Tuesday, October 28, 2014

What happen if seasand used in construction, సముద్రపు ఇసుకతో ఇల్లు కడితే ఏమవుతుంది?

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  

ప్రశ్న:
సముద్రపు ఇసుక భవన నిర్మాణానికి పనికి రాదంటారు. ఎందుకు?

జవాబు: భవన నిర్మాణంలో ఇసుక, సిమెంటు, ఇటుకల్ని గోడల నిర్మాణానికి వాడతాం. భవనానికి నిలకడను, ఆయుర్దాయాన్ని, స్థిరత్వాన్ని ఇచ్చే చట్రంగా పిల్లర్లు, శ్లాబులు ఉపకరిస్తాయి. ఇందుకోసం ఇసుక, సిమెంటుతోపాటు కంకర, ఇనుప కడ్డీలను వాడతాం. ఇవన్నీ సరైన పద్ధతిలో, తగుపాళ్లలో కలిపితేనే భవనానికి దృఢత్వం, ఆయుష్షు సిద్ధిస్తాయి. కంకర, ఇనుప కడ్డీలు కఠినంగా ఉండటం వల్ల స్తంభాలకు, శ్లాబులకు గట్టిదనం వస్తుంది. వాటిని కలిపి బంధించే జిగురు లాంటి పదార్థమే సిమెంటు. కానీ ఇసుక లేకుండా సిమెంటును మాత్రమే వాడినట్లయితే తేలికపాటి ఉష్ణసంకోచవ్యాకోచాలు జరిగినట్లు సిమెంటులో బీటలు ఏర్పడే ప్రమాదం ఉంది.

తద్వారా భవనం కూడా కూలిపోగలదు. అంతేకాదు ఇసుక లేనట్లయితే సిమెంటును చాలా అధికంగా అదనంగా కూడా వాడవలసి ఉంటుంది. కానీ ఇసుకను కలిపినట్లయితే ఆ ఇసుక రేణువులు గట్టిపడిన సిమెంటుతోను, స్తంభాలు, శ్లాబుల్లో ఉన్న కంకర, ఇనుప రాళ్లతోను సంధానమై ఉష్ణవ్యాకోచసంకోచాలు సంభవించినపుడు షాక్‌అబ్సార్బర్స్‌లాగా కుషన్లుగా ఉపకరిస్తాయి. మరి ఆ ఇసుక రేణువుల ఉపరితలం ఎంతగరుగ్గా ఉంటే అంత సమర్థవంతంగా అవి రాడ్లను, కంకరను, సిమెంటును పట్టుకోగలవు. సముద్రపు ఇసుక సైజులో చాలా తక్కువగా ఉండటమే కాకుండా నునుపుగా ఉంటుంది. కాబట్టి సమర్థవంతంగా సిమెంటును సంధానించుకోవు. అందువల్ల ఆ ఇసుక భవన నిర్మాణాలకు వాడరు.

  • - ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;కన్వీనర్‌, శాస్త్రప్రచార విభాగం,
  • =====================

No comments:

Post a Comment

your comment is important to improve this blog...