ప్రశ్న: కేంద్రక సంలీనం జరపాలంటే అధిక ఉష్ణోగ్రత అవసరం. కానీ శీతల కేంద్రక సంలీనం జరిపి ప్రస్తుతమున్న శక్తి సంక్షోభాన్ని తొలగించలేమా?
జవాబు: కేంద్రక సంలీన చర్య అంటే సాధారణంగా 4 హైడ్రోజన్ కేంద్రకాలను ఒక హీలియం కేంద్రకంగా సంలీనం చేయడమే. 4 విడివిడి హైడ్రోజన్ కేంద్రకాలలో ఉండే 4 ప్రోటాన్ల ద్రవ్యరాశి కన్నా ఒక హీలియం పరమాణు కేంద్రకంలో నెలకొనే రెండు ప్రోటాన్ల, రెండు న్యూట్రాన్ల సంయుక్త ద్రవ్యరాశి తక్కువ. అంటే నాలుగు హైడ్రోజన్లు ఒక హీలియంగా మారే ప్రక్రియలో ఎంతో కొంత ద్రవ్యరాశి మాయమయిందన్నమాట. కానీ ద్రవ్యరాశి శక్తిగా మారడం ద్వారా మాత్రమే మాయం కాగలదని ద్రవ్యశక్తి నిత్యత్వ సూత్రం చెబుతుంది. కాబట్టి మాయమైన ద్రవ్యరాశి కొంతశక్తిగా మారుతుంది. కొంచెం ద్రవ్యరాశే మాయమయినా ఏర్పడేశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఏర్పడేశక్తి(E) మాయమైన ద్రవ్యరాశి(m)కాంతి వేగ వర్గాల (c2) లబ్దానికి సమానమని ఐన్‌స్టీన్ సాపేక్షతా సిద్ధాంతంలో (E= mc2) ద్వారా నిరూపితమైంది. ఉదాహరణకు ఓ బఠాణీ గింజంత బరువున్న ద్రవ్యరాశిని మనం పైసూత్రం ప్రకారం శక్తిగా మారిస్తే ఆ శక్తితో సుమారు 25 కోట్ల లీటర్ల నీటి ఉష్ణోగ్రతను 20 డిగ్రీల సెల్సియస్ నుంచి సుమారు 80 డిగ్రీల సెల్సియస్ వరకు వేడిచేయగలం. అంతటి శక్తి కేంద్రక విచ్ఛిత్తి, కేంద్రక సంలీన చర్యల్లోనే సాధ్యమవుతుంది. కానీ 4 హైడ్రోజన్ పరమాణు కేంద్రకాలను కలిపి ఉంచాలంటే మొదట చాలా శక్తిని ఖర్చుచేయాలి. అది సాధారణ పద్ధతుల్లో వీలుకాదు కాబట్టి మొదట కేంద్రక విచ్ఛిత్తి ద్వారా విడుదలయ్యే శక్తిని వినియోగించుకుని కేంద్రక సంలీన చర్యను ప్రేరేపిస్తారు. శీతల కేంద్రక సంలీనం వీలుకాదని రుజువైంది.
- ప్రొ||ఎ.రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- =====================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...