Friday, October 11, 2013

Moon light is not hot why?,సూర్యకాంతి లాగా వెన్నెల వేడిగా ఉండదెందుకు?,చందమామ చల్లగా ఉంటాడేం?

  •  
  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: సూర్యుడి కాంతి చంద్రుడి మీద పడి భూమిని చేరుతుంది కదా. మరి సూర్యకాంతి లాగా వెన్నెల వేడిగా ఉండదెందుకు? సూర్యకాంతి వేడిగా ఎందుకుంటుంది?

జవాబు: ముందుగా సౌరకాంతి చాలా వేడిగా ఎందుకు ఉంటుందో తెలుసుకుందాం. సౌరగోళం కేంద్రక సంలీన చర్య (nuclear fusion) ల ద్వారా విడుదలయ్యే అత్యధిక శక్తి నిలయం. ఇది ఎంత శక్తి అంటే సౌరగోళం లోపల ఉష్ణోగ్రత కొన్ని లక్షల సెంటీగ్రేడు డిగ్రీలుంటుంది. అలాంటి అగ్ని గోళం నుంచి విడుదలయ్యే కాంతి తీవ్రత చాలా హెచ్చుగా ఉండడం వల్ల మనకు అది వేడిగా అనిపిస్తుంది. కానీ సౌర కాంతి చంద్రుడి మీద పడ్డాక చాలా భాగం శోషించబడుతుంది(Absorbed). కేవలం కొంత భాగం మాత్రమే విస్తరణం (Scattering) చెంది అన్ని వైపులకూ వెళుతుంది. అందులో భాగాన్నే మనం వెన్నెలగా చూస్తాము.

మీరు తరగతిలో ఉపాధ్యాయుణ్ని, నల్లబల్లను చూస్తారు. అక్కడ పడ్డ కాంతినే మీరు చూస్తున్నారు. మనం చూసే అన్ని వస్తువుల నుంచి కాంతి మన కంటిని చేరడం వల్లనే ఆయా వస్తువులను మనం చూడగలుగుతున్నాం. కానీ ఆ కాంతి వేడిగా ఉండదు కదా! అలాగే చంద్రుడిమీద పడి మనల్ని చేరే సౌరకాంతి చాలా బలహీనంగా ఉంటుంది. అందుకే వేడిగా అనిపించదు.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య,-నిట్‌; వరంగల్‌, రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

చందమామ చల్లగా ఉంటాడేం? 26-May-2015

ప్రశ్న: 'చల్లని రాజా ఓ చందమామా' అంటూ మనం పిలిచే చంద్రుడు అలా చల్లగా ఎందుకుంటాడు? వేడిగా ఉన్న సూర్యకాంతినే ప్రతిబింబిస్తాడు కాబట్టి వేడిగా ఎందుకు ఉండడు?

జవాబు: 'చల్లని రాజా ఓ చందమామా' అని పిలిచేంత చల్లని భాగం, సూర్యుని కాంతిని ప్రతిబింబించే వేడి భాగం రెండూ చంద్రుడిపై ఉన్నాయి. మన భూమి తన చుట్టూ తాను ఓసారి తిరగడానికి పట్టే కాలాన్ని 'దినం' అంటారు. అంటే కేవలం 24 గంటల్లోనే ఒకసారి తన చుట్టూ తాను భూమి తిరగడం వల్ల సూర్యుడి కాంతి పడే భాగం పగలుగా సుమారు 12 గంటలు ఉండగా, సౌర కాంతి సోకని అవతలి భాగంలో రాత్రిగా మరో 12 గంటలు ఉంటుంది. తద్వారా భూమ్మీద రేయింబవళ్లు 24 గంటల వ్యవధిలోనే మారడం వల్ల వాతావరణం మరీ విపరీతంగా పగలు వేడెక్కకుండా మరీ విపరీతంగా రాత్రి చల్లబడకుండా ఉండి మనల్ని, ఇతర ప్రాణుల్ని రక్షిస్తోంది. కానీ చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి పట్టే భ్రమణకాలం దాదాపు 28 రోజులు. అంటే చంద్రుడి మీద సౌరకాంతి పడి మనము వెన్నెలగా కనిపించే సగభాగంలో అక్కడి నేల ఉష్ణోగ్రత సుమారు 200 డిగ్రీల సెల్సియస్‌ పైచిలుకు ఉంటుంది. అదే సమయంలో చంద్రుడికి ఆవలివైపు (మన వైపు కనబడని భాగం) సుమారు 14 రోజులు చీకటి ఉండటం వల్ల అక్కడి నేల ఉష్ణోగ్రత సుమారు -120 డిగ్రీల సెల్సియస్‌ ఉంటుంది. కాబట్టి మనకు కనిపించని అతి చల్లని చంద్రుడు, సలసల నీటిని మరిగించగల అతి ఉష్ణోపరితలముగా మనకు కనిపించే చంద్రుడు రెండూ ఆ చంద్రుడిలో అటూఇటూ ఉన్నాయి. ఇక సూర్యుడి కాంతి చంద్రుడిపై పడ్డాక ప్రతిఫలించి మనకు చేరుతుంది కాబట్టి ఆ వెలుగులో వేడి ఉండదు.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; కన్వీనర్‌, శాస్త్రప్రచారవిభాగం,--జనవిజ్ఞానవేదిక(తెలంగాణ)
  • ================================
 visit My website > Dr.Seshagirirao - MBBS.-

No comments:

Post a Comment

your comment is important to improve this blog...