Friday, January 29, 2010

ఊపిరితిత్తులు లేని జీవి ఏది ?, Lung less creature-Name?




భూమిపై అన్ని అవయవాలు ఉన్న జంతువులే కాదు... లేకుండా కూడా కొన్ని జీవిస్తున్నాయి. వీటికి అవయవాలు ప్రమాదవశాత్తూ తెగిపోవడం కాకుండా, పుట్టుకతోనే కొన్ని శరీర భాగాలు ఉండవన్న మాట. అలాంటి జీవినే గయానా దేశంలో శాస్త్రవేత్తలు కనిపెట్టారు. దీనికి వూపిరితిత్తులు, కాళ్లు, ఆఖరికి నాసికా రంధ్రాలు కూడా లేవు. చూడటానికి వానపాములా కనిపిస్తుంది. పరిశోధకులు దీనికి కాసిలిటా ఇవోక్రమా (Caecilita Iwokramae) అని పేరు పెట్టారు.

నీటిలో శ్వాసించే లార్వాగా జీవనం మొదలై, నేలపై కూడా శ్వాసించేలా శరీరాన్ని అభివృద్ధి చేసుకోగలిగే యాంఫిబియాన్‌ (ఉభయచర) జీవుల్లో మూడు రకాలు ఉన్నాయి. ఒకటి కప్పలు, రెండు బల్లిలా కనిపించే సాలమండర్స్‌, మూడు కాసిలియన్స్‌. కొన్ని అవయవాలు లేకుండా పుట్టే జీవులు ఈ కాసిలియన్‌ జాతిలోకి వస్తాయి. ఇప్పుడు కనుక్కొన్న ఈ కొత్త జీవి కూడా ఈ కోవకే చెందింది. ప్రపంచం మొత్తంమ్మీద 120 కాసిలియన్‌ జాతులు ఉంటే వీటిలో వూపిరితిత్తుల్లేనిది ఇదొక్కటే. విచిత్రమైన విషయం ఏంటంటే నేలపైన 11 సెం.మీ. పొడవు మాత్రమే పెరిగే ఇది, నీటిలో ఏకంగా రెండు అడుగుల వరకు ఎదుగుతుంది. 2008లో వూపిరితిత్తుల్లేని ఒక కప్పని కూడా కనుగొన్నారు.

వూపిరితిత్తులు, ముక్కు రంధ్రాలు లేకుండా ఇదెలా శ్వాస తీసుకుంటోంది?వీటి చర్మంపైన కంటికి కనిపించనంత సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల ద్వారా వాతావరణంలోని ఆక్సిజన్‌ను ఇవి పీల్చుకుంటాయి. అంటే చర్మం ద్వారా శ్వాస తీసుకుంటుందన్న మాట. వీటి కంటిచూపు కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. కర్ణాటక రాష్ట్రంలోని బెలగాంలో కూడా ఈ జాతికి చెందిన జీవులు ఈ మధ్యనే బయటపడ్డాయి. అసలు ఇలా కొన్ని రకాల జీవులకి ఎందుకు శరీరభాగాలు ఉండవో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. వాటి జాతి పరిణామ క్రమంలో మార్పులు వల్ల కూడా ఇలా జరుగుతుందని భావిస్తున్నారు.


=====================================================================

visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...