ప్రశ్న: ఇసుక ఎలా ఏర్పడుతుంది?
జవాబు: మన భూమిపై ఉండే నేలలోని ఒక అంశం ఇసుక. ఇసుక సముద్రతీరాల్లో, ఎడారుల్లో 0.06 మిల్లీమీటర్ల నుంచి 2 మిల్లీమీటర్ల వ్యాసం గల రేణువుల రూపంలో విడివిడిగా ఉంటుంది. భూమిపై ఉండే ప్రతి 'శిల' (rock) వాతావరణ ప్రభావం వల్ల కాలం గడిచే కొలదీ అరుగుదలకు లోనవుతూ నిదానంగా వివిధ పదార్థాలుగా విడిపోతుంది. ప్రకృతి సహజమైన వర్షం, గాలి మంచు, వడగళ్ల ప్రభావం వల్ల పెద్ద శిలలు కూడా ముక్కచెక్కలవుతాయి. అవి ఎంత సూక్ష్మమైన భాగాలుగా మారినా వాటి రసాయనిక ధర్మాలలో మార్పు ఉండదు. కాని వాతావరణంలో అప్రయత్నంగా సంభవించే ఆసిడ్ వర్షాల లాంటి రసాయనిక సంఘటనల వల్ల ఆ శిలా భాగాలు ఖనిజాలుగా, అల్యూమినియం, ఐరన్ ఆక్సైడ్‌లుగా, సిలికాన్‌గా మార్పు చెందుతాయి. మారిపోయిన కొన్ని భాగాలు కలిసి బంకమన్నుగా మారితే, మరో రెండుభాగాలు ఇసుక (లేక quartz), స్లిట్‌గా మిగిలిపోతాయి. ఈ విధంగా శిలలు రూపాంతరం చెందడంలో గురుత్వశక్తుల ప్రమేయం కూడా ఉంటుంది. అలా ఏర్పడిన బంకమన్ను, స్లిట్, ఇసుక ఒకటిగా కలిసిపోయి 'లోమ్' అనే పదార్థం ఏర్పడుతుంది. శిల, లోమ్ రూపం సంతరించుకోవడానికి లక్షలాది సంవత్సరాలు పడుతుంది.
భూభాగం సముద్రపు అలల వల్ల కోతకు గురయినప్పుడు వేగంగా వీచే గాలుల ప్రభావం కూడా తోడవడంతో లోమ్ సముద్రపు లోతుల్లోకి చేరుకొని అక్కడి భూభాగం పై పరుచుకుంటుంది. అక్కడ నీటి వేగం ధాటికి లోమ్ మళ్లీ బంకమన్ను, స్లిట్, ఇసుకలుగా విడిపోతుంది. బంకమన్ను, స్లిట్ లోతుగా, నిశ్చలంగా ఉండే సముద్రపు అడుగుభాగానికి అంటుకొని పోతాయి. అన్నిటికన్నా ఎక్కువ పరిమాణంలో ఏర్పడిన ఇసుక సముద్రపు అలల ద్వారా తీరానికి కొట్టుకొని రావడం వల్ల సముద్రపు తీరాల్లో ఇసుక ఎక్కువ మేర పరుచుకుంటుంది. అలా ఏర్పడినవే సముద్ర తీరాలు, బీచ్‌లు. ఎడారుల్లో ఇసుక ఏర్పడేది కూడా శిలలు విచ్ఛిన్నమవడం వల్లే.
- ================================
visit My website > Dr.Seshagirirao - MBBS.
No comments:
Post a Comment
your comment is important to improve this blog...