Monday, January 25, 2010

కావల్సినంత డబ్బు ముద్రించుకోలేమా?,Why can't we print enough money?








ప్రశ్న: కేంద్ర ప్రభుత్వంలో ఏ బ్యాంకు వారు కరెన్సీని తయారుచేస్తారు?మనం కావాల్సినంత కరెన్సీని ముద్రించుకొని నడుపుకోవచ్చుగా! విదేశాల నుంచి రుణం ఎందుకు తీసుకోవాలి?

జవాబు: చాలా మందికి కలిగే సాధారణ సందేహం ఇది. కరెన్సీకి స్వతహాగా ఏ విలువాలేదు. అది రాసుకోవడానికి కూడా ఉపయోగపడదు. ఎందుకంటే అందులో తెల్లగా ఉండే భాగం దాదాపు శూన్యం. కరెన్సీ కేవలం మారకం (exchange) కోసం ఏర్పరుచుకున్న మధ్యవర్తి (mediator) మాత్రమే! దేశంలో వివిధ రకాలైన ఉత్పత్తులు (products) ఉంటాయి. మానవశ్రమ కలవడం వల్ల వాటి మారకపు విలువ (exchange value) వస్తుంది. అటువంటి వస్తువులు, సేవలు, ఉత్పత్తులు ప్రజలకు అవసరం. ఏ వ్యక్తికీ అవసరంలేని ఉత్పత్తిని ఏ దేశమూ తయారు చేయదు.

కరెన్సీ గురించి కాసేపు మరిచిపోయి ఓ ఉదాహరణ చూద్దాం. మీరు, మీ స్నేహితుడు కలిసి కష్టపడి పెన్నులు తయారు చేశారనుకుందాం. ఇద్దరికీ ఆకలేసి ఫాస్ట్‌ఫుడ్‌ సెంటరుకు వెళ్లారు. అక్కడ మీకు దోశలు తినాలనిపించింది. ఫాస్ట్‌ఫుడ్‌ వాడికి పెన్నులు కావాలి. ఒక్కో పెన్నుకు ఒక్కో దోశనుకుందాం. మీరు రెండు పెన్నులు ఇస్తే తను మీకు రెండు దోశల టోకెన్లు ఇస్తాడు. ఆ టోకెన్లు మీరు కౌంటర్‌ దగ్గర ఇస్తే అక్కడ ఉన్న వంటవాడు మీకు దోశల్ని ఇస్తాడు. ఇక్కడ టోకెనుతో దోశను తాత్కాలికంగా మార్చుకున్నారు. కానీ టోకెనుకు స్వతహాగా పెన్నులాగా రాసే గుణం గానీ, దోశలా ఆకలి తీర్చే లక్షణం గానీ లేవు. పరోక్షంగా మార్చుకోబడినవి మాత్రం పెన్నులు, దోశలు. ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లో రకరకాల టిఫిన్లకు రకరకాల రంగుల టోకెన్లు పెట్టుకున్నట్టుగానే, వివిధ దేశాల్లో ఉన్న ఉత్పత్తుల్ని, సేవల్ని పరస్పరం వినిమయం చేసుకొనేందుకు వీలుగా కరెన్సీ అనే టోకెన్లను వివిధ డినామినేషన్లలో తయారు చేస్తారు. దోశల సంఖ్యనుబట్టి, పెన్నుల సంఖ్యను బట్టి టోకెన్ల సంఖ్య అవసరం అవుతుంది. అంతేగానీ టోకెన్లు ఎక్కువున్నంత మాత్రాన దోశలు, పెన్నులూ ఎక్కువ కావు కదా!

కరెన్సీని చట్ట బద్ధంగా రిజర్వు బ్యాంకు అధీనంలో ముద్రిస్తారు. చట్ట వ్యతిరేకంగా నేరస్తులు దొంగ నోట్లను ముద్రిస్తారు. విలువలేని దొంగ కరెన్సీకూడా సమాజంలో చలామణీ అవడం వల్ల కృత్రిమంగా ధరలు పెరుగుతాయి. పేదవాళ్లకు కష్టాలు అధికమవుతాయి. జాతీయ ఉత్పత్తికి అనుగుణంగా కరెన్సీ చలామణీ అయ్యేలా ముద్రిస్తారు.
=============================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...