుల ఎత్తులో తల ఉంటుంది. మరీ ఎత్తుగల వారు అంటే 10 అడుగులు ఉన్నట్త్లెతే గరిమనాభి నుంచి భూమికున్న దూరం పెరగడం వల్ల చిన్నచిన్న తాకిడులకే తూలిపడే ప్రమాదం ఉంది. కానీ చెట్లు అలాకాదు. తమ ఆకులకు సరిపడినంత సూర్యరశ్మితగిలితేనే కిరణజన్య సంయోగక్రియ సజావుగా జరుగుతుంది. అందుకే ఎత్తు ఎదగాలి. తగినంత కార్బన్‌డై ఆక్సైడ్ కావాలన్నా శ్వాస క్రియకు ఆక్సిజన్ కావాలన్నా ఏపుగా శాఖోపశాఖలుగా గాల్లోకి విస్తరించుకోవాలి. వాటి కాయలు, పువ్వులు జంతువుల బారి నుంచి రక్షణ పొందాలంటే నేలకు దూరంగా పై వైపు పెరగాలి. అలాగని అన్ని చెట్లూ మనిషికన్నా ఎత్తుకు ఎదగలేవు. గడ్డి మొక్కలు, తీగలు కురచగానే ఉంటాయి.
- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- =========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...