ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్రశ్న: చీమ తన బరువుకన్నా 50 రెట్లు ఎక్కువ బరువును కూడా లేపుతుందట. మనిషి అలా చేయలేడెందుకు?
జవాబు: బరువు ఎత్తడం ఎత్తకపోవడం అనే విషయం కేవలం చిన్న ప్రాణి, పెద్ద ప్రాణి అన్న లక్షణానికే పరిమితం కాలేదు. శరీర నిర్మాణం, నేలకు బరువుకు మధ్య ఉన్న దూరం, ఎన్ని బిందువుల మీద నేలకు శరీరం తాకి ఉంది అన్న అనేక విషయాలు బరువు నెత్తే సామర్థ్యాన్ని నిర్ణయిస్తాయి. చీమ ఆర్థ్రోపొడ (కీళ్లు అధికంగా ఉన్న కాళ్లుగల) వర్గంలో కీటకాల తరగతికి చెందిన జీవి. ఇది చతుష్పాది (tetrapod) అంటే తాను ఎత్తే బరువు నాలుగు కాళ్ల మీదికి విభజన అవుతుంది. పైగా కాళ్లు గట్టిగా ఉన్న కైటిన్ అనే ప్రోటీన్ నిర్మితం. కాబట్టి తన బరువు కన్నా చాలా రెట్లు అధికంగా ఉన్న బరువును కూడా కొంత దూరం పైకి ఎత్తి పట్టుకోగలదు. తాను ఎత్తే బరువుకు నేలకు మధ్య ఉన్న దూరం కూడా తక్కువే ఉండడం వల్ల తనకు అవసరమయ్యే శక్తి కూడా తక్కువే ఉంటుంది. ఎందుకంటే పైకెత్తబడిన వస్తువు స్థితి శక్తి (potential energy) mgh ని కలిగివుంటుందని, దాన్ని ఎమ్‌జీహెచ్‌గా కొలుస్తారని తరగతుల్లో చదివే ఉంటారు. ఇక్కడ mg అంటే బరువు, h అంటే ఎత్తు అని అర్థం. కానీ మనిషి ద్విపాది (bipod). రెండు కాళ్ల మీదే భారమంతా పడుతుంది. కాబట్టి శరీర పరిమాణంతో పోల్చితే నాలుగు కాళ్లున్న చీమ రెండు కాళ్లున్న మనిషికన్నా ఎక్కువ బరువు ఎత్తడంలో ఆశ్చర్యం లేదు. అయితే చీమ తన బరువు కన్నా అయిదారు రెట్ల బరువును మాత్రమే ఎత్తగలదు కానీ 50 రెట్లు అధిక బరువును ఎత్తగలదనడంలో నిజం లేదు.
- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- ======================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...