ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్ర : వీధి దీపాలకు పసుపురంగేల?
జవాబు: స్వచ్ఛమైన తెల్లని కాంతిని పటకం గుండా పయనించేటట్లు చేస్తే అది వూదా, నీలి, ఆకుపచ్చ, పసుపు, నారింజ, ఎరుపు అనే ఏడు రంగులుగా విడిపోతుందని మనందరికీ తెలుసు. ఇప్పుడు వీధి దీపాలుగా మెర్క్యురీ లాంప్స్‌ను వాడితే ఏం జరుగుతుందో చూద్దాం. పొగమంచు పడే రాత్రివేళల్లో, తేమశాతం ఎక్కువగా ఉండే శీతాకాలపు, వర్షాకాలపు రాత్రివేళల్లో వాతావరణంలో ఉండే అతి చిన్న నీటి బిందువుల కణాలు పట్టకాల్లాగా పనిచేస్తాయి. మెర్క్యురీ పేపర్ ల్యాంపుల నుంచి వచ్చే తెల్లని కాంతి ఈ నీటి కణాల ద్వారా పయనిస్తే ఏడురంగులుగా విడిపోతుంది. అప్పుడు దీపాల చుట్టూ గుండ్రని ఇంద్రధనస్సు లాంటి రంగుల కాంతి వలయాలు ఏర్పడతాయి. దీని వల్ల వాహనదారుల చూపులో అస్పష్టత, గజిబిజి ఏర్పడుతుంది. ఇది ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది.
వీటిని నివారించడానికి ఏకవర్ణ కాంతి పసుపు రంగును మాత్రమే వెలువరించే సోడియం పేపర్ ల్యాంపులను వీధి దీపాలుగా ఉపయోగిస్తారు. ఈ పసుపు కాంతి నీటి కణాల ద్వారా పయనించినా అది మరే రంగుగా విడిపోదు. అంతేకాకుండా పసుపు రంగు కాంతి కిరణాలు అతి తక్కువగా పరావర్తనం, వక్రీభవనం చెందుతాయి. అందువల్ల మన చూపులో అస్పష్టత ఉండదు. పైగా తెల్లని కాంతి తర్వాత ఎక్కువ వెలుగునిచ్చేది కూడా పసుపు రంగుకాంతే. ఆ కాంతిలో మనం చూసే వస్తువులు వాటి సహజమైన రంగుల్లో స్పష్టంగా, ప్రకాశవంతంగా కనబడతాయి.
- ప్రొ|| ఈ.వి సుబ్బారావు,--హైదరాబాద్
- ===============================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...