ప్రశ్న: ఓల్టేజి విలువలు తక్కువైనపుడు, విద్యుత్ పరికరాల్లో కరెంటు ఎక్కువగా ప్రవహిస్తుంది. ఎందుకు?
జవాబు: మనం ఇళ్లలో వాడే విద్యుత్ పరికరాలను రెండు రకాలుగా విభజింపవచ్చు. ఒక రకం విద్యుచ్ఛక్తిని ఉష్ణశక్తిగా మార్చే ఎలక్ట్రిక్ ఐరన్, ఎలక్ట్రికల్ హీటర్. ఎలక్ట్రిక్ బల్బులయితే, మరోరకం విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చే ఎలక్ట్రిక్ మోటార్లు లాంటివి.
మొదటి రకం పరికరాల్లో వాటి గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహం (ఎలక్ట్రిక్ కరెంటు) ఓల్టేజి వర్గమూలానికి (square root) అనులోమానుపాతంలో ఉంటుంది. అందువల్ల సప్లయి అయ్యే విద్యుత్ ఓల్టేజి తక్కువగా ఉంటే, కరెంటు విలువలు కూడా తక్కువగా ఉంటాయి.
రెండవ రకం ఎలక్ట్రిక్ మోటార్ల విషయంలో అవి పనిచేయడానికి కావలసిన విద్యుత్ సామర్థ్యం (ఎలక్ట్రిక్ పవర్) ఆ పరికరాలపై, (మామూలుగా వాటు (watts)లేక కిలోవాట్ల (kw)లో) బిగించబడిన ప్లేట్లపై మార్కు చేసి ఉంటుంది. అలాంటి పరికరాల్లో ప్రవహించే ఎలక్ట్రిక్ కరెంటు, వాటికి అప్లయి చేసిన ఓల్టేజికి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే, అప్లయి చేసిన ఓల్టేజి విలువలు తక్కువగా ఉంటే వాటిపై పనిచేసే ఎలక్ట్రిక్ మోటార్లు చెడిపోతాయి. కారణం, అవి ఎక్కువ ఎలక్ట్రిక్ కరెంటును రాబట్టడంతో వాటిలో ఉండే విద్యుత్ ప్రవహించే తీగ చుట్టలు అతిగా వేడెక్కి కాలిపోతాయి.
- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- =====================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...