ప్రశ్న: కాంతివేగం ధ్వని వేగం కన్నా అనేక రెట్లు ఎక్కువ. మరి మనం టీవీని ఆన్ చేస్తే ముందు శబ్దం వచ్చి తర్వాత బొమ్మ కనబడుతుంది ఎందుకు?
జవాబు: దీనికి కారణం మన ఇంట్లో ఉండే టీవీలో జరిగే ప్రక్రియ. వివరాల్లోకి వెళ్లే ముందు శబ్ద, దృశ్యాన్ని టీవీ కెమెరాలు చిత్రీకరించేప్పుడు శబ్ద సంబంధిత విషయాలు కూడా ఒక మైక్రోఫోన్ సాయంతో ఏక కాలంలో రికార్డు అవుతాయి. ఆ వివరాలు దూరప్రాంతాలకు ప్రసారమయ్యే ముందు దృశ్య, శబ్ద వివరాలను విద్యుత్ స్పందనాలుగా మారుస్తారు. ఆ తర్వాత వాటిని విద్యుత్ అయస్కాంత తరంగాలుగా మార్చి ప్రసారం చేస్తారు. ఈ తరంగాల వేగం కాంతి తరంగాల వేగంతో సమానంగా ఉంటుంది. ఇలా ప్రసారమయి వాతావరణంలో పయనించిన తరంగాలను మన ఇంటిలో ఉండే టీవీ 'ఏంటినా' గ్రహిస్తుంది.
మనం టీవీ పెట్టినపుడు ఏంటినా గ్రహించిన విద్యుదయస్కాంత తరంగాలు టీవీలోకి చొరబడతాయి. టీవీలో ఉండే పరికరాలు, విద్యుదయస్కాంత తరంగాలను విద్యుత్ స్పందనాల రూపంలోకి మారుస్తాయి. టీవీలో శబ్ద, దృశ్యలకు సంబంధించిన విషయాలకు వేర్వేరు విభాగాలుంటాయి. దృశ్య విభాగాన్ని 'పిక్చర్ ట్యూబ్' (దీనిని కేథొడ్ కిరణాల ట్యూబ్ అని కూడా అంటారు) ఎలక్ట్రాన్ కిరణాల రూపంలోకి మార్చి ఆ కిరణాలను టీవీ తెరపై పడేటట్లు చేసి మనకు బొమ్మ రూపంలో కనబడేటట్లు చేస్తుంది. పిక్చర్ ట్యూబ్ నుంచి ఎలక్ట్రాన్ కిరణాలు ఆ ట్యూబ్‌లో ఉండే ఫిలమెంట్ వేడైన తర్వాతే వెలువడుతాయి. అలా వేడెక్కడానికి కొంత సమయం పడుతుంది. కానీ టీవీలోని శబ్దవిభాగం శబ్ద తరంగాలను వెలువరించడానికి ఏమాత్రం సమయం పట్టదు. విద్యుత్ అయస్కాంత తరంగాలు శబ్ద విభాగాన్ని చేరీచేరకముందే ఏ మాత్రం ఆలస్యం లేకుండా శబ్ద తరంగాలు వెలువడుతాయి. అందువల్లనే టీవీ ఆన్ చేయగానే ముందు మనం ధ్వనిని వింటాం.
- ప్రొ|| ఈ.వి సుబ్బారావు, హైదరాబాద్
- =======================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...