ప్రశ్న: భూమి నుంచి మనకు చంద్రుడు ఎప్పుడూ ఒకేవైపు కనిపిస్తాడు ఎందుకు?
జవాబు: చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరిగే కాలం, అలా తిరుగుతూనే దాని అక్షం ఆధారంగా తన చుట్టూ తాను తిరగడానికి పట్టే పరిభ్రమణ కాలం సమానంగా ఉండడం వల్ల ఎల్లప్పుడూ చంద్రుని ఒక వైపు ఉపరితలమే మనకు కనిపిస్తుంది. చంద్రుని కక్ష్యకు ఉండే ఈ ధర్మాన్ని ఏక కాలిక భ్రమణం (Synchronous Rotation) అంటారు. చంద్రుడు ఇలా తిరగడానికి కారణం చంద్రునిపై భూమి ప్రయోగించే ఆటుపోట్ల ప్రభావం. చంద్రునిపై ఎలాంటి సముద్రాలు లేకపోవడంతో అక్కడ ఆటుపోట్లకు గురై పొంగిపొరలే నీరు లేనందున, భూమి గురుత్వాకర్షణ బలం చంద్రుని తలంపైనే పనిచేస్తుంది. ఆ ప్రభావం చంద్రుని తలాన్ని పైకి కిందకీ ఊగేటట్లు చేస్తుంది. అందువల్ల చంద్రుడు తన చుట్టూ తాను తిరిగే పరిభ్రమణ వేగం క్రమేపీ తగ్గుతూ, అది చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరిగే ప్రదక్షిణ కాలానికి సమానమైంది. అందువల్లే మనం ఎల్లప్పుడూ చంద్రుని ఒకవైపు ఉండే గోతులను (Craters) ఎత్తు పల్లాలను చూస్తున్నాం. అదే కాకుండా చంద్రుడు భూమి చుట్టూ తిరిగే కక్ష్య దీర్ఘవృత్తాకారంలో ఉండడంతో చంద్రుడు ఉపరితలంలో సగం కన్నా ఎక్కువగా, 59 శాతం మేర చూడగలుగుతున్నాం. మానవుడు ప్రయోగించిన అంతరిక్ష నౌకలు చంద్రుని అవతలి వైపునకు వెళ్లి అక్కడి ఛాయాచిత్రాలను భూమికి పంపే వరకు అది ఎలా ఉంటుందనే సంగతి మనకు తెలియలేదు.
- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- ====================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...