ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న: రేడియం స్టిక్కర్‌లో మెరుపు దేని నుంచి వస్తుంది?
జవాబు: రేడియం స్టిక్కర్లలో వాడే పదార్థం రేడియం మూలకం కాదు. రేడియం మూలకం రేడియో ధార్మికత ద్వారా వెలుగును ఇవ్వడాన్ని మొదట మేడం మేరీక్యూరీ కనుగొన్నారు. అందుకనే ఆమెను 'రేడియం మహిళ' అంటారు. ఆ రేడియం పదార్థం రేడియో ధార్మికత ద్వారా వెలుగునిచ్చినట్లే, రేడియం స్టిక్కర్లు కూడా కాంతిని విరజిమ్మడాన్నిబట్టి 'రేడియం స్టిక్కర్లు' అంటున్నారు.
రేడియం మూలకపు వెలుగు, రేడియం మూలకపు కేంద్రకానికి (Nucleus) సంబంధించిన అంశం. కానీ రేడియం స్టిక్కర్ల ద్వారా వచ్చే వెలుగు కేంద్రకానిది కాదు. ఆ వెలుగు రేడియం స్టిక్కర్ పదార్థాల ఎలక్ట్రాన్ల ద్వారా వస్తుంది. రేడియం స్టిక్కర్లలో ఫ్లోరసెంట్ (Fluorescent) ధర్మంగల సేంద్రీయ, నిరింద్రియ పదార్థాలు వాడతారు. వీటిమీద సూర్యకాంతిగానీ, వాహనాల హెడ్‌లైట్ కాంతిగానీ పడ్డపుడు వాటిలోని ఎలక్ట్రాన్లు ఉత్తేజం (Excite) చెందుతాయి. దీన్నే కాంతి శోషణం అంటారు. ఉత్తేజం పొందిన ఆ ఎలక్ట్రాన్లు తిరిగి తమ పూర్వస్థానానికి చేరే క్రమంలో కాంతిని వెలువరిస్తాయి. ఇది అన్నివైపులకు ప్రక్షేపణ చెందుతుంది. ఆ వెలుగునే మనం చూస్తాము.
మరో రకమైన రేడియం స్టిక్కర్లను వాడుతున్నారు. రంగుల్లో ఉండే సాధారణ ప్లాస్టిక్ రిబ్బన్‌ల మీద చాలా సన్నని గాడులు ఉంటాయి. ఇటువంటి రిబ్బన్‌ల నుంచి అక్షరాల రూపాలను కత్తిరించి అతికిస్తారు. వీటిమీద వాహనాల కాంతి పడ్డపుడు ఆ కాంతి గాడులమీద వివర్తనం(Diffraction) చెంది వివిధ దిశల్లో పరిక్షేపణ చెందుతాయి. దాన్నే మనం స్టిక్కర్ల కాంతిగా చూస్తాం.
- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్,-వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- ============================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...