ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న: మైక్రోవేవ్ ఒవెన్‌లలో సిరమిక్ (పింగాణీ), ప్లాస్టిక్ పాత్రలలోనే పదార్థాలను ఉంచి ఉడికిస్తారు. అంతకన్నా దృఢంగా ఉన్న లోహ పాత్రల్ని వాడకూడదంటారు. ఎందుకు?
జవాబు: విశ్వంలో కాంతి విద్యుదయస్కాంత తరంగాల రూపంలో విస్తరించి ఉంటుంది. ఈ కాంతి తరంగదైర్ఘ్యాలు వేర్వేరుగా ఉంటాయి. అత్యధికంగా కొన్ని వందల కిలోమీటర్ల మేర ఉండే తరంగదైర్ఘ్యం నుంచి అత్యల్పంగా ఫెమ్టో మీటరు (మిల్లీమీటరులో ట్రిలియన్ భాగం లేదా ఓ మిల్లీమీటర్ని లక్షకోట్లు విభజిస్తే ఏర్పడే భాగం) తరంగదైర్ఘ్యం వరకు ఉంటాయి. కాంతికి, పదార్థాలకు అన్యోన్య సంబంధం ఉంది. పదార్థాలలోని మార్పులతోనే విశ్వంలో కాంతి జనిస్తుంది. పదార్థాలపై పడ్డ కాంతి వాటిలో ఎంతోకొంత మార్పును కలిగించక మానదు. ఈ విధంగా చూస్తే మైక్రోవేవ్ ఒవెన్‌లో జనించే సూక్ష్మతరంగాల తరంగదైర్ఘ్యం సుమారు 1 నానోమీటరు నుంచి 1 మీటరు వరకు ఉంటుంది. ఇలాంటి తరంగాలు విద్యున్నిరోధ పదార్థాల గుండా బాగా చొచ్చుకుపోయినా, పాత్రల గోడలుదాటి అవతలికి వెళ్లవు. పింగాణీ, లేదా ప్లాస్టిక్ వస్తువులు అలాంటి విద్యున్నిరోధక పదార్థాలే. వీటిలో ఆహారపదార్థాలను ఉంచి మైక్రోవేవ్ ఒవెన్‌లో పెట్టినప్పుడు మైక్రోవేవ్ తరంగాల శక్తి మొత్తమంతా దినుసులకు చేరుతుంది. అదే లోహపు పాత్రలను పెడితే ఇలా జరగదు. మామూలు పొయ్యి మీద పింగాణీ పాత్రల్ని పెడితే అవి అధమ ఉష్ణవాహకాలు కాబట్టి పగిలిపోతాయి. అదే లోహపాత్రలను పెడితే, పొయ్యి జ్వాల నుంచి వచ్చే వేడి పాత్రకు అన్నివైపులా విస్తరించడం వల్ల పాత్రలు పగిలిపోవు. కాబట్టి మామూలు మంటల పొయ్యి మీద వాడే పాత్రలకు, మైక్రోవేవ్ ఒవెన్‌లో వాడే పాత్రలకు పరస్పర విరుద్ధ తత్వం ఉందన్నమాట.
- ప్రొ||ఎ.రామచంద్రయ్య నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- ==========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...