Friday, January 29, 2010

పెద్ద సరస్సు రంగులు మారుస్తుంది-రహస్యం ఏమిటి?, Lake changes colors-what is the Secret?




ఒకసారి నీలం రంగు... మరోసారి ఆకుపచ్చ.. ఇంకోసారి పసుపు.. ఇలా ఆ సరస్సు ఒకోసారి ఒకోలా కనిపిస్తుంది. అదే బ్రిటిష్‌ కొలంబియాలోని స్పాటెడ్‌ లేక్‌. ఏడాది పొడవునా రంగులు మార్చే ఈ సరస్సుని చూడ్డానికి పర్యాటకులు వేలాదిగా వస్తుంటారు. ప్రపంచంలోని ప్రకృతి వింతలో ఒకటిగా పేరు తెచ్చుకున్న ఈ సరస్సు యూఎస్‌, కెనడా రాష్ట్రాల మధ్య ఉంది. 38 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ సరస్సును చూసి ఇక్కడి ప్రాచీనులు భయపడేవారట. అదే ఇప్పుడు ఆ చుట్టుపక్కల వారు దీన్నొక పవిత్రమైన సరస్సుగా భావిస్తుంటారు.

ఇంతకీ ఇది ఇలా రంగులెలా మారుస్తుంది? ఎందుకంటే ఈ నీటిలో అత్యధిక శాతాల్లో రకరకాల ఖనిజాలు ఉన్నాయి. ఆయా ఖనిజాల శాతాన్ని బట్టి రకరకాల రంగులు కనిపిస్తూ ఉంటాయి. అదే వేసవిలో వెళ్లి చూస్తే మాత్రం అక్కడ చుక్క నీరు కనిపించదు. ఎండలు పెరిగే కొద్దీ నీరంతా ఇగిరిపోయి బురదంతా రకరకాల రంగుల్లో వలయాల్లాగా ఏర్పడుతుంది. ఈ వలయాల మధ్య నేలపై చక్కగా నడుచుకుంటూ వెళ్లచ్చు కూడా. ఆ సమయంలో ఏర్పడే ఖనిజాల తత్వాన్ని బట్టి ఈ వలయాలు పసుపు, నీలం, ఆకుపచ్చలాంటి రకరకాల రంగులతో ఏర్పడుతాయి.

సరస్సు నీటిలో ముఖ్యంగా మెగ్నీషియం సల్ఫేట్‌, కాల్షియం, సోడియం సల్ఫేట్‌ ఉంటాయి. వీటితో పాటు సిల్వర్‌, టిటానియం లాంటి మరో ఎనిమిది రకాల ఖనిజాలు కూడా కరిగిపోయి ఉన్నాయి. ఆయా కాలాల్లో ఈ ఖనిజాల మిశ్రమాల కారణంగానే సరస్సులో నీరు రంగులు మారుస్తూ ఉంటుందన్నమాట. ప్రపంచంలో ఇంతలా ఖనిజాలు అధికంగా కరిగి ఉండే సరస్సు ఇదే. వేసవి కాలంలో నీరు ఇగిరిపోయినప్పుడు ఈ ఖనిజాలే స్ఫటికాల్లా గట్టిపడతాయి. అవి రకరకాల రంగుల్లో కనువిందు చేస్తాయి. అందుకే ఈ చెరువుకు స్పాటెడ్‌ లేక్‌ అని పేరు వచ్చింది.

ఇక ఆ చుట్టుపక్కల ఉండే ప్రజలకు ఈ సరస్సంటే ఎంత ఇష్టమో. దీనిని 'కిలుక్‌' అని పిలుచుకుంటారు. ఈ నీటికి చర్మరోగాలను, అనారోగ్యాలను తగ్గించే గుణం ఉందని నమ్ముతారు. ఒంట్లో బాగోలేకపోతే ఇక్కడికి వచ్చి సరస్సులో పీకల్దాకా నుంచుంటారు. దెబ్బలు తగిలితే ఈ నీటిని తీసుకుని వెళ్లి పూసుకుంటారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఇక్కడి మట్టిని తవ్వించి దానిని తూర్పు కెనడా ప్రాంతంలో ఉన్న యుద్ధ సామాగ్రి తయారు చేసే పరిశ్రమలకు టన్నుల కొద్దీ తరలించారు.


  • ===============================================================

visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...