ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న: చిన్న గులకరాయి సైతం నీటిలో మునుగుతుంది. కానీ పెద్ద కర్ర మొద్దు మాత్రం నీటిపై తేలుతుంది. ఎందుకు?
జవాబు: ఒక వస్తువు మరో ద్రవంలో మునుగుతుందా తేలుతుందా అన్నది ఆ వస్తువు సైజును బట్టి ఉండదు. అది కేవలం ద్రవపు సాంద్రతకు, ఆ వస్తువు సాంద్రతకు ఉన్న సాపేక్షతను బట్టి నిర్ధారించబడుతుంది. ఒక వస్తువు మునగడం అంటే ఆ వస్తువు గురుత్వాకర్షణ బలం ద్వారా ఆ ద్రవంలో కిందికి చొచ్చుకుపోవాలి. ఆ క్రమంలో
అది తనంతటి ఘనపరిమాణం గల ద్రవాన్ని తొల్చుకుంటూ లోనికెళ్లాలి. ఒకవేళ మీదనున్న ఆ ద్రవపు ద్రవ్యరాశి ఎక్కువయితే తానే కింద ఉండటానికి ప్రయత్నిస్తుంది కానీ తన కన్నా తక్కువ ద్రవ్యరాశి ఉన్న పదార్థాన్ని తొలవనీయదు కదా! అందుకే ద్రవ్యరాశికి, ఘనపరిమాణానికి ఉన్న నిష్పత్తిని పరిగణించాలి. ఈ నిష్పత్తినే సాంద్రత అంటారని తెలిసే ఉంటుంది. సాంద్రత ఓ ఆంతరంగిక ధర్మం. అంటే ఆ విలువ పదార్థాపు సైజును బట్టి కాకుండా పదార్థపు లక్షణాన్ని బట్టి ఉంటుంది. నీటి బొట్టుకైనా, పెద్ద ట్యాంకు నిండా ఉన్న నీటికైనా సాంద్రత ఒకటే.
వస్తువు సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువయితే తేలుతుంది. ఎక్కువయితే మునుగుతుంది. గులకరాయి సాంద్రత నీటి సాంద్రత కన్నా హెచ్చు. కాబట్టి మునిగింది. కర్రమొద్దు సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువ. కాబట్టి తేలుతుంది. ఈ ధర్మాలనే ప్లవన సూత్రాలు అంటారు.
-ప్రొ||ఎ.రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- ===========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...