Friday, August 15, 2014

సముద్రంలో కెరటాలు విపరీతంగా ఎందుకు వస్తాయి? నదులు, వాగుల్లో అలా రావెందుకని?

 


ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !... 


ప్రశ్న: సముద్రంలో కెరటాలు విపరీతంగా ఎందుకు వస్తాయి? నదులు, వాగుల్లో అలా రావెందుకని?

జవాబు:
కొంచెం లోతైన ప్లాస్టిక్‌ పళ్లెంలో నీళ్లు పోసి నీటి ఉపరితలానికి సమాంతరంగా మెల్లగా గాలి ఊదితే, పళ్లెం అంతటా చిన్న తరంగాలు కదలడాన్ని గమనించవచ్చు. ఈ విధంగానే సముద్ర ఉపరితలంపై అలలు ఏర్పడుతాయి.
భూమి ఏర్పడిన తొలి నాళ్లలో ఖండాలన్నీ ఒకే భూభాగంగా కలిసి ఉండేవి. ఈ ఖండాలకు ఆధారమైన ఫలకాలు భూమి లోపల ఉండే అత్యధిక ఉష్ణోగ్రత వల్ల, ద్రవరూపంలో ఉన్న రాళ్ల కదలికల వల్ల ఒక దానికొకటి దూరంగా కదలసాగాయి. ఆ విధంగా భూమి ఖండాలుగా విడిపోయిన తర్వాత మధ్యలోని లోతైన అగాథాల్లో సముద్రాలు ఏర్పడ్డాయి. సముద్రంపై ఉండే విస్తారమైన నీటి ఉపరితలంపై గాలి తీవ్రంగా వీచడం వల్ల కెరటాలు ఏర్పడుతాయి. సముద్రపు నీటి ఉపరితలంపై సమాంతరంగా గాలి వీచడం వల్ల ఆ నీరు పైకి లేస్తుంది. పైకి లేచిన నీటిని భూమి గురుత్వాకర్షణ శక్తి కిందికి లాగుతుంది. పైకి లేచిన కెరటం కిందికి పడినప్పుడు ఏర్పడే గతిజశక్తి (కైనెటిక్‌ ఎనర్జీ) వల్ల కూడా కొంత నీరు పైకి లేస్తుంది. పైకీ కిందికీ ఊగుతున్న నీటి కదలిక చుట్టుపక్కల నీటిలో కూడా వ్యాపించి కెరటాలు నిరంతరంగా ఏర్పడుతాయి. సముద్రపు లోతులలోకి వెళ్లే కొలదీ నీటి సాంద్రత ఎక్కువగా ఉండడంతో కెరటాల కదలికలకు ప్లవన శక్తి(buyoncy) కూడా తోడై, మరిన్ని కెరటాలు పుడతాయి. సముద్రంపై వీచే గాలి వేగం ఎక్కువయ్యే కొలదీ కెరటాల ఎత్తు ఎక్కువవుతుంది. అంటే నిలకడగా ఉన్న లోతైన నీటిపై గాలి వీయడం వల్ల సముద్రంలో కెరటాలు ఏర్పడుతాయి. అదే నిలకడ లేకుండా వేగంగా నీరు ప్రవహిస్తున్న నదులు, వాగుల్లో కెరటాలు అంతగా ఏర్పడే అవకాశం లేదు.

- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌
  • =====================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...